|
ఈ మధ్య Napster లో ఏదో తెలుగుపాట డవున్ లోడ్ చేస్తున్నప్పుడు ఒకతను చాటింగ్ మొదలెట్టారు. అతను US లో ఏదో యూనివర్శిటీ లో MS మొదటి సంవత్సరం చదువుతున్నారుట. రెండు మెసేజ్ లు అవగానే, "A/S/L Please" అని అడిగారు.
నాకు అర్థం కాలేదు. "అంటే ఏమిటి?" అని అడిగాను.
"Age/Sex/Location" అని వివరించారు అతను.
"వివరాలు అంత అవసరమా?" అని అడిగాను.
"నాకు అవసరమే" పట్టు పట్టారు అతను.
ఇలా మేము కొంచెం సేపు వాదులాడుకున్నాము. అతని లాజిక్ చాలా తమాషా గా అనిపించి, అతన్ని ఏడిపించాలని నేనూ అతను ఎడ్డెం అంటే తెడ్డెం అనటం మొదలెట్టను.
"నేను అడుగుతున్నది కేవలం స్నేహం చేయటం కోసమే. అది చెప్పటానికి అంత ఫీలైపోతావెందుకు?" అడిగారు అతను.
"స్నేహం కోసమే అయితే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు." నేను పట్టు విడువలేదు.
"ఆ వివరాలు అంత దాచుకోవాల్సిన అవసరం ఏమిటీ? మీ ఆడవాళ్ళు ఇంతే" నిష్టూరం గా అన్నారు.
ఆ బాణం కూడా పనిచేయకపోయేసరికి ఓపిక నశించి అన్నారు..
"నువ్వు చెప్పినా నువ్వు చెప్పేది ఎలాగూ నీ నిజం వయసు కాదు. నేను నువ్వు చెప్పేదానికి రెండో మూడో లేక డజనో ఏళ్ళు మళ్ళీ కలుపుకోవాలిలే."
నాకు నవ్వు వచ్చింది అతని మనఃస్థత్వానికి. కానీ అతను చెప్పేదానిలోనూ ఒక పాయింట్ వుంది. ఆడా, మగా బేధం లేదు. ఎందుకో మరి, తమ వయసు దాచుకోవటానికి తెగ పాట్లు పడతారు!
* * *
నాకు పరిచయం వున్న ఒక కుటుంబం వుంది. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి వయసు పదమూడు సంవత్సరాలు.
తను చదివిన కాలేజ్ గురించి ఆవిడ ఒకసారి చెప్తున్నారు. నాకు ఆ కాలేజ్ లోనే చదివిన ఒకాయన తెలుసు. కనుక అడిగాను. "మీది డిగ్రీ ఏ సంవత్సరం?"
దానికి సమాధానం చెప్పటానికి ఆవిడ పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. నేనేదో ఆవిడ చెప్పేదాన్ని బట్టి ఆమె వయసు ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తున్నానని అనుకున్నారు ఆవిడ. చాలా సేపు తర్జనబర్జన పడి ఆఖరికి చెప్పారు. చెప్పి వెంటనే అన్నారు.
"నేను చాలా చిన్నప్పుడే డిగ్రీ పూర్తి చేసాను. మూడు సార్లు నాకు ప్రమోషన్ ఇచ్చారు."
"చైల్డ్ ప్రాడిజీ అన్నమాట!" అనుకున్నాను. ఆవిడ చెప్పేది అబద్ధం అని నాకు తెలుసు. ఆమెని ఏడిపించాలి అంటే ఏవో ఎదురు ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టచ్చు. కానీ అందువలన నాకు ఏమి వస్తుంది? ఆవిడ చేత మరిన్ని అబద్ధాలు చెప్పించటం తప్ప!?
ఈ వయసు దాచుకోవటానికి కొంతమంది పడే పాట్లు చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది.
* * *
తాము చిన్నవారమని చూపటానికి ప్రక్కవాళ్ళని పెద్ద వాళ్ళని చేసేయటం సాధారణం గా అవలంబించే పద్ధతి. పెద్ద గీత ప్రక్కన చిన్న గీత ఫార్ములా అన్నమాట!
ఈ మధ్య నాకు పరిచయం వున్న కమల అనే ఆమె ఇంటికి వెళ్ళాను. అక్కడ కమలకి మేమిద్దరం తెలిసివున్న సీత ఫోన్ చేసారు.
ఇద్దరికీ తను తెలుసు కనుక నేను కూడా వాళ్ళ సంభాషణ వింటానని కమల ఫోన్ స్పీకర్ మోడ్ లో పెట్టారు.
సీత కమలని అడిగారు. "చాలా రోజులయింది మాట్లాడి. ఎలావున్నారు ఆంటీ?"
విని నవ్వుకున్నాను. వాళ్ళిద్దరికీ మధ్య వయసులో తేడా అయిదారు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. దానికే కమల తనకి ఆంటీ అయిపోతారా? అంటే ఆమె ఉద్దేశం తను చిన్నదానిని అని చెప్పడమా లేకపోతే కమల బాగా పెద్దది అని చెప్పడమా?
కమలేమీ ఊరుకోలేదు.
"నీకూ నాకూ మహా ఉంటే వయసులో కొన్ని నెలల తేడా ఉంటుంది అంతే. నువ్వు నాకన్నా మరీ అంత చిన్నదానివి ఏమీ కాదు. నన్ను నువ్వు ఆంటీ అని పిలవటానికి." సీత తనని ఆంటీ అని పిలవటం, అదీ నా ముందు పిలవటం కమలని బాగా బాధ పెట్టింది.
కానీ, కమల చెప్పింది మరీ విచిత్రం! కొన్ని నెలలే? "ఇద్దరికి ఇద్దరూ సరిపోయారు!" అనుకున్నాను.
|