అమెరికా కన్జ్యూమరోపాఖ్యానం1 - నచకి
ఈ పేజీ ని పంపండి

అమెరికా లోకి అడుగు పెట్టిన ఒక్క రోజులోనే నేను ట్రైన్ ఎక్కవలసి వచ్చింది. అప్పటి దాకా అమెరికా లో అన్నీ పద్ధతి ప్రకారం జరిగిపోతాయి అని అందరి లాగే నమ్మిన వాడిని నేను కూడా. నేను క్లెమ్సన్, సౌత్ కెరొలినా లోని రైల్వే స్టెషన్ కి వచ్చేసరికి దాదాపు నా రైలు కి టైము అయిపోయింది. ఆలస్యమవుతుందేమో అని ఆదరాబాదరాగా వచ్చాను. చూస్తే రైలు లేదు. మన దగ్గర (ఇండియా లో) ఉన్నట్టు ఏ స్టేషన్ మాస్టరో మరొకరో ఉంటే అడుగుదాము అనుకున్నాను, కానీ ఎవరూ లేరు - అంతా ఆటోమేటెడ్ సిస్టమ్స్ కదా! అక్కడే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ నుంచి రైల్వే ఎంక్వైరీ తాలూకు టోల్ ఫ్రీ నెంబర్ కి (హమ్మయ్య! బ్రతికించారు, ఇది టోల్ ఫ్రీ కాకపోతే నా డబ్బులన్నీ అక్కడే అయిపోయేవేమో!) కాల్ చేసి తెలుసుకున్నది ఏమిటీ అంటే పొద్దున 5:50 కి రావలసిన నా రైలు పదిహేను నిముషాలు ఆలస్యంగా నడుస్తోంది అని. పక్కనే ఉన్న నా స్నేహితుడిని గుర్రుగా చూసాను, వాడు ఎటో చూసాడు వెంటనే! అవును మరి, రాత్రంతా ఊదరగొట్టాడు "ఇక్కడ అంతా పద్ధతిగా ఉంటుంది, అదో గొప్ప రిలీఫ్ - మనకి అక్కడ దొరకనిది" అని! అలా "పదిహేను నిముషాలు" ఆలస్యంగా మొదలయిన నా రైలుబండి ఒక జీవితకాలం కాకపోయినా 3 గంటలు (మాత్రమే!) లేటుగా క్లెమ్సన్ చేరుకుంది. అప్పటికే నా స్నేహితుడు వెళ్ళిపోయే తొందరలో ముళ్ళ మీద ఉన్నట్టు ఉన్నాడు, నాకు US లో మొదటి రోజు కదా అని ఇప్పటి దాకానైనా మొహమాటపడి ఉన్నాడు, ఇక్కడ అందరూ బిజీ నే కద! ఎట్టకేలకు ఆ అందమైన రైలు లో నుంచి ఒకరిద్దరు దిగారు రైల్వే స్టాఫ్. వాళ్ళే నా రెండు సూట్ కేసులనీ (పేరుకు రెండే అయినా ఆ రెంటిలోనూ కలిపి సుమారుగా ఒక 80 కిలోల బరువైన సామానుంది - అప్పుడే కదా నేను అడుగుపెట్టటం ఇక్కడ!) పైకెత్తి రైలు లో పెట్టి "అంత బరువుగా ఉన్న సూట్ కేసులని నీలాంటి బక్క ప్రాణి (అప్పటికి అలాగే ఉన్నాను లెండి, పైగా వీళ్ళ ఆకారాలకి మనం ఎప్పటికైనా పీనుగులమే కదా!) ఎలా మోస్తాడో?" అన్నట్టు చూసారు న వైపు. నా మిత్రుడు రైలు వచ్చిందన్న ఆనందంలోనో, నేను వెళ్ళిపోతున్నానన్న బాధతోనో, లేక వాడి పనేదో ఆలస్యమయిందన్న ఏడుపుతోనో రెండు మూడు చుక్కల కన్నీళ్ళు రాల్చి నాకు వీడ్కోలు పలికాడు.

అలా మెల్లిగా క్లెమ్సన్ వదిలిన మా రైలుబండి తీరికగా అట్లాంటా కి వచ్చేటప్పటికి 10:20 అయింది టైము! ప్రయాణం సుఖంగానే ఉంది, కాదని అనను. కానీ, నా తొందర నాది - 11:40 కి నా ఫ్లైట్!! నా మిత్రుడు చెప్పిన ప్రకారం నేను మరో లోకల్ ట్రైన్ లో అక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళవచ్చు. కానీ రైలు అంటేనే భయం వేసి టాక్సీ తీసుకుందామని డిసైడ్ అయ్యి బయటికి వచ్చీరాగానే ఒక టాక్సీ డ్రైవర్ (చర్మం రంగులు వ్రాస్తాను అంటే నా చర్మం తీస్తారు వీళ్ళు!) నా సామాను చొరవగా తీసుకున్నాడు నేను తన వైపు 10 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు చూసిన పాపానికి! వాడి నడకని అందుకుంటూనే అడిగాను "ఎంత?" అని, ఇంగ్లీష్ లోనే లెండి. "It's just $25!" అన్నాడు వాడు "ఇంత కూడా ఇవ్వలేవా నీ దేభ్యం మొహానికి? మరి ఇంత పెద్ద సూట్‌కేసులు ఎందుకు నీకు?" అన్నట్టు తన మొహాన ఎక్స్ ప్రెషన్ పెట్టి. చచ్చినట్టు వాడి వెంట వెళ్ళాను, నాకా సమయంలో విజయవాడలో రిక్షా వాడు గుర్తొస్తే తప్పు నాదా?! వాడు అడిగింది ఎక్కువో కాదో తెలియదు - అసలు నేను వెళ్ళవలసిన దూరమెంతో తెలియదు! మీటర్ వేస్తాడా? అసలు మీటర్ టాక్సీ లాంటివి ఉంటాయా? అన్న అనుమానానికి తావే లేదు. నాకు కావలసినది పదకొండు గంటలకల్లా ఎయిర్ పోర్ట్ చేరటం - వాడు "చేరుస్తాను" అన్నాడు, అంతే! సామాను నా దగ్గరి నుంచి తీసుకున్నపుడు ఉన్న చొరవ చివరి దాకా లేదు - నా సామాను నేనే ఎక్కించుకున్నాను టాక్సీలో. మీటర్ వేస్తే ఎంతవుతుందో తెలియదు కానీ నన్ను టాక్సీలో అట్లాంటా మొత్తం తిప్పాడేమో అనిపించేంత సేపు తిప్పి ఆఖరికి ఎయిర్ పోర్ట్ ముందు ఆపాడు.

నా మిత్రుడికి కాల్ చేద్దామనుకుని ఎయిర్ పోర్ట్ అంతా వెతికినా AT & T కాలింగ్ కార్డ్ కన్నా మంచిదేదీ కనిపించలేదు. అదే కొన్నాను ఇరవై నిముషాలకి పది డాలర్లు పెట్టి!! (కాలింగ్ కార్డ్స్ గురించి అంతగా తెలియని వాళ్ళకు - మామూలుగా మార్కెట్ లో మిగిలిన కాలింగ్ కార్డ్స్ లో ప్రస్తుతం అతి తక్కువ ఖర్చు అయ్యేది నిమిషానికి 2.9 సెంట్లు, అంటే పది డాలర్లకు 340 నిముషాల పై మాటే, అంటే పదిహేడు రెట్లు ఎక్కువ!!) నా సామాను బరువు తూచి గుండెలు బాదుకున్నాడు అక్కడ డెల్టా ఎయిర్ లైన్స్ స్టాఫ్! పెనాల్టీ కట్టమంటాడు $150, ఓవర్ వైట్ కి! "బాబోయ్!" అనుకున్నాను, బ్రతిమాలాను. ఇండియాలో మీ డెల్టా ఎయిర్ లైన్స్ వాళ్ళేమీ అడ్డు చెప్పలేదు, నేను వాళ్ళని అడిగాను అని కూడా (నిజమే!) చెప్పాను. "Sorry buddy, we follow rules here!" అన్నాడు. "మరి అక్కడ మీ వాళ్ళేం ఫాలో అవుతారు?" అని వ్యంగ్యంగా అనబోయి తమాయించుకున్నాను "అనువు గాని చోట..." పద్యం గుర్తుకు వచ్చి, పైగా అవసరం నాది కద, కాస్త ఎక్కువ మాట్లాడితే వాడు పెనాల్టీ పెంచేట్టు ఉన్నాడు! "Anybody speak Hindu (హిందీ కి వాళ్ళు పెట్టిన ముద్దు/మొద్దు పేరు)?" అని అందరినీ అడుగుతూ నన్ను గేలి చేస్తున్నాడో తెలియదు, వాడికి నా బాధ/భాష అర్థం కావట్లేదో తెలియదు, నటిస్తున్నాడేమో అంత కన్నా తెలియదు! ఎలాగో కష్టపడి వాడిని $50 కి బేరమాడేసరికి నా తల ప్రాణం సూట్‌కేస్‌లోకి వచ్చింది! ఫ్లైట్ మిస్ అయితే కట్టవలసిన దాని కన్నా ఇదే తక్కువ అనిపించిందేమో నాకే, వచ్చే దుఃఖం ఆపుకుంటూ కట్టాను ఆ $50 ట్రావెలర్ చెక్ రూపంలో. దాన్ని వాడు అటు తిప్పి, ఇటు తిప్పి చూసి నేను ఇచ్చిన ఆ చెక్ తీసుకోవచ్చో లేదోనని ముగ్గురిని అడిగి, వాళ్ళు మరో ఇద్దరిని అడిగి మొత్తానికి ఒప్పుకుని నన్ను గట్టెక్కించారు అంతా కలిసి. ఎలాగో వచ్చి పడ్డాను నా గమ్యంలో (మన్రో, లూవిసియానా)!

అక్కడ మరో ప్రహసనం! నా సూట్‌కేసులు పెట్టటానికి కార్ట్ తీసుకుందామంటే దానికో రెండు డాలర్ల చదివింపు ఉంది. ఈ "నిర్బంధిత దక్షిణ" అట్లాంటాలో చూసినా అక్కడ తన తల్లికి సూట్‌కేసులు కన్వేయర్ బెల్ట్ మీద నుంచి దింపి ఇచ్చినందుకు గానూ (అలా అని తక్కువ చేయట్లేదు ఈ సహాయాన్ని!) నాకు ప్రత్యుపకారంగా ఓ కార్ట్ తెచ్చి ఇచ్చాడు మరో భారతీయుడు. ఇక్కడ, అంటే మన్రోలో కార్ట్ (స్మార్ట్ కార్ట్ అంటారు వీళ్ళు, స్మార్ట్ గా కార్ట్ కి డబ్బులు లాక్కుంటారనేమో) తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా (ఎయిర్ పోర్ట్ చాలా చిన్నది, లేకపోతే తీసేసుకునే వాడిని మరో ఆలోచన లేకుండా!) మరో airport staff (uniformని బట్టి ఊహించుకున్నాను) వచ్చి "Give me the same $2 and I'll get your bags to your car and will load them in it" అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది "ఇక్కడ కూడా ఎయిర్ పోర్ట్ కి రావలసిన డబ్బులు దారి మళ్ళిస్తారా స్టాఫ్ తామే దగ్గరుండి?" అని! సరే, ఒక సగటు కస్టమర్‌గా ఆ రెండు డాలర్లు వీడికే ఇస్తే ఈ సూట్‌కేసులు ఎత్తి కార్‌లో కూడా పెడతాడు కదా అని ఒప్పుకున్నాను. నన్ను పికప్ చేసుకోవలసిన ఫ్రెండ్స్ రావటం కాస్త ఆలస్యమయింది ఎందుకనో. మొత్తానికి వాళ్ళు వచ్చాక చూద్దును కదా....ఇంకా ఎక్కడండీ వాడు? నేను రెండు డాలర్లు చేతిలో పెట్టగానే తుర్రుమంటే!! తప్పు నాదే కదూ ముందు డబ్బులు ఇవ్వటంలో?!

మరిన్ని ఎపిసోడ్ లు మరో సారి....

* * End * *

ఈ వ్యాసాల రచయిత "NaChaKi" కి అమెరికాలో ఎదురైన పరిస్థితులే ఈ "అమెరికా కన్జ్యూమరోపాఖ్యానము". మీ సూచనలూ, విమర్శలూ పంపవలసిన Email-id: