అరుంధతి - కోడి రామకృష్ణ Back   
విడుదల సంవత్సరం : 2009
భాష : తెలుగు
నటీనటులు : అనుష్క, దీపక్, సోనూ సూద్, షియాజి షిండే
సంగీతం : కోటి
దర్శకత్వం : కోడి రామకృష్ణ
ఈ కబుర్లు చెపుతున్నది : వరుణుడు
అదనపు కబుర్లు కబుర్లు రచ్చబండ లో మీ కబుర్లు చెప్పండి
 Share with Yuyam

ఈ పేజీ ని పంపండి
హింస ను ఎలా చూపినా హింసే. అది సోషల్ సినిమా కానీ, దేవుడి సినిమా కానీ లేక ఫాంటసీ సినిమా కానీ. గ్రాఫిక్కులు ఉన్నాయి కాబట్టి మహాద్భుతం అనుకోనక్కరలేదు. ఈ మధ్య వచ్చే చాలా సినిమాల కు సరిసమానమయిన, ఇంకా చెప్పాలంటే, కొంచం హెచ్చు స్థాయిలో హింసను రంగరించి, పైశాచిక త్వాన్ని కలగలిపి, రక్తపు మెరుగులు దిద్ది, జుగుప్సాకర సన్నివేశాలతో కూర్చి వండిన వంటకమే ఈ సినిమా - అరుంధతి.

కథ: చాలా సాదా సీదా కథ. చాలా సార్లు చూసేసిన కథ. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మ అవుతుంది. ఆది తన పగ తీరే దాకా ఆ ప్రేతాత్మ గా అంతరించదు అనే సాధారణమైన కాంసెప్ట్. ఇలాంటి అంశాలతో ఇది వరకే చాలా సినిమాలు చూసేశాం. "పురానీ హవేలీ" టైప్ సినిమా.

గద్వాల్ సంస్థానం రాజు కు ఇద్దరు కూతుళ్ళు. మొదటి కూతురు చాలా సాదా సీదా అమ్మాయి. రెండో కూతురు అరుంధతి. బాల్యం లోనే అన్ని విద్యలను – అంటే కత్తి సాముల్లాంటివన్నమాట, అభ్యసించి వివేకవంతురాలవుతుంది. ఆమె అంటే ఆ సంస్థానం లో అందరికీ గౌరవమే. ఆమెను ఆ సంస్థానం ఆరాధ్య దేవత జేజమ్మ తో పోల్చుకొంటుంటారు ఆ సంస్థాన ప్రజలు. రాజు గారు తన మొదటి కూతురిని తన చెల్లెలు కొడుకు పశుపతి కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఈ పశుపతి ఒక కామాంధుడు. కంటికి నచ్చిన ఆడ పురుగును కూడా అనుభవించాలని కోరుకొనే వికృత మనస్తత్వం కలవాడు. ఈ విషయం తెలీక(?) రాజు గారు మొదటి కూతురిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఈ పశుపతి తల్లి, అదే రాజు చెల్లెలు, కొడుకు చేసె అరాచకాలను ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఈ కామంధుడి చేతిలొ ఆ సంస్థానం నాట్యాచారిణి దారుణం గా బలై పొతుంది. ఆది చూసి, భరించలేని అరుంధతి ఆ కామాంధుణ్ణి తీవ్రంగా గా శిక్షిస్తుంది. కొన ఊపిరి తో బయట పడి, ఈ పశుపతి, అఘోరాల దగ్గర చేరి, క్షుద్ర విద్యలు నేర్చుకొని మళ్ళీ ఆ సంస్థానానికి వస్తాడు. అదే సమయానికి అరుంధతి కి పెళ్ళి జరుగుతూ వుంటుంది. అక్కడ చాలా మందిని చంపేసి, రాజు గారిని కూడా చంపేసి, అరుంధతిని పొందాలనుకొన్న పశుపతి ని అరుంధతి తెలివిగా పడగొట్టి అతడికి సజీవ సమాధి నిర్మిస్తుంది. ఆ సమాధి లోనే పశుపతి చనిపోయి ప్రేతాత్మ అవుతాడు. కానీ సమాధి నుండి బయటకు రాలేని విధంగా ఆ సమాధిని రక రకాల దైవశక్తుల అంశతో ఉన్న రేకులతో అరుంధతి నిర్మిస్తుంది.

తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా అరుంధతి కూడా చనిపోయి, ఇప్పటి కాలం లో అదే రూపం లో పుడుతుంది. ఈ ప్రేతాత్మ అరుంధతి మీద పగ తీర్చుకొన్నాడా, అరుంధతి కథ ఏమిటి ఇత్యాది అంశాలు సినిమా లో చెప్పబడ్డ కథ.

విశ్లేషణ: ఇక్కడ నేను పాత్రధారుల నటనా ప్రతిభను విశ్లేషించను. ఎందుకంటే అందరూ తమ తమ పాత్రల్లో న్యాయం చేశారు. గ్రాఫిక్కుల గురించి, సాంకేతిక విలువల గురించి బోల్డన్ని చోట్ల ఆకాశానికి ఎత్తేసారు. వాటి గురించి రెండొ అభిప్రాయం లేదు. తెలుగు సినిమా లో ఈ స్థాయి లో టెక్నికల్ విలువలు బహుశా ఇదే ప్రధమం కావచ్చు. బాగానే వుంది. కానీ, కథనం లో చూపిన మితి మీరిన హింస, మితి మీరిన అసభ్యత, మితి మీరిన పైశాచికత్వాలు కూడా.. ఇదే స్థాయిలో ఉన్నాయి. విలన్ కామంధుడు అని చెప్పడానికి పదే పదే ప్రయత్నించడం ఎందుకో..? ఒక సన్నివేశం లో… విలన్ గారు పవళించి ఉంటే, చుట్టూ ఒక నలుగురైదుగురు అమ్మాయిలు అతణ్ణి సరస సల్లాపాల్లో తేలిస్తుంటే, అదేంటి అని ప్రశ్నించ వచ్చిన భార్య, గుండె మీద(లిటరల్ గా) కాలు పెట్టి వికటాట్టహసం చేస్తాడు ఈ విలన్. ఆది చూసి ఆ విలన్ తల్లి ఆనందాతిరేకం తో ఉబ్బి తబ్బిబ్బయ్యి, ఇవన్నీ రాజులకు సాధారణమే అని తీర్పు ఇస్తుంది. ఇలాంటి పైత్య ప్రకోప సన్నివేశాలు ఎన్నొ ఉన్నాయి ఈ సినిమా లో…

మరి ఎందుకు ఈ సినిమా విజయవంతం అవుతోంది? కేవలం అత్యున్నత సాంకేతిక విలువలు వున్నందుకా? తర్వాత ఏమవుతుంది అనే ఉత్కంఠ ను ఎక్కడా తగ్గకుండా నడిపిన కథనమా..? నటీ నటుల ఉత్తమ నటనా వైదుష్యమా..? ఏమో..! ఇవన్నీ ఈ సినిమా విజయానికి కారణాలు కావచ్చు కానీ.. ప్రధానం గా ఒక నైతికత లోపించిన కథ ఇది! ఒక కామాంధుడు కోరుకొన్నప్పుడు వాడి దగ్గరకు వెళ్ళక పోతే.. ఆ అమ్మాయి జీవితం, ఆ జన్మ లోనే కాదు, వేరే జన్మలో కూడా సుఖంగా ఉండలేదు అని నిరూపించినట్టు గా అనిపించింది.

ఈలా క్షుద్ర శక్తి, దైవ శక్తుల ఆధారంగా వచ్చె ఏ కథలో అయినా చివరికి గెలిచేది దైవశక్తే అని చూపితే బాగుంటుంది గానీ, ఒక క్షుద్రుడిని ఎదుర్కొనడానికి రెండు మూడు జన్మలు ఎత్తాలి అంటే… మంచిగా బతకడం కన్నా… ఇలా క్షుద్రంగా బతికే వాడిదే జీవితం అనే సందేశాన్ని, గ్రాఫిక్కుల ద్వారా, DTS ధ్వనుల ద్వారా, అత్యుత్తమ నటీ నటుల నటనా ప్రతిభ ద్వారా, అత్భుతమైన కథనం ద్వారా చెప్పినట్టు అవుతుంది. కాబట్టి.. ఈ సినిమా ను నేనైతే ఎవరికీ చూడమని సలహా ఇవ్వను ( ఇచ్చినా ఎవరూ వినరనుకోండి.. అది వేరే విషయం). ఈ సినిమాను పైరేటెడ్ DVD లొనో, నెట్ లోనో చూడకండి. థియేటర్ లో అసలు చూడకండి..అనే సలహా ఇస్తాను.

నా రేటింగ్: 2

కొసమెరుపు: విలన్ గారు చివరలో చావడం లో కూడా ఎక్కడా దైవశక్తొ, లేక హీరో/హీరోయిన్ గొప్పదనమో లేదు.. కేవలం లక్ తో చస్తాడు… అరుంధతి ఏదో పొడిచేస్తుంది, చింపేస్తుంది అనుకొంటే, ముగింపు లో కూడా విలన్ దే పై చెయ్యి అవుతూ హీరోయిన్ అదృష్ట వశాత్తు చావడం.. నాకు ఎందుకో ఎక్కలేదు. ఈ విషయం గురించి ఎమైనా చెప్పాలనుకోంటే రచ్చబండలొ మాట్లాడుకొందాం..
క్రిత్రం వారం upload చేసిన "అరుంధతి" చిత్రం రివ్యూ తీసివేయటం జరిగింది. నేను చెప్పాలనుకున్నవి అన్నీ చెప్పలేకపోయను. చాలావరకు నా అభిప్రాయాలు వరుణుడు నాకన్నా చక్కగా చెప్పారు. ఆ కారణం చేత దీనిని ప్రచురిస్తున్నాను. ఇంకో కారణం కూడా వుంది ఈ చిత్రం వీడియో రివ్యూ తీసివేయటానికి. ఎవరికో ఈ రివ్యూ copyright ప్రోబ్లెం అనిపించిందిట. LOL!! దానిగురించి నా కౌంటర్ పంపించి ఈ చిత్రం గురించి ఈంకా నా టైము వేస్ట్ చేసుకోవటం అనవసరం అనిపించింది కనుక దానిని youtube నుండి కూడా తీసివేసాను.

- SKU