బిజినెస్ మ్యాన్ - పూరీ జగన్నాధ్   Home   
విడుదల సంవత్సరం : 2012
భాష : తెలుగు
నటీనటులు : మహేష్ బాబు, కాజోల్
సంగీతం : S.S.తమన్
దర్శకత్వం : పూరీ జగన్నాధ్
ఈ కబుర్లు చెపుతున్నది : పార్థు
అదనపు కబుర్లు కబుర్లు రచ్చబండ లో మీ కబుర్లు చెప్పండి

ఈ పేజీ ని పంపండి

"ముంబయ్ మూత్ర విసర్జనే బిజినెస్ లక్ష్యం గా పెట్టుకున్న ఒక భాయ్ కథ" . వినటాని కి కొంచెం ఇబ్బంది గాను , అదోలాను వుంది కదా. సినిమా కూడా అంతే. "బిజినెస్ గొడవలో పడి ఫ్యామిలీని మిస్ చేసికున్న బిజినెస్ మాన్ లా" , క్రైమ్ బిజినెస్ ఇఛ్ఛలో, కారెక్టరైజేషన్ పిచ్చలో పడి, ఫ్యామిలీ ప్రేక్షకులని దూరం చేసికున్న బిజినెస్ మాన్ కథ, క్వాలిటి ని పక్కనబెట్టి, మెంటాలిటి తో మార్కెట్ చేసుకుందామనుకుని మంటగలిసిపోయిన బిజినెస్ మాన్ కథ, భాయ్ అవటం అంటే చాయ్ చేయటం అంత చిన్నవిషయం అని చెప్పి వొప్పించాలని చూసిన బిజినెస్ మాన్ కథ ఈ సినిమా.

ముంబయ్ లో భాయ్ పోస్ట్ ఖాళీ అయ్యింది, అర్హతలున్నవాళ్ళు అప్లై చేసికోండి అంటూ పోలిస్ కమీషనర్ పెట్టిన ఒక అవగాహన సదస్సు తో సినిమా ప్రారంభం అవుతుంది. ముంబయ్ లో నిరంతరం "మూత్రం", ఏ మాత్రం తగ్గకుండా, ఆమూలాగ్రం పారేలా చెయ్యటం కోసం హీరో కారెక్టర్ ఎంటర్ అవుతుంది. ప్రారంభం లో పైసా లేకపోయినా ఫ్రెండ్ కి పాతిక వేలు ఇచ్చి పని లో పెట్టుకోవటం లో దూకుడికి దణ్ణం పెడతాం, పోను పోను పస లేని పనులతో చేసే కుమ్ముడి కి కూలబడతాం. అక్కడక్కడ అమ్మడి తో పాడుకోవడం, అప్పుడప్పుడు అంగడిలో బిజినెస్ చెయ్యటం. అలాంటి, ఇలాంటి బిజినెస్ కాదు మరి!

చేతిలో క్యాపిటల్ లేకుండా, క్యాపిటల్ ని (ఢిల్లీ) కోట్లలో కొనెయ్యడం, అడిగిన అప్పారావ్ కి అప్పనంగా ఇచ్చెయ్యడం, కమీషనర్ కూతుర్ని కమీషన్ గా వాడుకుంటూ మిషన్ ఇంపాజిబుల్స్ చెయ్యటం, బాంక్ లు దోచేస్తూ , ఓట్ బాంక్ లు పెంచేస్తూ, మేయర్ లని పేకాటలో జోకర్లలా మార్చెయ్యడం, ఇలా బుక్ ఆఫ్ రూల్స్ అంటూ అఏమి లేని బిజినెస్ తో ముంబయ్ ని రూల్ చేస్తుంటాడు సూర్య భాయ్. తనకి సరైన సమీప ప్రత్యర్ధి లేకపోవడంతో సూర్య పొడించింది పోటుగా, వేసింది వేటుగా జరుక్కుపోతూంటుంది. "గౌడవున్ లో స్టాక్ ను చూసుకుని మురిసిపోతే, స్టాక్ మార్కెట్లో స్టాక్ గల్లంతు అయినట్టు", హీరో కారెక్టర్లో బలం చూసుకుని బరిలో దిగిన పూరి కి, మిగిలిన కారెక్టర్ లు జీరో అవటం తో, ఆట కాస్తా "ఒక్కడి" కబాడి అయిపోయింది.

కథలో ఏముంది "తొక్క", కారెక్టర్ లోనే వుంది "పండు" అంతా అని పోకిరి హిట్ చూసుకుని సినిమాలు తీసే పూరి, ఆ పండు కాస్త కుళ్లి కంపు కొట్టడంతో, మైండ్ ఈసారి బ్లాంక్ అవ్వకపోగా బ్లీడ్ అయిపోయింది. చంద్రునికి నూలుపోగులా , తన మాఫియా గురువుని మోసే ప్రక్రియ లో, "భాయ్" మోజులోపడి, ఆయనిచ్చిన పురికోశ లాంటి ఒకే ఒక లైన్ ని అసలు డెవలప్ చెయ్యకుండా సినిమా నడపటం తో అది కాస్తా తెగూరుకుంది. నా కథానాయకుడికి ఆత్మవిశ్వాసం మెండు అని చెప్పాలనే ధోరణి లో ప్రేక్షకుల విశ్వాసానికి పూర్తి గా ఘోరీ కట్టాడు పూరి అర్ధంపర్ధం లేని సన్నివేశాలతో. పుండు మీద పెప్పర్ లా, ఉచ్చస్థితికి చేర్చడానికి ఎంచుకున్న "మలమూత్ర కార్యాచరణ ప్రణాళిక" ఎన్నో ఏళ్ళుగా ఫినాయిల్ వేసి కడగని పాయిఖానా వాసనేసింది, వెగటు పుట్టింది. రౌండప్ చెయ్యకపోయినా, కంఫ్యూజ్ కాకపోయినా, ఎక్కువ సార్లే బాదుడు కార్యక్రమాలు పెట్టుకోవడం తో , ప్రేక్షకులు భాయ్ కి బై బై , పూరి కి సారీ చెపుతారు. అసలు భాయ్ ఎందుకవ్వాలనుకున్నావ్ అని అడిగిన పాపాయి కి, కథ చేసికున్న పాపానికి, తన వ్యధ ని వ్యక్తపరచి ప్రేక్షకుల కోపాని కి గురవుతాడు సూర్య. అయ్యా! అసలేం లేదక్కడ. దేశాన్ని ఎలా దోచుకోవాలో అని యువతకి చివర్లో ఇచ్చిన సందేశం ఒక్కటే ఈ సినిమా లో వున్న కామెడీ ఎపిసోడ్. గోళ్ళు పెంచుకుంటూ (లేదా గిల్లుకుంటూ) కూర్చోద్దు, గోల్ ఒకటి పెట్టుకో, జనాన్ని గోల్ మాల్ చేసేట్టు. ఎవడి మాట వినొద్దు, ఎవడూ నీకన్నా తోపు కాదు, ఇక్కడ అంతా పాపులే (టాప్ కాదు అని చెప్పాలని డైరెక్టర్ ఉద్దేశ్యం అనుకుంటా). బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి, బోల్డ్ గా నీకావల్సిన బిజినెస్ చేసికో, అది మార్కెట్టా, మాఫియానా అన్నది అనవసరం, బిజినెస్ చేసామా, లేదా అన్నదే ముఖ్యం . పూరి ప్రవచనాల్లో అయితే "ఏం బిజినెస్ చేస్తున్నామన్నది కాదక్కయ్యా ముఖ్యం, కస్టమర్స్ వున్నారా లేదా అనేదే ముఖ్యం" అని.

"ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకున్నా, అమెరికా డాలర్ కి ఇండియా లో గిరాకి పెరిగినట్టు", "సరైన హిట్ ఆల్బం ఇది" అని గట్టిగా చెప్పుకోలేకపోయినా, మిరకిల్ గా బోలెడు గిరాకి వున్న మ్యూజిక్ డైరక్టర్ తమన్ బాణీల బాన లో పేణీళ్ళా పేలిపోతారు ప్రేక్షకులు. "సార్ వచ్చేలోగా" బేజార్ అయి జారుకుంటారు. మణిశర్మ, దేవిశ్రీ ల స్థానం భర్తీ చేయ్యాలంటే వళ్ళు పెంచడం కాదు, వంచాలి తమన్.

మహేష్ బాబు నటనపరంగా OK అనిపించినప్పటికి, కొద్దిగా స్టైల్ మార్చాలి. ఖలేజా, దూకుడు, దీనిలో ఒకే టైప్ నటన అనిపిస్తుంది. ఈ బిజినెస్ మాన్ ముందు , ఇహ మిగిలిన హోల్సేల్ గాళ్ళు, రీటైల్ గాళ్ళు, చిల్లరకొట్టు చిట్టెమ్మలు, రైతుబజార్ గాళ్ళు, దళారీలు ఎవరూ నిలబడరు, ధైర్యం చేసి నిలబడ్డా, పూరి, వాడ్ని కాసేపటికే కనపడనీకుండా చేశాడు.

పూరి చేసిన ఓ మంచి పని ఏదైనా వుంది అంటే, టైటిల్స్ లో రాంగోపాల్ వర్మ కి డైరెక్ట్ గా క్రెడిట్ , మన కి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వటం, ఆయన తరహా చిత్రమే చూడబోతున్నాం అని. అంతకు మించి మెచ్చుకోదగ్గ అంశమేది కనపడదు ఈ చవకబారు బిజినెస్ లో. వసూళ్ళపరంగా చేస్తుందేమో గాని భీభత్స బిజినెస్, ఆహ్లదకరంగా చూద్దామని వెళితే మాత్రం చేస్తుంది విపరీతమైన న్యూసెన్స్.

పార్ధూ