చురకలు 19 - చావా Back   Home 
ఈ పేజీ ని పంపండి
ఈ వారం నేను రాయబోయేది కొంతమందికి బాధ కలిగించ వచ్చు. అలా నా రాత వలన బాధ కలిగితే క్షంతవ్యున్ని. కాని ఒక్కసారి ఆలోచించండి చాలు. - చావా

"నిన్న పార్టీ కి వెళ్ళాం"

"ఆహా అలాగా? ఎవరింట్లో?"

"కృష్ణ అంకుల్ వాళ్ళ ఇంట్లో. ఇవాళ కూడా ఇంకొ పార్టీ. మైథిలీ వాళ్ళ ఇంట్లో"

"మీ పనే బావుంది. వీకెండ్ రాగానే ఏదో ఒక పార్టీ. మమ్మల్ని పిలవడానికే ఎవరూ లేరు!"

"అదంతే. లెక్కలు తేడా వస్తాయి మరి"

"లెక్కలా? ఏమి లెక్కలు?"

"పార్టీ జరిగింది ఎక్కడ అనే దాన్ని బట్టి నీకు ఆహ్వానం వస్తుంది. అది నువ్వు ఏ కులం అనే దాని మీద ఆధారపడి వుంటుంది"

అప్పటికి గాని నాకు అర్ధం కాలేదు. వచ్చి ఆరు నెలలు అయినా మమ్మల్ని ఈ ఊర్లో ఒక్కరు కూడ ఎందుకు తమ పార్టీలకి పలవటంలేదో. నేను ఇంకా బ్రహ్మచారి కదా అని పిలవడం లేదేమో అనుకొంటున్నా ఇన్ని రోజులు.

కాని దీని వెనక ఇలాంటి అలోచన ఉండే ఆస్కారం ఉందని నాకు వెలగలే ఇన్నాళ్ళు!

"నేను ఏ కులం అనేది మీ ఊర్లో అందరికి ఎలా తెలుసు?"

"అదే మరి! అంటే తెలుసుకోకుండానే పిలవడం లేదనుకొన్నావా?"

నేను మళ్ళీ అలోచనలో పడ్డా. ఇక్కడకి వచ్చిన దగ్గరనుండి నన్ను ఎవరన్నా నాదే కులం అని అడిగారా అని. నాకు గుర్తు ఉండి అలాంటిదేమీ జరగలేదు. కనీసం ఇక్కడ ఇండియా లో లా ఎక్కడా కేటగిరీ రాసే అవసరం కూడా లేదు. అయినా ఎలా తెలిసిందబ్బా అని.

"కృష్ణ అంకుల్ దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. అందులో మీ ఇంటి పేరు చెప్తే ఆయన మీ కులం, గోత్రం వగైరాలన్నీ చూసి చెప్తాడు."

నాకు తల తిరిగిపోయింది.

"అందరికీ ఏ పార్టీ లోనో అనౌన్స్ చేస్తాడు. అప్పుడు తరువాతి లిస్ట్ లో మీరు ఉండాలో లేదో డిసైడ్ అవుతుంది."

ఆహా.. ఏమి గొప్పతనం మనది! ఎలుక తోలు ఎంత ఉతికినా నలుపే అన్నట్లు మనం ఎక్కడికి పోయినా మారము. మార్చాలనుకోడం బుద్ధి తక్కువ అవుతుందేమో! నాకు తెలిసి మా ఊర్లొ ఉన్న వాళ్ళందరూ PhD లు చేసిన పెద్దలు. బుద్దులు మాత్రం ఇంత చిన్నగా ఉంటాయని అనుకోలేదు సుమా.

ఇలాంటివారు ఇక్కడ ఒక్కచోట మాత్రమే ఉన్నరనుకొంటే తప్పు. అటు చివర అలాస్కా నుండి ఇటు చివర ఫ్లోరిడా వరకు, తెలుగు వాడు ఉన్నాడు అంటే ఈ లెక్కలు వేస్తాడు. వాళ్ళు పిలవక పోతే మనకి వచ్చిన నష్టం ఏమిలేదు. కాని ఎందుకు పిలవలేదో తెలిసినప్పుడు మాత్రం నాకు బాధ కలిగింది.

మా ఆఫీస్ లో ఒక కుర్రవాడున్నాడు. అతనిది హిస్టరీ మేజర్ అట. చరిత్ర లో వాడికి ఇండియా గురించి చదవాల్సి వచ్చింది. ఓ రోజు నా దగ్గరకి వచ్చి అడిగాడు.

"మీ దేశం లో ఏంటి హిందువులూ, శిఖ్ లూ, జైనులూ, బౌద్ధమతస్తులూ, ముస్లిం లూ అందరూ కలిసే ఉంటారా అని."

"అవును ఏం?" అన్నా.

"ఏమి లేదు. నాకు చాల గందరగోళం గా ఉంది. ఇన్ని వేరు వేరు ఆచారాలు పద్ధతులు ఉన్నవాళ్లు ఎలా కలిసి ఉంటారు అసలు అని" అతనికి నమ్మకం కుదరటం లేదన్నది మాటల్లొనే తెలుస్తోంది.

నేను నవ్వి గొప్పగా చెప్పా. "అదే మరి భారతదేశ గొప్పతనం. మేము మీలాగ కబుర్లు చెప్పం. చేసి చూపిస్తాం" అని.

కాని ఇప్పుడనిపిస్తుంది నేను చెప్పింది తప్పేమో అని! నిజం గా కలిసి ఉండటం లేదేమో మనం అని. కాదంటారా?

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.