|
అరుణ వాళ్ళ ఇంట్లో మొదటి సారి నేను రాధిక ని కలిసాను.
ఆమె అరుణ వాళ్ళ ఉరు ఆమెట. మామూలు పరిచయాలు అయ్యాక కూర్చున్నం ఒక దగ్గర్. ఏవో మామూలు సంభాషణ మొదలు పెట్టాను.
అమె మాటల్లో అడిగారు "మీకు పెళ్ళి అయిందా?" అని.
నేను నా భర్త తో విడిపోయాను అని చెప్పాను.
నాకు తెలుసు. ఈ విషయం చెప్పగానే చాలామంది లో చాలా రకాల రియాక్షన్ లు వస్తుంటాయి. వచ్చిన కొత్తల్లో ఎవరికీ ఈ విషయం చెప్పేదాన్ని కాదు. అందరికీ నా పెర్సనల్ విషయం ఎందుకు చెప్పాలి? అని. కానీ ఇంక అక్కడ నుండీ మొదలు అవుతాయి రకరకాల ప్రశ్నలు. వాళ్ళేదో నా అమ్మానాన్నా నిర్లక్ష్యం తో వదిలేసిన నా పెళ్ళి బాధ్యత తమ చేతుల్లోకి తీసుకుని పరోపకారి పాపన్నలమి అని అనుకుని, "పెళ్ళెప్పుడు?" "ఎప్పుడు ఇండియా వెళ్తున్నారు?" ఇలా అడగటం మొదలెడతారు. అవే కాదు, "ఎలాంటి వ్యక్తి కావాలి?" "మేము చూసేయమా?"
ఇక్కడ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు అందరికీ ఎదురయే ప్రశ్నలే ఇవి.
ఇంక నా విషయం చెప్పటం వలన ఇంకొక రకమైన ప్రశ్నలు. ముందు చూపేది.. జాలి. నేనేదో భయంకరమైన లాస్ లో వున్నట్టు!
ఉంటే ఉంటాను. అది నా స్వవిషయం. అందరికీ నా విషయాలు చెప్పాలా? తరువాత, నెమ్మదిగా "నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగనా?" అంటూ మొదలవుతాయి ప్రశ్నల పరంపరలు. తెలుసుకొని ఏం చేస్తారు? అన్నీ అందరికీ దొరుకుతాయా?
సరే, అడిగారు. అడిగినా అన్ని విషయాలూ అందరికీ చెప్పగలమా? నేను చెప్పకపోతే ఆ క్షణం నుండీ వెనుక స్పెక్యులేషన్లు. నా లైఫ్ లో ఏం జరిగి వుంటుంది.. ఎవరి తప్పు అయివుంటుంది? ఇలా.
అందుకే ఎప్పుడూ నా దగ్గర ప్రతీ దానికి మూడు వెర్షన్లు వుంటాయి..
1. కట్టె కొట్టె తెచ్చే అన్నట్టు మూడు ముక్కల్లో అడిగిన ప్రతి వారికీ చెప్పక్కర్లేదు. మన వెనుక మనమీద రీసెర్చ్ చేసే వాళ్ళ కోసం.
2. "రీడర్స్ డైజెస్ట్" వెర్షన్. అంటే పుస్తకాల్లో కధ లా కొంచెం ఎలాబొరేట్ గా. ఈ స్టేజ్ కి రాగలిగేది ఒకరిద్దరు మాత్రమే.
3. ఇది మనసులో ఉండి నిరంతరమూ మెదిలే day-to-day వెర్షన్.
ఇక్కడ ఇంకొక భయంకరమైన పద్ధతి చూసాను కొంతమంది నారీమణులలో.
వాళ్ళు ముందు ధారాళమైన జాలి కురిపిస్తారు. అది వాళ్ళకి కావల్సిన వివరాలు వచ్చేవరకూ. తరువాత, డేటా షేరింగ్ మొదలెడతారు. లోకల్ ఫోన్ కాల్స్ ఉచితం కనుక బిల్ బాధ లేదు. వీళ్ళకి బిల్ వున్నా బాధ లేదనుకోండి. ఎవరు.. ఎలా.. ఎవరు ఎవరింటికి భోజనానికి వెళ్ళారు. ఎవరు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నారు. పెళ్ళికాని అమ్మాయిలు అయితే ఎవరితో తిరుగుతున్నారు? ఆమె ఉద్యోగం కూడా చేస్తుంటే ఆమె నిజంగానే హోట్ టాపిక్. ఎందుకంటే, వాళ్ళ గురించీ, వాళ్ళ పొగరు గురించీ, వాళ్ళకి వచ్చే జీతం గురించీ ఇలా కొత్త టాపిక్స్ జత అవుతాయి.
ఏదో నన్ను నేను ఉద్ధరించుకోవాలని అందరినీ ఒదులుకొని ఇంత దూరం వచ్చాను. సాధ్యమైనంత వరకూ నా బతుకు నేను బతుకుతున్నాను. ఎవ్వరినీ ఏ రోజూ "నువ్వేమిటి?", "నీ సంగతులేమిటీ" అని ప్రత్యక్షం గా కానీ పరోక్షం గా కానీ అడగలేదు. అయినా ఒదలరా? వారి ఉద్దేశం లో నేను వాళ్ళకి అర్థం కాను. అలా అనుకొని వదిలేయచ్చు కదా!?
|