చురకలు 39 - చావా Back   Home 
ఈ పేజీ ని పంపండి

ఈ వారం చురకలలో ముగ్గురు నాయకులకి అభినందనలు తెలియచేస్తున్నా. ఎవరో ఈపాటికి తెలిసే ఉండాలి. ప్రధాని వాజ్ పేయ్, ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియూ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గార్లకి.

ప్రధాని వాజ్ పేయ్ నేత్రత్వం లోని జాతీయ ప్రజాస్వామ్యక కూటమి (NDA కి తెలుగు అనువాదం అని గమనించ మనవి!!), ఐదేండ్ల పరిపాలన విజయవంతం గా ముగిసింది. అది సామాన్యమైన విషయం కాదు మరి. పదమూడు పార్టీలని కలుపుకొని పనిచేయడం నిజం గా కష్టమయిన పని. లెక్కకి పదమూడు. ప్రభుత్వం లో లేని RSS, VHP, అయోధ్య సాధన సమితి వగైరాలని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత కూడా ప్రధాని మీద ఉందనే విషయం మరువకూడదు. ఇంటిపోరు, బయట పోరు కలిసి వాజ్ పేయ్ ఆరోగ్యాన్ని కూడ ప్రభావితం చేసాయి. అయినప్పటికీ లెక్కచేయక దేశాన్ని సుభిక్షం చేయడం అనే బాధ్యత ని గుర్తెరిగి ముందుకు సాగి పోతున్నారు. అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారనుకోండి. అలాగే తెహల్కా, పెట్రోల్ పంపులు, గోధ్రా లాంటి చిన్నా చితకా సమస్యలు వచ్చినా ప్రభుత్వం కూలిపోకుండా నెట్టుకురాగలగటం ఒక్క వాజ్ పేయి వలనే సాధ్యం అయింది.

ఇక రాష్ట్రం విషయానికి వస్తే, ప్రియతమ ముఖ్యమంత్రి గారు, అత్యధిక సమయం రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి గా పేరు గడించారు. సాధించిన ప్రగతి గురించి చెప్పడం కొంచెం కష్టమైన పని. అంతగా తెలుసుకోవాలని ఉంటే ఒక్కసారి పక్క రాష్ట్రాలని చూసొస్తే సరిపోతుంది. కాదు చెప్పాలి అంటారా? మచ్చు కి కొన్ని. హైటెక్ నగరం, హైటెక్ నగరం, ఇంకా.. హైటెక్ నగరం. ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయి. జన్మభూమి, నీరు-మీరు, ఫైళ్ళ వారోత్సవాలు (గుర్తున్నాయా??), పచ్చదనం-పరిశుభ్రత, సుఖీభవ, వెలుగు, ఆదరణ చెప్పుకుంటూ పోతే ఇక్కడ స్థలం సరిపోదు. వాటన్నిటి వలన సాధించినది ఏమిటి అని మాత్రం అడగకండి. అప్పుడు పాతబడిన సామెత ఒకటి చెప్పాల్సి వస్తుంది. "రోము నగరం ఒక్క రోజు లో నిర్మించబడలేదు" అని. అలానే ఇంకో ఏడేళ్ళు ఆయన్నే పరిపాలించనిస్తే అప్పుడు ఫలితాలు కనపడేలా చేయగలరు. ఇప్పటికీ రోజుకి 20 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారాయె! తను నిద్ర పోకుండా, అధికారులని నిద్రపోనీయకుండా.

ఇంక రాజశేఖర రెడ్డి గారి విషయం. రాజకీయ నాయకుడిగా రజతోత్సవం పూర్తయిన సందర్భం గా మరియూ ఇన్నాళ్ళకి ప్రజలనే జీవాలొకటున్నాయనే విషయం గుర్తొచ్చి, "ప్రజాప్రస్థానం" పేరిట పాదయాత్రలు తలపెట్టినందుకు ఆయన్ని అభినందించాల్సిందే. పై ఇద్దరికన్నా ఈయనకే కష్టాలెక్కువ ఒక రకం గా. పైసా ఆదాయం లేదు. ఏదో కొడుకు పోషిస్తుంటే అలా నెట్టుకొచ్చేస్తున్నారు. పైగా సొంత పార్టీ లో విరోధుల సంఖ్య బయట పార్టీలో విరోధులకన్నా ఎక్కువ. (రాజకీయ పార్టీలలో సంఖ్యా బలాలు మారుతూ ఉంటాయనుకోండి.. అది వేరే విషయం). అదీ కాక ఇంకా అయిదేళ్ళలో రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని పత్రికా ముఖం గా చెప్పేసారు. ఆ లెక్కన ముఖ్యమంత్రి కావడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చు. కనుక తప్పనిసరి గా ఆయన పార్టీ ని గద్దెనెక్కించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఈ ప్రజాప్రస్థానం లో ఇప్పటికే దాదాపు అరడజను మందిని పార్టీ నుండి బహిష్కరించారు. పాదయాత్ర పూర్తయ్యేసరికి పార్టీలో ఎందరు మిగులుతారో, మిగిలిన వాళ్ళలో ఎందరు విరోధులవుతారు.. ఇన్ని సమస్యల మధ్య ప్రజల కష్టాలు వినడానికి వారి మధ్యకి వెళ్ళడం నిజం గా అభినందనీయం.

పై ముగ్గురినీ అభినందించాల్సిన కనీస కర్తవ్యం మన మీద ఉంది. కాదంటారా? మరిక ఆలస్యం ఎందుకు? మీరు కూడా తెలియచేయండి.

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత చావా కి తెలియచేయండి.