|
ఈ మధ్య ఒక కధ చదివాను. ఆ కధ లో బార్యాభర్తలు మేనమామ, మేనత్త పిల్లలు. చిన్నప్పటి నుంచీ భార్యా, భర్తలు అనే ఊహ తోనే పెరిగి, పెద్దయి పెళ్ళి చేసుకుంటారు.
ఇంకో కధ చదివాను. అందులో కధానాయకుడు ఒక అమ్మాయి ని ప్రేమించి, ఇంట్లో పెద్దవాళ్ళకి చెపుతాడు. పెద్దవాళ్ళు విచారిస్తే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కి చెల్లెలి వరుస అని తేలుతుంది. దూరపు చుట్టరికం వల్ల. ఆది మానవుడి భార్య ఎవరూ అనే ప్రశ్న తో కధ ముగుస్తుంది.
ఈ కధ చదివి ఒకరు మహమ్మదీయులలో పిన్ని పిల్లల్నీ, బాబాయి పిల్లలని కూడా పెళ్ళి చేసుకుంటారు అని చాలా మందికి తెలిసిన విషయమే మళ్ళీ గుర్తు చేసారు.
తెలుగు సినిమా ప్రపంచం లో ఒక ప్రముఖ గాయకుడు బాబాయి కూతుర్నో పిన్ని కూతుర్నో పెళ్ళి చేసుకున్నాడని వదంతి.
అమెరికా లో కజిన్ ని పెళ్ళి చేసుకోవటం చట్టరీత్యా నేరం. దీనిని "ఇన్ సెస్ట్" గా పరిగణిస్తారు. ఒక ఇండియన్ అబ్బాయి తన మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకుని అమెరికా తీసుకుని వచ్చాడుట. ఈ విషయం ఆ ఊరి ప్రాసిక్యూటర్ కి ఎలా తెలిసిందో ఏమో గానీ, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసాడుట. ఈ విషయం ఒక రచ్చబండ లో చదివి, అది పొస్ట్ చేసిన వాళ్ళకి ఉత్తరం రాసి సంగతి ఏమయిందీ అని కనుక్కున్నాను. కొంతమంది ఇండియన్స్ ఆ ప్రాసిక్యూటర్ ని కలిసి, హిందూ సంస్కృతి లో అలా పెళ్ళిళ్ళు చేసుకోవటం మామూలైన విషయం అని విన్నవించుకుంటే, మొత్తానికి ఆ కేసు కొట్టేసారుట.
ఇలాంటివే చాలా విషయాలు వినడమూ, చదవటమూ జరిగాయి. రకరకాల మనుషులు, రకరకాల్ల అభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఈ విషయం లో కొంచెం ప్రాధమికం గా అలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందనిపించింది నాకు. వావి, వరుసలకి చెందిన పెళ్ళిళ్ళ విషయాన్ని రెండు రకాలుగా అలోచించాలి.
1. సైన్సు పరం గా, 2. సంస్కృతి పరం గా.
సైన్సు పరంగా ఒకబ్బాయి మేనమామ / మేనత్త కూతుర్ని గానీ, బాబాయి / పిన్ని కూతుర్ని గానీ పెళ్ళి చేసుకుంటే, జీన్స్ ఎఫెక్ట్ వలన పుట్టబోయే పిల్లలు అవకరాలతో పుట్టే అవకాశం ఉందని అందరికీ తెలుసు. ఒక జనరేషన్ లోనే ఇలా జరగకపోయినా, ఈ డిఫెక్ట్ కొన్ని జనరేషన్ల తరువాత దగ్గర సంబంధాలు చేసుకోక పోయినా, బయటికి రావచ్చని జన్యు శాస్త్రం చెబుతోంది. ఈ సైన్సు ప్రకారం జీన్సు డిఫెక్టులు ఎప్పుడు, ఎలా పిల్లల విషయం లో బయటకి వస్తాయో చాలా స్పష్టం గా తెలియకపోవటం వలన దగ్గర రక్త సంబంధం కలిగిన మనుషులతో పిల్లలని కనకూడదని అర్థం చేసుకున్నారు మనుషులు. అమెరికా వంటి దేశాలు ఇటువంటి సంబంధాలకి వ్యతిరేకం గా చట్టాలు చేసుకున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ చట్టాలు ఒకో రాష్ట్రం లో ఒకో రకం గా ఉంటాయిట.
దగ్గర సంబంధం చేసుకున్నా కొంత మంది విషయం లో సమస్యలు రాకపోవచ్చు. వచ్చే అవకాశం ఉందని మాత్రమే అర్థం చేసుకోవాలి.
అమెరికా లో పెళ్ళి రిజిస్టరు చేసుకునేటప్పుడు రక్త పరీక్షలు చేయించుకొని, ఆ రిపోర్టులు సబ్మిట్ చేయాలిట. పెళ్ళి కి అనుమతి కోసం. ఈ పద్ధతి చాలా బావుందనిపించింది. తమకి తెలియకుండానే తమకేమన్నా జబ్బులు అంటుకుంటే, ఇంకో వ్యక్తి తో సాంఘిక సంబంధం పెట్టుకునేటప్పుడు ఆ రక్త పరిక్ష రిపోర్ట్ ని బహిరంగ పరచటం చక్కగా అనిపించింది.
కంపాటిబిలిటీ కోసం కూడా రక్త పరీక్షలు చేయవచ్చని జన్యుశాస్త్రం లో పరిశోధన చేస్తున్న ఒక మిత్రుడు చెప్పారు. రక్తం ద్వారా గానీ లాలాజలం ద్వరా కానీ DNA తీసుకొని జీన్స్ పరీక్షలు చేయవచ్చని జన్యుశాస్త్రం చెబుతోంది. ఇద్దరు వ్యక్తులు పెళ్ళి చేసుకోబోయే ముందు పుట్టబోయే పిల్లల విషయం లో ఈ పరీక్షలు చేయించుకోవాలని చట్టం చేస్తే చాలా బాగుంటుంది.
దగ్గర రక్త సంబంధం లేకపోయినా, బార్యాభర్తల రక్తం గ్రూపులు ఒక రకం గా ఉంటే గర్భధారణ సమయం లో సమస్యలు వస్తాయి. తల్లి శరీరం లో యాంటీబాడీస్ పుడతాయి. ఈ సమస్య ని డాక్టర్ల సాయం తో పరిష్కరించుకోవలసిందే.
ఎంతో చదువుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా ఇటువంటే రక్త పరీక్షలు చేయించుకోరు. ఆ విషయం గురించే ఆలోచించరు. పైపెచ్చు ఎన్నో జనరేషన్లలో ఇటువంటి దగ్గర రక్త సంబంధం కల పెళ్ళిళ్ళు జరిగితేనే అవకరం గల పిల్లలు పుడతారని వాదనలు చేసి, తామన్నదాన్ని సపోర్టు చేసుకుంటారు. మళ్ళీ అందరూ సైన్సు తెలిసిన వాళ్ళే. అయినా ప్రేమ విషయాలకి వచ్చేసరికి ఇటువంటి రిస్క్ ఏమీ ఆలోచించకుండానే తీసుకుంటారు.
ఏ దేశం లో అయినా ఇద్దరు వ్యక్తులు పిల్లల్ని కనాలంటే కంపాటిబిలిటీ పరీక్షలు చేయించుకోవాలని చట్టం చేస్తే బాగుండును అనిపిస్తుంది. లేకపోతే తలితండ్రులు చేసే ఈ అవకతవక పనికి పిల్లలు బాధ పడాల్సి వస్తుంది జీవితాంతం.
ఏ మతానికి చెందిన వారయినా సరే, సైన్సు ని అర్థం చేసుకొని జాగ్రర్త పడాలి తప్పకుండా.
ఈ సంస్కృతి అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మతం మీద, కులం మీద, నివసించే ప్రాంతం మీద, దేశ ఆర్థిక పరిస్థితి మీదా, భౌగోళిక పరిస్థితుల మీదా ఇంకా ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
హిందూ సంస్కృతి లో ఒకబ్బాయి మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకోవచ్చు కానీ మేనత్త కూతుర్ని పెళ్ళి చేసుకోకూడదు కొన్నేళ్ళ క్రితం వరకూ. అది "ఎదురు మేనరికం" అవుతుంది. కొన్నాళ్ళకి ఈ విషయం లో సడలింపు వచ్చేసి, మేనత్తా మేనమామల పిల్లలు నిస్సంకోచం గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తల్లి తమ్ముడిని కూడా పెళ్ళి చేసుకుంటారు కొంత మంది అమ్మాయిలు వరుస ప్రకారం. కానీ బాబాయి / పిన్ని కూతుర్నీ మాత్రం అబ్బాయిలు పెళ్ళి చేసుకోరు. ఎందుకంటే, చెల్లెలి వరుస కాబట్టి. పిన్ని / బాబాయి వరుస మనుషుల్ని కూడా పెళ్ళి చేసుకోరు. అమ్మాయి అబ్బాయి కన్నా పెద్దదయితే "వరహీనం" అని పెద్దలు ఒప్పుకునేవారు కాదుట. ఒక కధ ప్రకారం రాముడి కన్నా సీత పెద్దదిట రామాయణం లో. "వరహీనం" చేసుకోవటానికి ఇష్టపడేవాళ్ళు ఈ కధ ని సపోర్టు గా తెచ్చుకోవటం చాలాసార్లు చూసాను.
మా చుట్టాల్లో, మా పెద్దమ్మ కొడుకు మా మేనమామ భార్య పినతల్లి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. దానితో మా అన్నయ్య పిల్లలకి నేను తండ్రి వైపుగా బాబాయినీ, తల్లి వైపుగా బావనీ అయ్యాను. తండ్రి వైపు దగ్గర సంబంధం కాబట్టి బాబయనే పిలిచేవారు. వరుస సంకరం జరిగిందని మా చుట్టాల్లో చాలా మంది ఏడుపు మొహాలు కూడా పెట్టుకున్నారు. వరుసకి అత్తయ్య అయ్యే మనిషి ని (కృష్ణుడికి రాధ అత్త వరుస అవుతుందనే కధ సపోర్టు తో) పెళ్ళి చేసుకున్నా, అది సాంఘిక సంబంధం వల్ల వచ్చిన వరుసే కానీ రక్త సంబంధం వల్ల వచ్చిన వరుస కాకపోవటం వల్ల, పుట్టిన పిల్లల విషయం లో అదృష్టవశత్తూ ఎటువంటి అవకరాలూ కలగలేదు. రక్తపరీక్షలు ఎవరూ చేయించుకోలేదు అనుకోండి.
ముస్లిం సంస్కృతి లో అయితే పిన్ని / బాబాయిల పిల్లలని కూడా పెళ్ళి చేసుకోవచ్చు. సైన్సు పరం గా ఈ సంస్కృతి లో అవకరం ఉన్న పిల్లలు పుట్టే చాన్సు ఎక్కువ. పెదనాన్న కొడుకుని "భయ్యా" అని పిలుస్తూనే, పెళ్ళి మాత్రం చేసుకుంటారు.
ఉత్తరాది లో ఉండే హిందూ సంస్కృతి కి చెందిన వాళ్ళలో ఎక్కువ మంది మేనమామ / మేనత్త పిల్లలని కూడా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడరు. దక్షిణాది లో ఇలా పెళ్ళి చేసుకుంటారని విన్నాక చాలా మంది ఆశ్చర్యపోతారు.
ఇక బాగా తెలిసిన హిందూ సంస్కృతి గురించి మాట్లాడుకుందాం. సైన్సు కి సంబంధించిన విషయాలని పక్కన పెడదాం. వావీ, వరుసలనే విషయాలు మాత్రమే పట్టించుకుందాం.
ఈ వావి, వరుసలు పాటించాలా అక్కర్లేదా? సంస్కృతి ని పాటిద్దామనుకునే వాళ్ళెవరైనా వెంటనే వావీ, వరుసలు పాటించాలని చెప్పేస్తారు. సంస్కృతి లో వావీ, వరుసలు ఒక భాగం. ఈ వావీ వరుస దగ్గర సంబంధం వల్లనన్నా కావచ్చు, దూరం సంబంధం వల్లనన్నా కావచ్చు, చెల్లెలి వరుసయ్యే అమ్మాయిని ఫలానా వాడు పెళ్ళి చేసుకున్నాడు అంటే, "ఆది మానవుడి భార్యెవరో" తెలియకుండనే అసహ్యం వేస్తుంది. ఈ అన్నా చెల్లెళ్ళ సంబంధం మీదే నమ్మకం పొతుంది.
ఆది మనవులు నాగరీకత లేకుండా బట్టలూ, వావీ వరుసలూ లేకుండా జీవించారు గాబట్టి, నాగరికత తెలిసిన మనం కూడా అలా ప్రవర్తించనక్కరలేదు. ఆ ఆది మానవులతో సమానత్వం సాధించటానికి తప్ప.
చుట్టాలెవరన్నా కలవగానే, వెంటనే వావి వరుసలు కనుక్కుంటాం. సంస్కృతి పరం గా కూతురు వరుసయ్యే అమ్మాయిని పెళ్ళి చేసుకోవటం, మరదలు వరుసయ్యే అమ్మాయి తల్లి గా రావటం వంటి చెత్త విషయాలు జరగకుండా ఉంటాయి.
సైన్సు ని పట్టించుకోనప్పుడు, సంస్కృతి ని అయినా పట్టించుకోవాలి. ఈ సంస్కృతి కూడా కొంత వరకూ ఇండైరెక్ట్ గా సైన్స్ ని బలపరుస్తుంది. మెరుగైన జీవితం కోసం. సైన్సూ వద్దు, సంస్కృతీ వద్దు, ఆది మానవుల లాగే బతుకుదామనుకుంటే, అది అలా అనుకునేవాళ్ళ హక్కుల మీద ఆధారపడి ఉంటుంది. నైతిక విలువలకి తిలోదకాలిచ్చేసాక, ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోవడానికి?
"Analyse That" అనే సినిమాలో రాబర్ట్ డీ నీరో ఫ్రాయిడ్ గురించి విన్నాక తల్లికి ఫోన్ చేయాలంటే భయం వేస్తోంది అంటాడు. ఇంక వావీ వరుసా పాటించకపోతే చెప్పనే అక్కరలేదు. జంతువుల కూటమిలా తయారవుతుంది కుటుంబం.
"ఇన్ సెస్ట్" విషయాల గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యం గా జంతువులని ఉదాహరిస్తాము. జన్యు శాస్త్రం లో పరిశోధన చేస్తున్న మిత్రుడు చెప్పిన ప్రకారం, ప్రకృతి రీత్యా కొన్ని జంతువులు పెద్దయ్యాక తమ గుంపు నుండి దూరం గా పోతాయిట. మనుషులు మాత్రం తెలివితేటలు ఎక్కువై వెనుకడుగులు వేసి, జంతువు లా వెనక్కి వెళ్ళిపోతున్నారు.
నాయనమ్మా, అమ్మమ్మా, తల్లీ, అక్కా, చెల్లెలు, ఒదిన, పిన్ని, అత్తయ్య, మరదలూ వగైరా వరుసలు ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని, లేనప్పుడు ఆది మానవులతో పొల్చుకుంటే సరిపోదు.
|