|
"ఈ సండే మా యింటి కి భోజనానికి రండి." రాధతో అన్నాను.
"ఈ వారం కుదరదులే మరెప్పుడయినా చూద్దాం" అంది రాధ.
"ఏం ఎవరింటికైనా వెళ్ళుతున్నారా?" కొంచెం నిరాశ గా అడిగాను.
"లేదు.. మూర్తి వాళ్ళ ఆఫీస్ లో తెలుగు అయన ఒకరు కొత్తగా చేరారుట. వాళ్ళని మా యింటికి భోజనానికి పిలిచాం."
అదే మొదటి సారి కమల వాళ్ళ గురించి నేను వినటం. తర్వాత కూడా ఒకటిరెండు సార్లు వాళ్ళ గురించి రాధ చెప్పింది. ఉగాది నాడు వాళ్ళ యింటిలో కలిసాను.
పరిచయాలు అయాక ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం. ఆమె ప్రతీ దానికీ తన అభిప్రాయాలు అవతల వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పటం గమనించాను. తను నా గురించి అడిగారు. నేను ఏం చేస్తున్నాను, ఏం చదివాను, పెళ్ళి అయిందా, వగైరా.
నేను నా గురించి వివరాలు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఎలాగూ ఆమెకి నేను నచ్చను. నాకు ఇది అలవాటే.
మేమిద్దరం తరువాత కూడా కలిసాం కానీ మా మధ్య అంత స్నేహం పెరగలేదు. నేను తేలిగ్గా ఫీల్ అవని వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేను.
ఒకసారి ఎవరింటిలోనో కలిసినపుడు అక్కడ టెలివిజన్ లో ఎదో తెలుగు సినిమా వస్తోంది. నాకు సినిమాలంటే ప్రాణం. కనుక అక్కడే కూర్చుని చూస్తున్నాను. కమల, రాధ వాళ్ళంతా వంట ఇంట్లో ఎవో కబుర్లు చెప్పుకుంటున్నారు. "ఏమయినా సాయం చేయాలా? వంట కాకుండా ఏదయినా సరే చేస్తాను." అడిగాను బయటకి వచ్చిన రాధని.
"లేదులే.. నువు సినిమా చూడు" నా సినిమా పిచ్చి గురించి తెలిసిన రాధ అంది.
ఇంతలో కమల నాకు సినిమాల మీద వున్న ఇంట్రెస్ట్ గురించి ఎదో కామెంట్ చేసింది. ఆమె అంత చనువు తీసుకోవటం నాకు అస్సలు నచ్చలేదు. కానీ సమయం కాదు అని నేను ఏమీ తిరిగి మాట్లాడలేదు.
క్రిస్మస్ సెలవల్లో ఒకరోజు కమల ఫోన్ చేసి చెప్పింది. మర్నాడు వాళ్ళ ఇంట్లో పోటలాక్ డిన్నర్ వుందట.. రమ్మని.
నేను ఏమి తీసుకురావాలని అడిగాను.
"ఏమీ వద్దు. అన్నీ పంచుకోవటం అయిపోయింది" అని అంది.
మర్నాడు వాళ్ళ ఇంటి లో తెలుగు కేసెట్లు ఏం వున్నాయా అని చూస్తుంటే వనజ అంది. "ఎప్పుడో కలుస్తావు. సినిమాలు మీ ఇంట్లో చూడు. దా.. కబుర్లు చెప్పు." అని లాక్కెళ్ళింది.
అక్కడ అంతా ఇండియా తీసికెళ్ళటానికని కమల కొన్న నగలు, ఎవో రాళ్ళూ చూస్తున్నారు. నాకు వాటి మీద అంత ఆశక్తి లేదు. కానీ నా కళ్ళకి నదరు గా కనిపించిన ఒక ఎఋఋఅరంగు రాళ్ళ పేకట్టు చూపి అది అందివ్వమని రాధ ని అడిగాను. తనకి నేను వేటిని అడిగానో తెలీక ఎవో యివ్వబోతే.. "అవి కాదు.. ఆ ఎఱ్ఱరాళ్ళు..." అన్నాను.
"ఎరుపు రంగు రాళ్ళు కాదు.. వాటిని పగడాలు అంటారు" వనజ అంది.
"ఏమో... నాకు వాటి పేర్లు తెలీవు.." కొంచెం నిర్లక్ష్యంగా అన్నాను.
"ఒట్టి సినిమాలే కాదు అన్నీ తెలుసుకోవాలి. ఇలా నాకు వంట రాదు, నగలు గురించి తెలీదు, అంటే, కటింగ్ ఇచ్చినట్టు వుంటుంది." కమల అంది.
ఇంక నాకు కోపం ఆగలేదు. ఏమనుకుంటోంది అసలు? నాకేమన్నా నీతిచంద్రిక నేర్పించటానికి కంకణం కట్టుకుందా? నేనెలా వుంటే ఆమెకి ఎందుకు? నేనేమన్నా ఆమె తప్పులన్నీ లిస్ట్ చెప్పి అమెని సరిదిద్దే ప్రోజెక్ట్ మొదలెట్టానా? లేదే?! మరి తనకెందుకు ఆ దురద?
అమెకి సమాధానం కొంచెం గట్టిగా ఇవ్వబోయాను. కానీ వద్దు అన్నట్టు కళ్ళతోనే వారించిన రాధని చూసి ఆగిపోయాను.
నిజమే. ఎంత మందితో దెబ్బలాడతాం? ఒకవేళ "నా గురించి నీ కనవసరం" అని చెప్పినా వీళ్ళు మారిపోతారా? నేను అనవసరంగా వీళ్ళ గాసిప్ లకి మరొక టాపిక్ పెంచటం తప్ప?
ఈమే కాదు. చాలా మంది అసలు ఏమనుకుంటారో తమ గురించి తాము! ఎప్పుడూ పక్కవాళ్ళ బట్టల గురించి, వాళ్ళ వంట గురించి, నగలు గురించీ, పెద్ద తామెదో సలహా వుచితం బోర్డ్ పెట్టుకుని కూర్చున్నట్టు ఎప్పుడూ రెడీగా వుంటారు! ఇతర్లకి తమ అమూల్యమయిన సలహాలు ఇవ్వటానికి!
నేనయితే రాధ ఆపటం వలన ఆగాను. అంతా నాలా ఆగుతారా? అసలు ఈ పాటికే అమెకి ఒక్కళ్ళో, యిద్దరో చెప్పే వుంటారు. "నీ పని చూసుకో" అని! కానీ అలా చెప్పిన వెంటనే బుద్దుడికి బోధి వృక్షం క్రింద కూర్చోగానే ఙ్ఞానోదయం అయినట్టు వీళ్ళకీ ఙ్ఞానోదయం అవితే లేనిదేముంది!?
|