|
"కూర కొంచెం వేసుకోండి." నా పళ్ళెంలో కొంచెం కోడి కూర వేయబోయింది సరిత.
"ఆ.. నేను తిననండీ." అంటూ నా పళ్ళెం వెనక్కి జరిపాను.
"ఏం యిష్టం లేదా?" అమె భర్త శ్యాం అడిగారు.
"ఆహా. నేను.. వెజిటేరియన్ని" చెప్పాను.
"ఏమీ తినరా?" ఆశ్చర్యంగా అడిగారు శ్యాం.
"గుడ్డు తింటాను. దాని అమ్మని మాత్రం తినను."
"బేమ్మర్లా?" చాలా క్రూడ్ గా అడిగింది రజని.
నేను ఆమె ప్రశ్న విననట్టు ఉండిపోయాను. మనము ఏ కులమో, మతమో అన్నది మన స్వవిష్యం. దానిని అందరికీ ఎందుకు ప్రోపగాండా చేసుకోవాలి? నేను ఏమిటి అన్నది బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఏం నేను వాళ్ళ దానిని కాకపోతే వెలేస్తారా? లేక వాళ్ళ దాన్నే అయితే ఏమయినా నెత్తి మీద కిరీటం పెడతారా? ఇండియా లో ఎలాగూ కొట్టుకు చస్తున్నారు కులాలు, మతాలు పెర్లు చెప్పుకుని. ఇక్కడకి వచ్చి ఇక్కడ కూడా మొదలుపెట్టాలా?
ఇక్కడ చాలా మంది నాకు అర్దం కాదు ఎందుకో మరి! తమేమిటో, తమ కులం ఏమిటో, తమది ఎంత వున్న కుటుంబమో తమది ఎంత గొప్ప కులమో, ప్రక్కవాడి కులం ఎంత నీచమైనదో, తాము ఎంత పేరు ప్రఖ్యాతులు వున్న కులంలో వున్నారో, ఇవే గొడవలు! ఎవరి కులం వాళ్ళకి గొప్ప. సరే, ఈ విష్యం అందరిచేతా అవుననిపించాలా? అలా అందరిచేతా అనిపించగలరా? ఎవరింట్లో వాళ్ళు సింహాలు. అయితే ఏంటి గొప్ప? ఎవరు ఎంత వాళ్ళయినా, అంతా ఆ డబ్బు సంపాదించుకోవటానికే కదా వచ్చింది? ప్రతీ వాళ్ళం మన ప్రియమైన వాళ్ళనీ మనం పెరిగిన చుట్టుప్రక్కల్నీ వదలి వచ్చి ఈ కొత్త ప్రదేశంలో, దేశం కాని దేశంలో ఒంటరిగా బాధ పడుతూ, ఎవరైనా మనలాంటి ఆలోచనలు, అభిరుచులూ లాంటి అభిరుచులు కల వ్యక్తి కనిపించి, ఆ వ్యక్తి తో స్నేహాం చేసే అవకాశం వస్తే ఏం చేస్తాం? సంతోషిస్తామా లేకపోతే, ఆ దొరికిన వ్యక్తి మన వాడా, కాదా అని చూసి మన వాడు కాకపోతే స్నేహం చేయటం మానేస్తామా?
అంత కన్నా ధారుణం.. ఫ్రెండ్స్ గా కలిసి మెలిసి ఉండి, తర్వాత ఆ స్నేహం ఏ కారణం చేతనయినా చెడితే, ఎంతయినా ఆ కులం వాడిని నమ్మకూడదు, అంటూ తామెదో ఒక కొత్త విష్యం నిరూపణ చేసినట్టు ఫీలవటం!
ఒక వేళ స్నేహం చేసినా, వాళ్ళ మనసుల్లో ఆ కలుషితం ఉంటే ఆ స్నేహం ఎన్నాళ్ళో ఉండదు. మీలో ఇలా కదా, మీలో ఇలా మాట్లాడతారు కదా, అంటూ రిడిక్యూల్ చేయటం. అందరికీ ఒక యాస ఉంటుంది. ప్రతీ వాళ్ళూ ప్రక్క వాళ్ళ పద్దతుల్ని విమర్శించటం మొదలు పెట్టడం మంచి పద్దతేనా?
ఒకామె ఈ మధ్య నాతో అన్నారు. "ఎంతయినా మీలో చదువులు బాగా వస్తాయి. మాలో చదువుల మీద అంత శ్రద్ద పెట్టరు."
అమె తన వాళ్ళనీ, నన్నూ కూడా అవమానించారు. ఆమెకి చదువు మీద శ్రద్ద వుండి వుండక పోవచ్చు. కనుక తను జీవితంలో అవాలనుకున్నది అవలేకపోయారు. మరి నా కన్నా వున్నతమైన స్థాయిలో వున్న తన వాళ్ళని అందరినీ మర్చిపోయారా? సరే ఆమె అన్నట్టే ఒక పర్టిక్యులర్ కులంలో పుడితే చదువు బాగా వచ్చేదయితే మరి అలా పుట్టిన అంతా ఎక్కడ వుండాలి? జీవితంలో పైకి రావటానికి శ్రమ పడనక్కర్లేదన్నమాట!
అమెరికా లో నాకు తెల్సిన ఒకాయన ఈ మధ్య నాతో అన్నారు.
"ఇక్కడ తెలుగు అసోసియేషన్ లో ఆ కులం వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. కనుక మా కులం వాళ్ళందరం కలిసి వేరే తెలుగు అసోసియేషన్ పెట్టుకున్నాం" అని.
ఇక్కడ పెట్టుకునే తెలుగు అసోసియేషన్ లో కూడా ఇలా కులాల బేస్ మీద పెట్టేదయితే, ఇంక ఆ తెలుగు పేరు ఎందుకు? ఇండియా లో లాగా xyzనాడు... లేకపోతే abcనాడు అని పేర్లు పెట్టుకోవచ్చు కదా?
ఇంక గుడి లని కూడా ఈ కులాల చీడపురుగు ఒదల లేదు. నేను ప్రతీ వారం భజనకి వెళ్ళేదాన్ని. అక్కడ ఒకామె తమ ఇంట్లో హానుమాన్ చాలీసా పారాయణ పెట్టుకున్నారు. దానికి తమ ఇంటికి నన్నూ పిలుస్తూ చెప్పారు. "ఒట్టి మన వాళ్ళనే పిలుస్తున్నాము" అని. ఏం దేవుడు కరుణించడా వేరే వాళ్ళని పెలిస్తే?
చెప్పుకుంటూ పొతే ఎన్నో ఇలాగ.. ముల్లు లా గుచ్చుకునే అనుభవాలు!
|