|
ఈ మధ్య నా ఫ్రెండ్ వనజ అంది.. తను Napster లో చాట్ చేస్తుంటే ఒకతను చాటింగ్ మొదలెట్టారుట.. అతను US లో ఎక్కడో MS చేస్తున్నారుట. ఎవో మామూలు మాటలయ్యాక అన్నాడట, నాకు ఇండియన్స్ అంటే చిరాకు, ఎక్కడకి వెళ్ళినా గట్టిగా వాళ్ళదే మొత్తం చోటు అన్నట్టు మేనర్స్ లేకుండా మాట్లాడుతారు, గట్టిగా నవ్వుతారు.
మరి నువ్వేమన్నావు? అడిగాను నేను.
"ఏముందీ అనటానికి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి" అంది వనజ.
వెంటనే వాళ్ళాయన గోపాల్ అన్నారు "బహుశా క్రొత్తగా కాలేజ్ లో చేరి వుంటారు పాపం! ఇంకా ఎవ్వరూ ఫ్రెండ్స్ అయి వుండరు. అందుకే ఫ్రెండ్స్ తో వున్నపుడు తను ఎలా వుంటారో మర్చిపోయి వుంటారు"
అంతే కాదు, ఆయన బహుశా ఇతరులని చూసి వుండరు. లేక పోతే బాగా ఇంట్రావర్ట్ మనిషి అయి వుంటారు అనుకున్నాను.
చాలా రోజులు తర్వాత ఇండియా వెళ్ళి ఈ మధ్యే వచ్చినా నా ఫ్రెండ్ వాళ్ళాయనని అడిగాను, "ఏమనిపించిందీ ఇండియా వదిలి మళ్ళీ ఇక్కడకి వచ్చేసరికి?"
"ఏమిటీ అనిపించడం? మళ్ళీ ఈ చెక్క మొఖాల మధ్యకి వచ్చాం అన్న దిగులు తప్ప!" అన్నారు.
"అదేమిటీ?" అడిగాను అర్థం కాక.
"అక్కడ ఇండియా లో బిచ్చగాడు కూడా నవ్వుతూ వుంటాడు సంతోషం వేస్తే. ప్రతీ వారూ మనం తెలియక పోయినా పలకరిస్తే మాటలు కలుపుతారు. స్నేహంగా మాట్లాడుతారు. ఇక్కడ, ఇంట్లో ఒక మర్డర్ చేసి వచ్చినట్టు వుండే వీళ్ళ మొఖాలు చూస్తే పలకరించడమా, కనీసం, మొఖం లోకి కూడా చూడాలని అనిపించదు."
మొన్న ఒకరోజు నేనూ, వనజ ఇద్దరం ఎక్కడికో వెళ్ళాము. అక్కడే ఎక్కడొ మా ఇంకొక ఫ్రెండ్ ఆఫీస్ వుందని అంది తను. సరే సర్ప్రైజ్ విజిట్ చేద్దాం అనుకున్నాం. (ఆ రోజు నేను శలవు లో వున్నాను లెండి!) కానీ ఎక్కడో తెలీదు. కనుక డైరెక్టరీ లో చూద్దామనుకున్నాం. అక్కడ ఒక పబ్లిక్ ఫోన్ దగ్గర ఆ బుక్ చూసి తను వెళ్ళి అందులో తన ఆఫీస్ ఫోన్ నెంబర్ కానీ ఎడ్రస్ కానీ దొరకుతుందెమో వెతకడం మొదలు పెట్టింది.
ఇంతలో ఎవరో ఇద్దరు స్కూల్ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఫోన్ కోసమేమో అని నేను బయట నుంచి తనకి చెప్పాను.
కానీ అప్పటికే వనజ ఆ ఆక్షరం ని లొకేట్ చేసింది. కనుక ఇంక ఒక్క 2 క్షణాల్లో తన పని అయిపోతుందని. "ఫర్లేదు, అయిపోయింది" అని ఇంకా వెతకడం మొదలు పెట్టింది. సరీగ్గా ఒక్క క్షణమైనా గడిచి వుండదు, ఆ తర్వాత పేజీలన్నీ చింపేసి వుండటం తో తను బయటకి వచ్చేసింది. నేను పోనీ వాళ్ళాయన కి ఫోన్ చేద్దాం అని నా సెల్ నుంచి డయల్ చేసి తనకి ఇచ్చాను మాట్లాడమని.
ఇది చూసిన ఆ పిల్లల్లో ఒకమ్మాయి. ఒక బూతు మాట వాడి అంది, "సెల్ వుండగా పబ్లిక్ ఫోన్ ఎందుకో వీళ్ళకి అని!" మేము ఏమీ ఎక్కువ సేపు వాళ్ళ చేత వెయిట్ చేయించలేదు. వెంటనే బయటకి వచ్చేసాం కూడా. అయినా ఆమె మమ్మల్ని కామెంట్ చేసింది. అది ఆమె సంస్కారం!
కనుక మనం ఎక్కడ పుట్టామో దానిని బట్టి మన సంస్కారం కనిపించదు. మనం పెరిగిన, నేర్చుకున్న పద్దతుల్ని బట్టి మన సంస్కారం ఆధారపడి వుంటుంది. మనకి ఆ వ్యక్తుల మీద గౌరవం వుంటే, వాళ్ళు ఏం చేసినా బాగానే వుంటుంది. అదే గౌరవం లేకపోతే, అన్నీ తక్కువగా చూస్తాము. ఆ అబ్బాయికి తన దేశం అంటే, తన దేశ ప్రజలంటే గౌరవం లేదు. కనుక అందరినీ ఒక గాటన కట్టేసి ఫూల్స్ అని అనగలిగాడు.
ఈ మధ్య మొదటిసారిగా ఒక కెనేడియన్ ఒకతను స్పేస్ లోకి వెళ్ళారు. దానిగురించి మేం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం. "వీళ్ళు ఇంత డెవలప్ అయ్యాం, అదీ, ఇదీ అంటారు కదా, స్పేస్ లోకి ఇప్పుడు పంపించారు. మన రాకేశ్ శర్మ నా చిన్నప్పుడే స్పేస్ లోకి వెళ్ళారు కదా" అన్నాను. నాకు వీళ్ళ స్పేస్ ప్రోగ్రాం గురించి అంతగా తెలియదు.
"మన వాళ్ళదేముంది లే, వీళ్ళ డెవలప్ మెంట్ బాగుంటుంది." అంది మా ఫ్రెండ్.
నాకు తిక్క రేగింది. ఏమిటి. ఎందుకు యిలా ప్రతీ దానికీ మన మాతృదేశం ని కించపరుచుకుంటారు? అదే అన్నాను. చాలా కోపంగా.
దానికి మా ఫ్రెండ్ వాళ్ళాయన అన్నారు. ఎన్నయినా చెప్పండి, అక్కడ ఇండియాలో ఆ బ్యూరోక్రసీ అదీ ఇక్కడ లేదు.
ఏమిటి ఆ బ్యూరోక్రసీ? ఎక్కడ లేదు? ఇక్కడ విదేశాల్లో వున్నాం కనుక, వాళ్ళు ఏం చేసినా, అది మనకి మోజు.
"అక్కడ అన్నీ లంచాలు ఇస్తే కానీ పనులు అవ్వవు" అంది.
"ఎక్కడ లేవు లంచాలు? ఇక్కడ డాలర్లలో ఏ పని అయినా చేయటానికి ఖర్చు పెడుతున్నారు. అక్కడ అందులో నాలుగో వంతు ఖర్చు పెడతారు. పదో వంతు లంచాలు గా ఇస్తారు. అసలు ఆ వెయిట్ చేస్తే, లంచాలు లేకుండా పనులు అవుతాయెమో ప్రయత్నించారా? ఆ వెయిట్ చేయటం మనకే ఇష్టం లేదు. కనుక మనమే ముందు, అవతల వాడు బల్ల క్రింద చేయి పెట్టాడా అని చూస్తాము!"
మనం పెంచి పోషించీ, మనం మొదలెట్టిన దానిగురించి, మన దేశాన్ని కించపరచటం ఎంత వరకూ సబబు? మన పనులకైతే, లంచాలిచ్చి పని ముగించుకుంటాం. అనవసర టైం వేస్ట్ ఎందుకని. కానీ ఇతర్లు అదే పని చేస్తే విమర్శిస్తాం! ఇదెక్కడి హిపోక్రసీ? పైగా, దేశంలో అందరూ మనలాంటి వాళ్ళే అని మొత్తం దేశానికి ఒక బ్రాండ్ నేం తగిలించడం.. "un-cultured" అని!
|