చురకలు 9 - SKU Back   Home 
ఈ పేజీ ని పంపండి

ఈ మధ్య న్యూయార్క్ నుంచి నా ఫ్రెండ్ రాధిక ఫోన్ చేసినప్పుడు అడిగింది "ఈ వారం ఏం చేస్తున్నావు" అని.

"ఏముందీ.. ఒక పుట్టినరోజు పార్టీ వుంది అంతకన్నా ఏంలేదు" చెప్పాను.

మీ కెనడా వాళ్ళు చక్కగా అంతా చక్కగా కలిసి పార్టీలు చేసుకుంటారు. మేమిక్కడ పార్టీలు ఎలా ఎగ్గొట్టాలా అని వంకలు వెతుక్కుంటే మీరు పార్టీలు చేసుకోవటానికి వంకలు వెతుక్కుంటారు అంది ఒకింత ఈర్ష్యగా.

"మీరూ కలుస్తారుగా ప్రతీ వారం.. మీ ఇంట్లో నువు చేయవూ సంతర్పణలు!" అన్నాను వేళాకోళంగా.

"ఏం సంతర్పణలు లే, అన్నీ మానేసాను. అసహ్యం వేసింది ఇక్కడి మనుష్యులూ వారి వాడుకునే మమస్థత్వాలూ చూసి" అంది ఒకింత నిరాశగా.

"మంచి పని చేసావు. అసలు అలా శ్రమ పడొద్దని ఎప్పటినుంచో చెప్తున్నాను. ఇన్నాళ్ళూ వినలేదు" మందలింపుగా.

నేనలా అనటానికి కారణం వుంది.

రాధిక చాలా పాజిటీవ్ థింకింగ్ వున్న వ్యక్తి. ఎప్పుడు చెప్పినా, ఇవాళ ఎవరో భోజనానికి వచ్చారనే చెప్తుంది. ఆమె భర్త కొంచెం ఎక్కువే సోషల్ గా వుంటారు. వీళ్ళిద్దరూ అందరికీ వెళ్ళి సాయం చేయటం నాకు తెలుసు. రాధిక కూడా అతనికి ఎదురు చెప్పదు. అతను వున్నట్టుండి రాత్రి ఏ 10 గంటలకో ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళని భోజనానికి రా అని పిలిచేయటం, ఈ అమ్మాయి అయ్యో, వచ్చే అబ్బాయి (అక్కడ అంతా సాధారణంగా పెళ్ళి కాని బ్రహ్మచారులు లెండి) కమ్మని భోజనానిని మొఖం వాచి వుంటాడు. ఒట్టి ఒక్క కూర తో ఏం భోజనం పెడతాం అని, అప్పటికప్పుడు తన ఒంట్లో ఎలా వున్నా అవీ, ఇవీ వండి వార్చడం నాకు తెలుసు.

మనం ఎవరికైనా సాయం చేస్తే తిరిగి వాళ్ళదగ్గరనుంచి ఎదో ఆశించి చేయం. కానీ అవతల వ్యక్తి మనం చేసిన సాయానికి విలువ కడితే ఎలావుంటుంది? ఏ వ్యక్తినైనా మనం అవసరానికి ఆదుకున్నప్పుడు, ఆవతలి వ్యక్తి కూడా ఆ మంచితనం చూపించాలి కదా?

రాధిక వాళ్ళాయన కొలీగ్ ఎవరో వేరే చోట ఉద్యోగం వచ్చి వెళ్ళిపోతున్నారని తెలిసి వాళ్ళింటికి వెళ్ళారుట. అక్కడ క్రొత్తగా అమెరికా వచ్చిన రవి అనే ఆయనా, వారి కుటుంబం పరిచయం అయ్యారు. తెలియని చోట సాటి తెలుగువారు అని తెలియగానే రవి వీళ్ళ ఫోన్ నెంబరు తీసుకున్నారుట.

తర్వాత 4 రోజులకి అర్థరాత్రి ఎవరో ఫోన్ చేసి అడిగారుట.. ఫలానా రవిగారు మీకు తెలుసా అని. ఆయనెవరో గుర్తు తెచ్చుకుని తెలుసు అని చెప్పగానే, అవతల వ్యక్తి తను ఆసుపత్రి నుంచి ఫ్హోన్ చేస్తున్నాననీ, రవి, అతని భార్య వనజా వాళ్ళ కారుకి ఏక్సిడెంట్ అయి ఇద్దరూ ఎమర్జెన్సీ వార్డు లో వున్నారనీ.

రవి ఆర్గనైజర్ లో వీళ్ళ నెంబరు చూసి ఫోన్ చేశామనీ చెప్పారుట. రాత్రికి రాత్రి ఇద్దరూ ఆ hospital కి పరిగెట్టారు. అతనికి అంత సీరియస్ దెబ్బలు తగలలేదు కానీ ఆమెకి భుజం ఎముక విరగటం వలన చాలా రోజులు ఏ పనీ చేసుకునే వీలు లేకపోయింది. ఇండియా నుంచి వెంటనే ఎవరినైనా తీసుకువచ్చే లోపల ఇంట్లో పిల్లలని చూసే దిక్కు లేకపోతే, పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, రోజూ వాళ్ళ ఆలనా పాలనా చూసి, తరువాత hospital కి వెళ్ళి దుఃఖంలో వున్న ఆమెని ఓదార్చి, ధైర్యం చెప్పి, అన్నీ చేసింది.

ఎందుకు చేసింది? వనజ నుంచి ఏమన్నా ఆశించా? లేదే. కష్టాలు ఎవరికైనా వస్తాయి. అటువంటప్పుడు సాటి మనిషిగా మానవత్వంతో ఆమె ఎవరో తెలియక పోయినా, వెళ్ళి స్వంత తోబుట్టువులా చేసింది.

ఇలా దాదాపు ఒక నెల రోజులు గడిచాక, ఆమె తల్లి ఇండియా నుండి వచ్చారు. తరువాత కూడా, రాధికా, వాళ్ళాయనా వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాకబు చేసి ఏ సాయం కావాలన్నా చేసారు.

దానికి ప్రతిఫలంగా, వాళ్ళ అమ్మగారు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎవో బంగారం దుద్దులు తెచ్చారు రాధిక కి. అంటే, ఈమె చేసిన సాయానికి వెల కట్టారు.

రాధిక చాలా బాధ పడి "వద్దు, నాకలా తీసుకోవటం ఇష్టం వుండదు" అని తిరస్కరిస్తే, వనజా వాళ్ళమ్మగారు "లేదు, నువు మా అమ్మాయి లాంటి దానివి, మేము చేయాల్సిన సాయం అంతా తనకి చేసావు. తనకీ, నా మనవలకీ అమ్మలా అన్నం పెట్టావు." అదీ, ఇదీ అంటూ బలవంతం చేసేసరికి తీసుకుంది.

ఆగండి.. అది అక్కడ ఆగలేదు.

తరువాత కొన్నాళ్ళకి రాధిక pregnant అయింది. అమ్మ అవాలని వేయి దేవుళ్ళకి చేసుకున్న విన్నపాలు, నెరవేరాయని సంతోషపడుతుండగా, దురదౄష్టవశాత్తూ తనకి మిస్ కారేజ్ అయింది. చాలా సీరియస్ అవటం వలన hospital లో 2 రోజులు వుండాల్సి వచ్చింది. శరీరానికి అయిన గాయం కన్నా నిరాశతో మనసుకి అయిన గాయాన్ని తట్టుకోలేక రాధిక ఎంతో డిప్రెషన్ కి లోనైంది. ఇంటికి వచ్చాక కూడా, ఎప్పుడూ ఎంతో సంతోషంగా అందరికీ వెళ్ళి సాయం చేసే వ్యక్తి ఇంతలా బాధలో వుందని తెలిసి కూడా, ఎవరూ ఒక సానుభూతి వాక్యం పలకకపోవటం తో (కనీసం రాధిక వెళ్ళి ఊడిగం చేసిన ఆ అమ్మాయి కూడా!!) ఒక రకమైన విరక్తి భావం.

తనకి ఆ పరిస్థితిలో కావలసింది సానుభూతా? కాదే. కేవల మాట్లాడటానికి ఒక మనిషి. మరి అన్ని రోజులు అంతమందికి అన్ని రకాలుగా సాయపడి, అంతమంది ఫ్రెండ్స్(??) ని చేసుకున్నా, తనకి కావాల్సినపుడు ఒక్కరూ ఒంగి వాలలేదు, తొంగి చూడలేదు అంటే అది అటువంటి వారిని ఫ్రెండ్స్ అనుకోవటం వీళ్ళ పొరపాటా లేక, చేసిన సాయం మర్చిపోయే అటువంటి వారి కృతజ్ఙతా?

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.