|
|
| ఈ పేజీ ని పంపండి |
మహేష్ కొత్త సినిమా.. ఆయన అభిమనులు అంతా, మళ్ళీ సంబరాలు చేసుకొనే సమయం.. నేను ఆగుతానా!?
కధ..
సినిమాల్లో మాత్రమే కనిపించే మంచి లక్షణాలు అన్నీ కలబోసుకున్న రాజకీయ నాయకుడు శంకర్ నారాయణ (ప్రకాష్ రాజ్). ఆయన కి అనుచరగణం బోలేడు మంది, కొడుకు అజయ్ (మహేష్). రోడ్డు ప్రమాదం లో చనిపోయారు అని అందరూ అనుకుంటున్న శంకర్ నారాయణ పధ్నాలుగేళ్ళ తరువాత కోమా లోంచి బయటకి వస్తారు. ఆయనని ఎల్లప్పుడూ సంతోషం గా ఉంచాలని డాక్టర్లు చెప్తే, అక్కడ నుండి అతని కుటుంబం మొత్తం కలిసి మనకి చెవిలో కేబేజీ పువ్వులు పెట్టే కార్యక్రమం మొదలెడతారు. వాళ్ళ అతుకుల బొంత మధ్య ముంబై లో పోలీస్ అధికారి అయిన అజయ్, నాయక్ అనే మాఫియా లీడర్ ని పట్టుకోవటానికి అతనూ, అతని అనుచరగణం చేసే టర్కీ ఎడ్వంచర్లూ, అక్కడ హీరో హీరోయిన్ల ప్రేమాయణం, చివరకి విలన్ కి హీరో తో లింక్ అన్ని చుక్కలని దర్శకుడు కలిపి కధ ముగిస్తారు.
నటన..
మహేష్ కొంచెం పుష్టి గా అయ్యారు. ఇంకా గడ్డాలూ మీసాలూ రాలేదు. కానీ నటన మాత్రం మరింత పదునెక్కింది. తెలంగాణా ప్రేక్షకులని ఆకట్టుకోవటం కోసం అనుకుంటా, కొన్ని సందర్భాలలో తెలంగాణా యాస లో మాట్లాడతారు, మిగిలిన సమయం లో మళ్ళీ ఆంధ్రా యాస లోకి మారిపోతూ ఉంటారు. Straight face తో చెప్పిన కామెడీ డైలాగులు బాగున్నాయి. కధానాయిక సమంత చూడటానికి బాగున్నారు. ఆమెకి చెయ్యటానికి పెద్దగా ఏమీ లేదు. ప్రెట్టీ డ్రెస్ లలో ప్రెట్టీ గా కనపడటం తప్ప. ఒక చోట ఆవిడ ఓణీ వేసుకొని షూస్ తో గంతులు వేస్తూ డాన్స్ చేస్తారు.. ఇండియా లో కొత్త ఫేషన్ అనుకుంటా! మహేష్ కి మలెనే ఆమెది కూడా చక్కటి నవ్వు. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కొత్తగా చేసినది ఏమీ లేదు. సోనూ సూద్ కూడ మామూలే. ఇంక సుధ, చంద్ర మోహన్, తణికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, శియాజీ షిండే ఇదివరకు టన్నుల కొద్దీ సినిమాలలో చేసినదే ఈ సినిమాలోనూ చేసారు. బ్రహ్మానందం, MS నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ కన్నా మహేష్ చేసిన కామెడీ ఎన్నో రెట్లు బాగుంది. ఒక విషయం, MS నారాయణ 2,3 సీన్లలో నాలుక చూపిస్తారు, చూస్తే, ఆ నాలిక తెల్లగా, పాచి పట్టి చూడగానే వెగటు పుట్టింది! మరో విషయం, బ్రహ్మానందం, శియాజీ షిండే లు కలుసుకునే సన్నివేశం లో ఒక ఐటెం డాన్స్ ఉంది. ఆ డాన్స్ లో మహేష్ సహ నటి నడుం మీద బూటు కాలు పెట్టి చేసిన ఒక స్టెప్ ఉంది. ఇలాంటివి చూస్తే నాకు చిరాకు.
దర్శకత్వం..
శ్రీను వైట్ల దర్శకత్వం హీరో ని నిర్ణయించుకొని, ఆ హీరో కి సరిపోయే సీన్లు రాసుకొని, దానికి తన సిగ్నేచర్ కామెడీ సీన్లు అతికించి, పూర్తి ఫార్ములా తో తీసారు. చూడబోతే చిరంజీవి కేంప్ తప్ప మిగిలిన అందరు కేంప్ లనీ acknowledge చేసారు. ఇలా అవసరం లేని ప్రస్థావనలు కృత్రిమం గా అనిపించాయి.
SS థమన్ సంగీతం ఇంతకుముందు రెండు మూడు సినిమాల్లో బాగున్నట్టు అనిపించి, ఈ సినిమా రిలీజు అవకముందు దీనిలోని పాటలు కూడా విన్నాను. వేటిలోనూ అతని పాత పాటల మాదిరి కొత్తదనం, మళ్ళీ వినాలనిపించటం లేదు. సినిమా చూసాక కూడా ఆ అభిప్రాయం ఏమీ మారలేదు.
డైలాగులు కొన్ని బాగున్నాయి. ముఖ్యం గా (మహేష్) కామెడీ సన్నివేశాలలో డైలాగులు బాగున్నాయి.
మహేష్ అభిమానులకి నచ్చుతుంది. కొన్ని చోట్ల ఈ చిత్రం కుటుంబ సమేతం గా చూడదగ్గ చిత్రం అని రాసారు. నా దృష్టి లో అలా అన్న వ్యక్తి ఒక పెద్ద moron! విపరీతమైన హింస, కొన్ని అశ్లీల దృశ్యాలు, ఇవి పిల్లలకి పర్లేదు అనుకుంటే సరే, తీసుకెళ్ళండి చిన్న పిల్లలని ఈ సినిమాకి.
|
|