తిరిగొచ్చిన దేశీ : హైదరాబాద్ శం షాబాద్ విమానాశ్రయం- SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి
హైదరాబాద్ శం షాబాద్ విమానాశ్రయం మొదలు పెట్టడం దగ్గర నుంచీ చాలా హడావిడి. అది మొదలు, బేగంపేట మురికి విమానాశ్రయం మూసివేత దాని గురించి విమానాశ్రయం సిబ్బంది చేసిన మెరుపు సమ్మె, దాని విరమణ, విమనాశ్రయం మొదలు కాకుండానే అక్కడ ప్రత్యక్షమైన ఒక అభాగ్యుడి మృతదేహం, వర్షానికి చూరునుండి కారుతున్న వర్షం నీరు విమానాలు లేండింగ్ లో జరిగిన కొన్ని అపశృతులు ఇలా బోలెడన్ని వార్తలు. వాటి మధ్య నా విమానం బయలుదేరే టైము కి ఈ శం షాబాద్ విమానాశ్రయం పూర్తిగా పని మొదలు పెడుతుందా లేక నేను వెళ్ళే టైముకి మురికి విమానాశ్రయమే గతా అని మా ఇంట్లో నా ప్రయాణం ప్రస్తావన వచ్చిన ప్రతీ సారీ ఒక చిన్న పాటి చర్చ జరుగుతూ వుండేది. బేగంపేట ని నేను మురికి విమానాశ్రయం అని అనటం ఎవరికైనా కాలి వుంటే, ఒక సారి CNN-IBN వారి సర్వే వివరాలు చదవాలని మనవి. వారి ఫలితాల్లో మన మురికి విమానాశ్రయం అఖరి స్థానం లో వచ్చింది.

ఏమైతేనేం, నా ప్రయాణం రోజుకి శం షాబాద్ విమానాశ్రయం పూర్తిగా పనిచేయటం మొదలయింది. అప్పటికి నలుగైదు రోజుల నుండి పని చేసి వుండటం తో అక్కడి సిబ్బంది కి విమానాలు దింపటం, గాల్లోకి ఎగిరించటం గురించి కొంచెం అన్ని అర్థం అయి వుంటాయి. పైలెట్లు కూడ ఇక్కడ శం షాబాద్ విమానాశ్రయం లో వున్న వరల్డ్ క్లాస్ టెక్నాలజి గురించి కొంచెం నేర్చుకుని వుంటారు అని ధైర్యం వచ్చింది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను ట్రాఫిక్ కంట్రోల్ మాత్రం ఇంకా బేగంపేట నుండే చేస్తున్నారుట.

విమానాశ్రయానికి వెళ్ళటానికి మూడు నుండి నాలుగు గంటలు పడుతోందట.. ఎవరో అమ్మలక్క చెప్పిన విషయం. నేను వెళ్ళాల్సింది మియాపూర్ నుండి. కనుక ఎన్ని గంటల ముందు బయలుదేరాలో అనుకున్నాము. నా విమానం తెల్లావారుఝామున మూడున్నర కి. కనుక ఇంట్లో మేంఉ తొమ్మిదిన్నర కే బయలుదేరాము. ఏమైనా ఎక్కువ టైము వుంటే అక్కడ వున్న డ్యూటీ ఫ్రీ షాపులు ఒక రౌండ్ వేయచ్చు అనే ఆలోచనతో.

ఆశ్చర్యం గా మేము మియాపూర్ నుండి వెళ్ళటానికి ఒక గంటంపావు మాత్రమే పట్టింది. మధ్యలో గాస్ స్టాప్ తో కలుపుకొని. మా అక్క పిల్లలకి మళ్ళీ మర్నాడు స్కూలు వుండటం చేత వాళ్ళని ఇంక రావద్దని నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపల చెప్పద్దూ.. విమానాశ్రయం తెరచి నాలుగు రోజులే అవటం కారణమో లేక దీనిని బేగంపేట మురికి విమానాశ్రయం మాదిరి నిర్వహించకూడదు అని GMR సంస్థ వారి ఆశయం కావచ్చు, చాలా నీట్ గా వుంది. గేటు దగ్గరే పోలీసులు వుండి టికెట్ వున్న వారిని మాత్రమే లోపలికి పంపాలనే ఉద్దేశం తో మా ఐటినెరీ లేక టికెట్ ని అడిగి చూస్తున్నారు. నాకు అర్థం కాలేదు, మిగిలిన ప్రతీ విమానాశ్రయం లోనూ సెక్యూరిటీ చెకింగ్ దాటి టికెట్ లేని వాళ్ళని వెళ్ళనీయరు. అంతవరకూ ప్రయాణీకుల కూడా వచ్చిన వాళ్ళని లోపలికి విమానాశ్రయం లోనికి రానిస్తారు. మరి మన దేశం జనాభ ఎక్కువ, ఆ కారణం చేత ప్రయాణీకులని దిగబెట్టడానికి వచ్చేవాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ, వాళ్ళందరూ లోపలికి దూరిపోతే ఎన్ని వందల ఎకరాల్లో కట్టిన విమానాశ్రయం అయినా ఇరుకు విమానాశ్రయం లానే అనిపిస్తుంది అని అనుకుని వుంటారు.

నాకు చాలా బాధ వేసినా, అసలు నచ్చని విషయం అదే. డబ్బు చేసుకునే ఆలోచన కూడా అయి వుండవచ్చు ఈ ప్రయాణీకులు కాని వాళ్ళని లోపలికి అనుమతించకూడదు అనే నిర్ణయానికి కారణం. మన దేశం లోనే ఎందుకు ఈ రకం (ఎన్ని వందల దేశాలు చూసావేమిటి అని ప్రశ్నిస్తున్నారా? నేను చూసిన పాతిక పైన విమానాశ్రయాల అనుభవం తో అంటున్న మాట) నిబంధనలు? ఇంకో విషయం ఎక్కడా ఏ విమానాశ్రయం లోనూ చూడనంత మంది పోలీసులని మన దేశం విమానాశ్రయాల్లో చూసాను. అలాగే మేన్యుయల్ చెకింగ్ కూడా. ఎందుకు ఇక్కడ ఇన్ని చెకింగ్ లు అనేది అర్థం కాదు. మనుషులు ఎక్కువ మన దేశం లో వున్నారు కదా అని ప్రయాణం లో స్టెప్ లు కూడా పెంచేయాలా? రెండు గంటల ప్రయాణం ఈ మితిమీరిన చెకింగ్ ల వలన అయిదు గంటల సమయం తీసుకుంటుంది.

ఇంక లోపల విషయానికి వస్తే, పత్రికలలో చదివినట్టు గానే చెకిన్ కౌంటర్లు చాలానే వున్నాయి. వాటిలో నా Northwestern/KLM కౌంటర్ ఎక్కడ వుందో వెతికితే ఎక్కడా కనిపించలేదు. చివరకి అక్కడి సిబ్బంది ని అడిగితే "తొందరపడి ఒక కోయిలా ముందే వచ్చిందీ" అని నవ్వుకుని ఇంకా కౌంటర్లు తెరవలేదు అని చెప్పారు. లోపలికి వెళ్తే కానీ ఏమీ షాపులు లేవు. కనుక అక్కడ వున్న లైన్ లో నుంచున్నాను. నాకు తరువాత అర్థం అయిన విషయం ఏమిటంటే ఆ లైన్ లో వున్న వాళ్ళు అందరూ నేను వెళ్తున్న విమానం లోనే ప్రయాణించేవాళ్ళు. వాళ్ళు కూడ నాలాగే పేపర్ల లోని exaggerated విమానాశ్రయానికి ప్రయాణం టైము గురించి చదివి ఏవేవో అపోహలు పడి ముందు బయలుదేరి వచ్చేసిన వాళ్ళు అయివుంటారు లేక నేను వచ్చిన రోజు హైదరాబాదు జనాలు నాకు రోడ్డు మీద అడ్డం రావటం ఎందుకు అని ఇళ్ళల్లో కూర్చుని వుంటారు.

కౌంటరు తెరిచాక నాకు గుర్తు వచ్చింది నేను నా బేగ్ లకి ఎక్కడా ఎడ్రస్ టాగ్ లు కానీ మన వాళ్ళు టిపికల్ గా తమ సామానుకి రాసి అతికించే అరఠావు పేపరు మీడ H1-24 ఫాంట్ పేరు ఎడ్రస్ కానీ రాయలేదు అని. ప్రక్కనే లుఫ్తాన్సా, ఎయిర్-ఇండియా విమానాల తాలూకు చెకిన్ జరుగుతోంది. లుఫ్తాన్సా వాళ్ళ దగ్గర కూడా ఎడ్రస్ టాగ్ లు లేవు. ఒక్క ఎయిర్-ఇండియా కౌంటర్ల లో వారి ఎడ్రస్ టాగ్ లు వున్నాయి. KLM లో ప్రయాణిస్తూ ఎయిర్-ఇండియా ఎడ్రస్ టాగ్ లు ఏం ఉపయోగించుకుంటాను, నా వంతు వచ్చినప్పుడు అడగచ్చు లే KLM వాళ్ళ ఎడ్రస్ టాగ్ లు ఇవ్వమని అని ఊరుకున్నాను. అక్కడ వ్యక్తి ని అడిగాను అయినప్పటికీ ఉండబట్టలేక. దానికి అతను కేబిన్ లగేజ్ టాగ్ ఇచ్చారు. దాని మీద కేబిన్ లగేజ్ అని వుంది. అది చూడక నేను నాకు నాలుగు కావాలి అని అడిగాను. దానికి ఆయన కేబిన్ లోకి నాలుగు బేగ్ లు అనుమతించరు అని చెప్పారు వెర్రిదానిని చూసినట్టు ఓ చూపు చూసి. కొంచెం ఎక్కడో కాలి, ఆయన ఇస్తున్న టాగ్ లని కొంచెం పరీక్షగా చూసాను. ఆయన ఆ మాట ఎందుకు అన్నారో అర్థం అయి, నాకు ఇవి కాదు ఎడ్రస్ టాగ్ లు కావాలి అని చెప్పాను. లేవు, అయినా అక్కర్లేదు మేము మా చెకిన్ టాగ్ లు తగిలిస్తాము కదా అవి చాలు లెండి అన్నారు.

ఎయిర్ పోర్ట్ లో సిబ్బంది అందరూ తెలుగు లో మాట్లాడుతున్నరు. అంటే మన తెలుగు వారికి బానే ఉద్యోగావకాశాలు కల్పించి వుంటుంది ఈ విమానాశ్రయం. ఒక విషయం మాత్రం నాకు భలే నవ్వు వచ్చింది. సెక్యూరిటీ కి సంబంధించిన ప్రకటనలు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో చేస్తున్నారు. ఆ ప్రకటనలు చేసే అమ్మాయి, అబ్బాయిలకి "శ" కీ "ష" కీ మధ్య వున్న తేడా తెలీదు. అది కాదు నాకు నవ్వు వచ్చిన విషయం, అది బాధ కలిగించే విషయం. ఇంక నవ్వు వచ్చిన విషయం..అదే ప్రకటన.. "దయచేసి మీ వస్తువులు ఒంటరిగా వదిలేయవద్దు. ఒంటరిగా కనబడిన వస్తువులని జప్తు చేసుకోబడుతుంది" ఒంటరి వస్తువు అని వాళ్ళు అంటున్న ప్రతీ సారి నాకు నవ్వు భలే వచ్చింది.

నేను బోస్టన్ కి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి రెండున్నర ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి Harry Potter సినిమాకి వెళ్ళాను. ఆ రోజు వర్షం లో బేగ్ లోంచి ఎదో తీస్తున్నప్పుడు నా పాస్ పోర్ట్ క్రింద వర్షం నీళ్ళలో పడిపోయి పూర్తిగా తడిసిపోయింది. అప్పటి నుండి నేను ప్రయాణం చేసిన ప్రతీసారి పాస్ పోర్ట్ ని మీ కుక్క పిల్ల తినేయబోయిందా, దీనికి స్నానం చేయించావా వగైరా ప్రశ్నలు వింటుంటాను. కానీ ఎప్పుడూ ఎవరూ అలాంటి పాస్ పోర్ట్ తో ప్రయాణం చేయటం గురించి అభ్యంతరం పెట్టలేదు. ఇక్కడ మాత్రం చెకిన్ కౌంటర్ లో అబ్బాయి తన పై ఆఫీసర్ ని పిలిచి ఈవిడ పాస్ పోర్ట్ తడిసిపోయి వుంది మరి దీని మీద ఈవిడని విమానం ఎక్కనివ్వచ్చా అని అడిగి ఆయన దానిని తీసుకొని అందులోని ప్రతీ పేజీ నీ నిశితం గా పరిశీలించి, పర్లేదు అని చెప్పిన తరువాత నాకు నా బోర్డింగ్ పాస్ లు ఇచ్చారు.

బోర్డింగ్ టైము కి మూడు గంటల ముందుగా నా గేట్ కి చేరుకున్నాను. అక్కడ "The Coffee Club" అని ఎదో కాఫీ షాప్ వుంది ప్రక్కన ఇండియన్ డిలైట్ లాంటిది ఎదో కూడా వుంది. ముందు డ్యూటీ ఫ్రీ షాప్ లో ఏమున్నాయో చూద్దాం అని చూస్తే అన్నీ రకరకాల విస్కీ లు స్కాచ్ కు వున్నాయి అంతే. వాటిని దగ్గరగా వెళ్ళి చూస్తే మరి ఏం ఆలోచనలు వచ్చయో ఒక రకం ట్విస్టెడ్ నవ్వులు (నా అనుమానం కూడా అయి వుండొచ్చు) నవ్వుతూ తో అక్కడి వాళ్ళు వెనకాల వచ్చి నుంచోవటం.. ఏం కావాలి అని అడుగుతూ! నాకు బాగా నచ్చిన షాప్ అక్కడి బుక్ షాప్. ప్రస్తుతం జాతీయం గా, అంతర్జాతీయం గా టాప్ టెన్ లో వున్న బెస్ట్ సెల్లర్స్ తో సహా మన దేశపు ప్రముఖ రచయితల పుస్తకాలు అన్నీ అక్కడ వున్నాయి. ఐసింగ్ ఏమిటంటే అవి ఇండియన్ రేట్లలో దొరకటం. నేను కొన్న నాలుగు పుస్తకాలకీ కేవలం మూడువందల యాభై మూడు రూపాయలు మాత్రమే అయింది.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను బోస్త్రన్ వచ్చేసాక ఒక ఫ్రెండ్ అడిగాను నా శం షాబాద్ విమానాశ్రయం అనుభవం గురించి. అక్కడ అన్నీ చలా ఖరీదుట కదా, కాఫీ యాభై పైనే వుందట కదా అని అడిగారు. నిజమే కాఫీ యాభై పైనే వుంది. కానీ, ఆంస్టర్డాం విమనాశ్రయం లో అయితే అదే కాఫీ కి అయిదు అమెరికన్ డాలర్లు ఖర్చు చేయవలసి వచ్చింది. పోనీ యూరో తో conversion రేట్ ఎక్కువ అనుకుంటే, ఇక్కడ చీప్ కాఫీ దొరికే Dunken Donuts లో కూడ అటూవంటీ కాఫీ కోసం దాదాపు రెంట్టీంపు ధర పెడతాము. వసతులు, సౌకర్యాలు దగ్గరకి వచ్చేసరికి అన్నీ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కావాలి. అన్నీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వాడే వసతులు, గాడ్జెట్ లు కావాలి. కానీ ఖర్చు విషయానికి వస్తే మనం వీధి చివర కాకా హోటల్ లో ఇచ్చే అర్థరూపాయి కి కాఫీ ఇచ్చేయాలి! ఏమిటో పిచ్చితనం!

మన దేశీ విమానాశ్రయాల గురించి వినే అతి పెద్ద కంప్లైంట్ విమానాల రాకపోకలూ, ఫ్లైట్ టైముల మార్పుల గురించిన ప్రకటనలు అస్సలు ఎదో రహస్యం చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు ఎక్కడా వినిపించవు, ప్రయాణీకులు దాని వలన చాలా ఇబ్బందులు పడాలి అని. కానీ నా ఫ్లైట్ కోసం నేను లోపలికి మూడు గంటల ముందుగా వెళ్ళి వుండట తో ఓ కునుకు తీసాను. ఈ లోగా నా గేట్ మార్చారుట. నాకు దాని గురించి బాగానే వినిపించింది కారణం స్పష్టం గా మూడు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు) సిబ్బంది చేసిన ప్రకటనలు. పైగా వాకీ టాకీ లతో తిరుగుతున్న విమానాశ్రయం సిబ్బంది వచ్చి మా పాత గేట్ దగ్గర కూర్చున్న ప్రతీ వారికీ ఆ విషయం మరోసారి చెప్పారు. కొత్త గేట్ కి వెళ్ళాల్సిన దారి ని చక్కగా గైడ్ చేసారు.

మన పోలీసులకి ఇచ్చే ఖాకీ రంగు బట్టలు నాకు అంతగా నచ్చవు. ఒక అఫీషియల్ లుక్ వున్నట్టు అనిపించవు. ఎంత ఇస్త్రీ బట్టలు వేసుకున్నా విమానాశ్రయం లో చాలా ఎక్కువ గా కనిపించిన ఈ ఖాకీలు ఏమిటో అంత అఫిషియల్ గా అనిపించలేదు. ఇంక చెకిన్ కౌంటర్లలో సిబ్బందీ ఇతర విమానాశ్రయ maintenance సిబ్బంది అంతా చిన్నపిల్లలు. వయసు పైబడ్డ వాళ్ళు అసలు ఎక్కడా కనిపించలేదు వాళ్ళలో. అమ్మాయిలు అయితే అందరూ స్టాకింగ్స్ తో టైట్ స్కర్ట్, షర్ట్ లతోనూ, అబ్బాయిలు టక్ చేసి టై పెట్టుకొనీ వున్నారు. వీరికి అందరికీ నల్ల డ్రస్ లు అనుకుంటా (మర్చిపోయాను). క్లీనింగ్ స్టాఫ్ కి తెలుగుదేశం పసుపు రంగు డ్రస్. వాళ్ళు ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ఇక్కడి జెనెటర్ స్టాఫ్ మాదిరి ఓవరాల్ టైపు సూట్ లలో కనిపించారు.

ఎటువంటి అవాంతరాలూ లేకుండా టైముకి బోర్డింగ్ మొదలయి విమానం టైముకి టేకాఫ్ అవటం తో శం షాబాద్ కి మళ్ళీ కలుస్తాను అని చెప్పి వీడ్కోలు చెప్పాను.

* * *

మొత్తం ప్రయాణం లో ఏ రకం అపశృతీ లేకుండా ప్రయాణించటం నాకు ఎలా సాధ్యం? అదీ జరిగింది ఈ ప్రయాణం లో. కాకపోతే శం షాబాద్ విమానాశ్రయం లొ కాదు, మన RTC వారి గరుడ బస్ వారి వలన.

కాకినాడ నుండి వచ్చేప్పుడు గరుడ వోల్వో బస్ తీసుకో, దానిలో అయితే సామాను కొంచెం ఎక్కువ తేవచ్చు అని మా అక్క చెప్పింది. వచ్చేప్పుడు మియాపూర్ బస్ స్టాండ్ అని చెప్పు మేము అక్కడకి వస్తాం అని కూడా చెప్పింది. నేను బస్ కండక్టర్ కి మియాపూర్ బస్ స్టాండ్ అని చెప్తే, అఖరున వస్తుంది అని అతను నా సామాను వెనక్కి పెట్టారు. విజయవాడ దారి లో బస్ టైరు పేలిపోవటం తో రెండు గంటలు ఆలస్యం గా హైదరాబాద్ చేరాక మళ్ళీ చెప్పాను మియపూర్ వచ్చినప్పుడు చెప్పండి అని. మా అక్క వాళ్ళ ఇంటి ఎడ్రస్ నాకు తెలీదు పోలీస్ స్టేషన్ దగ్గర అని తెలుసు అంతే. ఫోన్ నెంబర్ గుర్తు వుంది. సెల్ ఫోన్ ఇంక అవసరం ఏముందీ అని ఇండియా లో కొన్న సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలేసాను. ఇంతకీ బస్ లో మియాపూర్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పినప్పుడు అతనికి నేను మియాపూర్ బస్ స్టాండ్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పాలంట, అతనికి మియాపూర్ బస్ స్టాండ్ దాటిపోయాక గుర్తు వచ్చి ఒక జంక్షన్ దాటాక ఇక్కడ దిగిపోండి అన్నారు. అదేమిటీ బస్ స్టాండ్ అన్నాను కదా అంటే, ఆ విషయం ముందు చెప్పాలి దాటిపోయాం ఒక జంక్షనే, మీ వాళ్ళకి ఇక్కడకి రమ్మని చెప్పండి అనేసారు ఖరాఖండీగా. నాకు వల్లమాలిన కోపం వచ్చి, కిందకి దిగి నా సామాను తీసి ఇస్తున్న అతని మీద "నా సామాను మీద చెయ్యి వేసావంటే మర్యాద దక్కదు" అని హుంకరించి విసురుగా వాటిని అతని చేతిలోంచి లాక్కున్నాను నాకు వచ్చిన బాషలన్నిటిలో అతన్ని అతనికి వినీ వినపడకుండా బండ బూతులు తిట్టుకుంటూ. ఆ విసురు కి రెండూ అక్కడ ముందు రోజు వర్షానికి మడుగు కట్టిన వర్షపు బురద నీటిలో వెళ్ళి ఒకదాని వెనుక ఒకటి పడ్డాయి. అతని ముందు అయ్యో అని అతనికి ఒక రకమైన satisfaction ఇవ్వలేక నా "పొగరు" లేక "విసురు" కి నోరు తెరుచుకొని చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా ధడ్ ధడా వెళ్ళిపోయాను.

అక్కడ ఫోన్ కోసం చూస్తే పబ్లిక్ ఫోన్ కి రోడ్డు దాటి వెళ్ళాలి అన్నారు రోడ్డు దాటుదాం అంటే జనసముద్రం లోంచి ఈదుకొంటూ వెళ్ళాలి. పది నిమిషాలు అక్కడ వెళ్తున్న ఆటోలు ఆపి మియాపూర్ బస్ స్టాండి కి వస్తారా అని అడిగి, వాళ్ళు రాము అని వెళ్ళిపోవటం (మరి అది పక్కనే వుంది అది.. నాకు తెలీదు) ఆఖరికి ఒక ఆటో అతను యాభై రూపాయలకి వస్తాను అన్నారు. (ఆటో రివర్స్ చేసి ముందు జంక్షన్ కి తీసుకొని వెళ్ళటానికి!) సరే రమ్మని ఎక్కాను కానీ మళ్ళీ బుద్ధి మారిపోయి, ఒక సారి ఫోన్ దగ్గర ఆపండి, మా వాళ్ళ ఇల్లు ఇక్కడే, ఇంటికి వచ్చేయమంటారెమో కనుక్కుంటాను అని ఆటో ఆపుకున్నాను. (ఫోన్ అంటే గుర్తు వచ్చింది, బస్ దిగగానే ఫోన్ కోసం రోడ్ దాటడం కష్టం గా వుంది, పోనీ ఎవరినైనా ఫోన్ అడిగి ఒక కాల్ చేద్దాం అని నా పక్కన వున్న ఇద్దరు అమ్మాయిలని ఫోన్ ఒకసారి ఇస్తారా అని అడిగితే, ఒక అమ్మాయి మినిట్స్ ఎక్కువ లేవు అన్నారు, ఇంకో అమ్మాయి ఒక కాల్ కోసం చూస్తున్నాను సారీ అన్నారు. చస్.. అమ్మాయి అమ్మాయిని అడిగితే ఇలాగే వుంటుంది అని దారిన వెళ్తున్న ఒక అతన్ని ఆపి ఒక సారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగాను. దానికి ఆయన ఫోన్ మాట్లాడున్నా ఒక్క నిమిషం బాస్ అని అటువైపు వ్యక్తి కి చెప్పి నాకు తన ఫోన్ అప్పు ఇచ్చారు. కానీ మా వాళ్ళు ఆ టైము కి నా గురించి కాకినాడ enquiry చేస్తూ ఫోన్ లో బిజీ గా వుండటం తో నాకు లైన్ కలవలేదు అది వేరే విషయం!)

ఫోన్ లో మా బావగారు ఎక్కడ వున్నావ్ అని అడిగారు. నాకేం తెల్సూ.. తెలీదు, బస్ అతను నన్ను ఎక్కడో నాకు తెలీని ప్లేస్ లో దింపేసారు నాకు అంతా అయోమయం గా వుంది అని చెప్తుంటే, పక్కన వున్న ఒక వ్యక్తి వచ్చి నా చేతుల్లోంచి ఫోన్ తీసుకొని నేను వున్న ఎడ్రస్ చెప్పారు. నేను చెప్పాలనుకున్న విషయం చెప్పనీయకుండా మీ వాళ్ళు నిన్ను వేస్కొని పోవటానికి ఇక్కడకి వస్తారు అని చెప్తూ ఫోన్ కట్ చేసేసారు. వాళ్ళకి ఇంటికి వెళ్దాం అనుకున్న దానిని మా వాళ్ళ కోసం అక్కడ రోడ్ మీద ఇంకో అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది. కారణం మా అక్క వాళ్ళు పక్కనే వున్నా, అతను చెప్పిన ఎడ్రస్ వాళ్ళకి అర్థం కాలేదు. ఈ లోగా మా బావగారు కాకినాడ ఫోన్ చేసి నేను మిస్సింగ్ అని చెప్పటం తో అక్కడ కాకినాడ లో మా అమ్మగారు బాధా నాన్నగారి టెన్షన్ వెరసి సుజీ కి ఖంగారు. ఆఖరికి ఏడున్నర కి హైదరాబాద్ చేరాల్సిన దానిని పదకొండు గంటలకి ఇల్లు చేరాను. తరువాత ఇంక ఏమీ ఎడ్వంచర్లు చేయకుండా బోస్టన్ బుద్ధి గా వచ్చాను.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.