చురకలు 5 - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి

ఇండియా లో వున్నన్నాళ్ళూ ఎప్పుడూ మా అమ్మ, నాన్న గార్లు నా జుట్టు ని కత్తిరించుకోవాలని చేసినప్పుడల్లా కోపగించుకునేవారు. అయినా నాకు కావల్సింది చేసేదాన్ని. కానీ మరీ బాబ్ కట్ చేయించుకునే ధైర్యం లేదు. వాళ్ళని మరీ బాధపెట్టడం ఎందుకని.

నేను కెనడా రాగానే నాలో వచ్చిన మొదటి మార్పు బాబ్ కట్ చేయించుకోవటం.

ఆ తర్వాత వారం ఎవరింటికో భోజనానికి వెళ్ళాను. అక్కడ నా కొత్త రూపం చూసి అంతా నా మీద జోకులు వేయటం మొదలు పెట్టారు. నేను కూడా వాటిని వింటూ నవ్వుకుంటున్నాను. ఇంతలో కమల అన్నారు..

"నాకు కూడా చేయించుకోవాలని సరదా.. కానీ యిదిగో.. రాజు (వాళ్ళాయన) వద్దంటారు."

నేనేమి చెప్తాను దానికి? మౌనంగా ఊరుకున్నాను. కొంత సేపటి తర్వాత రాజు వచ్చారు మా దగ్గరికి. నా కొత్త హెయిర్ కట్ గురించి సరదాగా ఎదో జోక్ వేసారు. నేను నవ్వేశాను. మళ్ళీ అన్నారు కమల ఈ సారి రాజు తో..

"రాజూ.. నేనూ చేయించుకుంటాను అలా.."

"నీకు బాగుండదు. నీకు చక్కగా యిలాగే బాగుంది." అతను చెప్పారు.

"ఆ.. ఏం బాగుంది.. సన్నగా అయిపోయింది.. జడ వేసుకుంటే అసహ్యాంగా.."

వాళ్ళిద్దరూ అక్కడే చర్చ మొదలు పెట్టడం కొంత యిబ్బంది గా వుంది.

ఇంతలో రాజు అన్నారు. "అయినా అది మన సంప్రదాయం కాదు. చక్కగా మన సంప్రదాయం ప్రకారం వుండటమే నాకిష్టం."

నాకు తిక్క రేగింది. అతని అభిప్రాయాలు అతనివి. సరే కానీ వాళ్ళు మొదటిది.. తమ వాదన ఇలా అందరి ముందూ మొదలు పెట్టకూడదు. అతను మన సంప్రదాయం గురించి తన అమూల్యమయిన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చటం మరొక తప్పు. ఏం తను వాటిని తు.చ. తప్పనట్టుగా పాటిస్తున్నారా?

సరే.. అతనే కరెక్ట్ అనుకొందాం. అసలు సంప్రదాయం అంటే ఏమిటి?

నాకు తెల్సినంత వరకూ, మన ఆచారాలని గౌరవించి, వాటిని పాటించి, మన పిల్లలికి వాటి గురించి చెప్పి, వాళ్ళకి కూడ అవి నేర్పించటం మన సంప్రదాయాన్ని పాటించడం. అంతే కానీ, హిపోక్రటిక్ గా ఆచారాల గురించి మాట్లాడి వాటిని ఎలా పాటించాలో తెలుసుకోకుండా, పిల్లలకి ఆచారం వరకూ ఎందుకూ, కనీసం మన భాష అయినా నేర్పించ కుండా, పండగ అంటే కేవలం తమ డాబూ, దర్పం చూపడం కోసం ఒక ఫంక్షన్ చేయటం సంప్రదాయాన్ని పాటించడం అవుతుందా?

ఈ ఫంక్షన్లు మరొక హిపొక్రాటిక్ స్టంట్ లు. అక్కడ మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలుంటాయని ఆశ పడ్డారంటే మీరు పప్పు లో కాలేశారన్న మాటే! అక్కడ ఫంక్షన్లు అయే తీరు గమనించండి.

అందాల పోటీలు: ఇవి ఏ రకంగా మన సంప్రదాయం? సరే, వాటిని అందరూ ఎంజాయ్ చేస్తారు కనుక పెట్టాము అంటారు. అందులో పాల్గొనే వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఒక అవగాహాన కోసం ఒక ఐటెం ప్రదర్శించమన్నట్టున్నారు. వాళ్ళలో కనీసం ఒక్కళ్ళూ తాము ఒక తెలుగు సంఘం వాళ్ళ పోటీ లో పాల్గొంటున్నాం, కనీసం తెలుగు అయినా మాట్లాడాలి అన్న ఆలోచన లేదు. తెలుగు మాట్లాడిన వాళ్ళ తీరు చూసి వాళ్ళు తెలుగుని నిలువునా ఖూనీ చేస్తుంటే అక్కడ తెలుగు మాట్లాడే ప్రతీ మనసూ బాధపడి వుంటుంది.

వాళ్ళ వరకూ ఎందుకూ.. ఆనాటి ప్రాగ్రాం ని నిర్వహించిన వాళ్ళ చిత్రవిచిత్రమైన చేష్టలు మరొక విష్యం. అక్కడ వాళ్ళు తమ ఇంగ్లీష్ ప్రావీణ్యం చూపడానికి వచ్చారా? ఆనాటి ప్రోగ్రాం ని నిర్వహించటానికి ఇంత పెద్ద సంఘంలో తెలుగు వచ్చిన ఒక్క వ్యక్తీ దొరకలేదా? కానీ చిన్నపిల్లలు అంత ఉత్సాహాంగా వీటిని ప్రదర్శించారు... వాళ్ళ ఉత్సాహం ని మాత్రం మెచ్చుకోవాలి.

వంటల పోటీలు. అందులో బహుమతి రాని ఒక ఆమె తనకి బహుమతి రానందుకు కారణం జడ్జ్ లు అంతా వేరే కులం వాళ్ళు అని ఒక గుసగుస!

ఇంక నగలూ, ఉద్యోగాలు గురించి. అంటే ఎవరి ఉద్యోగం వుంది, ఎవరిది ఊడిపోయింది, ఈ కబుర్లు మమూలే.

అన్నిటి కన్నా ధారుణం, ఆ కమిటీ లో రెండు గ్రూపులు. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళకి నమ్మకం లేదు. అక్కడ ఏవో అమ్ముతున్నారు. భోజనం టికెట్లు అనుకుంటా, ఒక్కళ్ళు డబ్బు కలెక్ట్ చేస్తుంటే రెండో వాళ్ళు వచ్చి ఆ డబ్బు ని లెఖ్ఖ పెట్టడం! అది చూసిన ప్రతీ వారూ నవ్వుకోవటమే.

ఇదే వాళ్ల దృష్టిలో సాంప్రదాయం అయితే, నేను సంప్రదాయంలేని మనిషినే.

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.