|
"రమేష్ పెళ్ళి చేసుకోవటానికి ఇండియా వెళ్తున్నాడు కదా ఈ వారం మా ఇంట్లో బేచిలర్స్ శోకదినం పెట్టుకుందాం" విశు అన్నాడు.
"శోకదినమేమి పాపం? దానిలో అంత శోకించటానికి ఏముంది?" అతని ఉద్దేశం తెలిసే అడిగాను.
"మరి? అతని స్వాతంత్ర్యం ని కోల్పోవటంలేదూ?" ఉడికిస్తూ అన్నాడు అరవింద్.
"అవును. వాడి బతుకు బస్ స్టాండ్ అయిపోతోంది." బాధ పడిపోయాడు శ్రీధర్.
"పాపం ఎలాంటిదో ఆ అమ్మాయి." వంత పలికాడు రవి.
ఇంకా ఎవరెవరు ఏమి చెప్తారో విందామని ఆగాను.
"బొత్తిగా చదువుకోని అమ్మాయి అయితే ఇక్కడకి వచ్చి మిడి మిడి తెలివితేటలతో రెచ్చిపోతారు బాలూ బార్య లాగ".
"నిజమే" ఒప్పుకున్నారు అంతా.
"బాగా చదువుకున్నా ఇబ్బందే." విశు చెప్పాడు. "ఇంక నీ లెక్క ఎంత అనటం మొదలుపెడతారు వచ్చిన మర్నాటి నుంచి." తన వాదన కి ఒక రీజనింగ్ ఇచ్చాడు.
"మరి నీ ఒక్కడి సంపాదన ఇక్కడ సరిపోదు కదా? చదువుకోని అమ్మాయి ని చేసుకుంటే ఆమె ఏం ఉద్యోగం చేస్తుంది? కనీసం ఇంగ్లీష్ అయినా రాకుండా?" నా అనుమానం వెలిబుచ్చాను.
"అందుకే బాగా చదువుకోకూడదు. అంటే, ఇంజినీర్, డాక్టర్ అలాగ అనమాట. ఏదో కాస్త కనీసం గ్రాడ్యుయేట్ అయితే ఇంగ్లీష్ వస్తుంది. అప్పుడు ఆమె చిన్న చిన్న పనులు అంటే పాకింగ్, కుట్టుపని ఇలాంటి పనులు చేస్తే చాలు." నా అనుమానాన్ని నివృత్తి చేసాడు శ్రీధర్.
"అవును. అప్పుడు డబ్బు కి డబ్బు, చేతి క్రింద అణిగిమణిగి ఉంటుంది. ఎంతయినా తెలివి!" వెటకారం గా అన్నాను.
"డబ్బు లేని అమ్మాయి అయినా పర్లేదు. పెద్ద పెద్ద కోరికలు ఉండవు, పొగరు కూడా ఉండదు." ఇంకో పాయింట్ చెప్పాడు అరవింద్.
"లేదులే బాస్! ఇది అంత సేఫ్ మెథడ్ కాదు. డబ్బు లేని అమ్మాయి అనుకో.. ఇంక ఆమెగారి కోరికలే కాక ఆమె పుట్టింటి వాళ్ళ కోరికలూ, ముచ్చట్లూ కూడా తీర్చాలి." అందులో ఇబ్బంది చెప్పాడు విశు.
"మీరు ఆమె కోరికలు తీరిస్తే గొప్ప! ఇంక ఆమె పుట్టింటి వాళ్ళ కోరికలు కూడా తీరుస్తారా.. అసలు వాళ్ళు అడుగుతారా?" వ్యంగ్యం గా అన్నాను.
"తీర్చాలి అమ్మా.. నీకు తెలీదు. వాళ్ళ వాళ్ళకి బంగారం బిస్కట్లనీ నగలలోకి రాళ్ళనీ.. ఒకటేమిటీ లేని అమ్మాయిని చేసుకుంటే ఆర్డర్లు వేయటానికి ఒక్కళ్ళు కాదు. వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? అని అవీ ఇవీ కబుర్లు చెప్పి మొత్తం ఖర్చు అంతా మొగుడి చేత పెట్టిస్తారు." మా అన్నయ్య అన్నాడు.
"లేని అమ్మాయి అనుకో, ఇంకొక ఇబ్బంది వుంది. వాళ్ళ అన్నయ్యని తీసుకువద్దాం, లేక పోతే మరెవరో చుట్టం కి వీసా చేద్దాం అని చంపటం మొదలెడతారు." రవి అన్నాడు.
"ఏం? మీరు మీ వాళ్ళని తేవగాలేనిది ఆమె తన వాళ్ళని తీసుకుని వస్తే తప్పేమిటి? వాళ్ళ వాళ్ళు మీ పెళ్ళాల పురుళ్ళు పోయటానికి, మీ అడ్డమయిన పనీ అక్కడ ఇండియా లో మీ జీతం బత్తెం లేని పాలేర్ల మాదిరి చేయటానికి తప్ప పనికి రారా? మీలో ఎంత మంది అమ్మానాన్నలు రేపు మీరు మీ పిల్లల్ని ఇండియా లో ఉంచదల్చుకుంటే వాళ్ళని చూడటానికి ఒప్పుకుంటారు? మీకు ఇవన్నీ ఆమె పుట్టింటి వాళ్ళు చేస్తున్నప్పుడు కనీసం ఆ మాత్రం మీరు చేయటం మీ ధర్మం కాదా?" కోపం గా అడిగాను.
"వాళ్ళని తేవటం లో తప్పేమీ లేదనుకో.. కానీ.. వాళ్ళ వాళ్ళనీ, మళ్ళీ మా వాళ్ళనీ అందరినీ తీసుకురావటం మొదలుపెడితే ఇంక మేము ముష్టెత్తాలి." విశు అన్నాడు.
"అవును. తను కూడా సంపాదించి తన డబ్బు తో తన వాళ్ళని తీసుకునిరావచ్చు" దయతల్చాడు రవి.
"ఆమె డబ్బు! అదొకటి ఉంటుందా? ఇక్కడ ఎంత సంపాదించినా అందులో పోయటమే కదా? ఇంక అన్నీ ఒకటే. దాన్ని తన వాళ్ళ కోసం ఖర్చు పెట్టనిస్తారా? ఒకవేళ ఖర్చు పెట్టనిచ్చినా, సాధారణం గా ఆడపిల్ల సంసారం లో పడ్డాక తన వాళ్ళగురించి ఆలోచించగలరా? ఆ విషయం మీకు మాత్రం తెలీదా? తెలిసి కూడా ఇలా పెళ్ళి కి ముందు నుంచే మీ కూడికలూ తీసివేతలూ మొదలెడతారన్నమాట! బాగుంది!"
"ఇన్ని మాటలు చెప్తున్నావు. ఏం మీ ఆడపిల్లలు ఆలోచించరా ఇలా పెళ్ళి కి ముందు?" సవాలు చేసారు అరవింద్.
"ఏం దానిలో కూడా సర్వాధికారాలూ మీరే తీసుకున్నారా? మేము కూడా ఆలోచిస్తాము. మీ కన్నా ఎక్కువే ఆలోచిస్తాము." కసి గా అన్నాను.
"ఏం ఆలోచిస్తారు?" అడిగాడు అన్నాయ్య.
"రేపు పెళ్ళి చేసుకుంటావు కదా. మీ రాబోయే ఆవిడని అడుగు. ఆ అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ చెప్పు. అప్పుడు ఆమె నీ లాంటి వాడిని కోరుకోలేదని చెప్పినప్పుడు నీ మొఖం చూడటానికి నేను ఉండనులే" ఇంక అక్కడ ఉండబుద్ధికాక లేచి వెళ్ళిపోయాను.
|