|
ప్రవీణ్ తగోడియా అనబడి ఒకానొక పెద్ద మనిషి సోనియా గాంధీ ని "ఇటలీ కుక్క" అని అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఆ మాట నచ్చలేదు. వాళ్ళకి నచ్చకపోతే కూడ పెద్ద గా బాధ లేదు. అనవసరం గా కుక్క లాంటి విశ్వాసం ఉన్న జీవితో రాజకీయనాయకులని పోల్చడం ఖండించాల్సిన విషయం. ఏ రకం గా చూసినా కుక్క అన్ని విషయాలలో మన నాయకుల కన్నా మెరుగే. కుక్క తన యజమానికి ఎవరు ఎలాంటి ఆపద తలపెట్టినా చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్యం ప్రజల కొరకే అయినప్పుడు ప్రజలే యజమాని. కానీ నాయకులు కుక్క లా కాకుండా యజమానికి కే ద్రోహం చేయటం లో నిష్ణాతులు.
పెద్దాయన ఒకాయన కుక్కలకి మనిషి కీ ఉన్న తేడా చక్కగా చెప్పాడు. ఆకలి తో ఉన్న కుక్క కి అన్నం పెడితే అది నిన్ను కరవదు. మనిషి కీ కుక్క కీ తేడా ఇదే అని. ఆ రకం గా అసలు మనిషన్నవాడిని కుక్క లాంటి ఉత్తమ జీవితో పోల్చడం ఏ రకం గానూ ఉచితం కాదు. కుక్క తో ఒకరిని ఒకరు పోల్చుకోడం ఇదే మొదటి సారి కూడా కాదు. అలనాడు రాజీవ్ ని, ఆఖరికి నెహ్రూ ని కూడా పోల్చారు. ఆ రోజుల్లో పోలిస్తే కాస్తలో కాస్త సరితూగారేమో, ప్రస్తుతం మాత్రం మన నాయకులు అందుకు ఏ రకం గానూ తూగరు. కాబట్టి ఇకనుండి "కుక్క" అని తిట్టుకోడం మానేసి, "నాయకా" అని తిట్టుకోవల్సింది గా నా విజ్ఞప్తి.
ఇక విశ్వాసం అనే దానికి అర్థం కుక్కని అడిగి లేదా చూసి నేర్చుకోవాలి. ఆ రకం గా కుక్క కనీసం ఒక గొప్ప గుణానికి చిహ్నం గా మిగిలిపోతుంది. మన నాయకులని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటంటే ఒక్కటి కూడ లేదు. ఓట్ల కోసం వచ్చినప్పుడు కుక్క తోకూపుతూ తిరిగినట్లు మన ఇళ్ళ చుట్టూ ఒకటికి నాలుగుసార్లు తిర్గడం తప్పితే విశ్వాసం చూపించడం ఏ మాత్రం తెలియని జీవాలు నాయకులు. వాళ్ళని కుక్కలతో పోల్చడం ఎంతవరకూ సమంజసం?
ఒకే ఒక విషయం లో మన నాయకులని కుక్కలతో పోల్చవచ్చని నా నమ్మకం. అధికారం కోసం కుక్కల్లా కాట్లాడుకొనే విషయం లో. కాకపోతే కుక్కలు అంతగా విలువలేని అధికారం కోసం కాట్లాడుకోవు. అందులోనూ కుక్కలకి వారసత్వం విషయం లో నాయకులకున్న పట్టింపులు లేవు కూడాను! జమ్మూ కాశ్మీర్ లో, బులెట్లని సైతం లెక్క చేయక ఓట్లేసిన జనానికి రాజకీయనాయకుల కాట్లాట నిస్తేజం గా చూస్తూ కూచోవాల్సిన ఖర్మ. నిజం గా మీరు పోటీ చేసి గెలిచింది కాశ్మీర్ ప్రజల కడగండ్లు తీర్చడనికే అయితే, అ పని చేయడానికి ముఖ్యమంత్రి పదవి అంత అవసరమా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోలేరు అనే విషయం మర్చిపోయా. యజమానికి సేవ చేసేది కుక్క కానీ మీ లాంటి నాయకులు కాదుగా!
|