ఖలేజా - త్రివిక్రం శ్రీనివాస్ Back   
విడుదల సంవత్సరం : 2010
భాష : తెలుగు
నటీనటులు :మహేష్, అనుష్క
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : త్రివిక్రం శ్రీనివాస్
ఈ కబుర్లు చెపుతున్నది : పార్థు
అదనపు కబుర్లు కబుర్లు రచ్చబండ లో మీ కబుర్లు చెప్పండి

ఈ పేజీ ని పంపండి
మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమా అంటే అదో ఆపేక్ష. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాక్సాఫీస్ దగ్గర పది సినిమా లకి పైగా, అటు నిర్మాతల కి, బయ్యర్ లకి కాసుల గలగలలు, ఇటు ప్రేక్షకులకి డోసుల కొద్దీ నవ్వుల-పువ్వులు కురిపించిన స్టార్ దర్శకుడి సినిమా కి ఎన్నడూ లేనంత నిష్టూరాలు రావడంతో ఆపేక్ష పోయి ఆశ్చర్యాని కి గురి చేసింది. 'అతడి ' సత్తా ఈ చిత్రం లో పత్తా లేకుండా పోయిందని నెట్టు రివ్యూ లు, వట్టి రివ్యూ లు గోలెట్టటం తో, అంచనాలని అటకెక్కించి చూడ్డం జరిగింది.

కథ, కథనాల గురించి లోతు గా వెళ్ళకుండా ముఖ్యం చెప్పలనుకునేవి 3 పాయింట్లు.
  1. త్రివిక్రం
  2. మహేష్
  3. రివ్యూ తో కాక మీ ఓన్ వ్యూ తో చూడండి
నాకు మహేష్ అంటే, జగన్ పై అధిష్టానాని కి వున్నంత అసహ్యం వుంది. అతను చూడ్డానికే గాని, యాక్టింగ్ చెయ్యడానికి కాదు అని ఒక నమ్మకం వుండేది. ఆ అభిప్రాయాన్ని ఆమూలాగ్రం తుడిచిపెట్టి, మనస్ఫూర్తి గా "భేష్! మహేష్" అనిపించింది నాకయితే. ఈ సినిమా నిర్మాతకి నరకమేమో గాని, నమ్రతామహేష్కి మాత్రం ఓ వరం. బాక్సాఫీస్ కి భయపడి త్రివిక్రం ని కొన్నాళ్ళు దూరం చేస్తాడేమో కాని, చాన్నాళ్ళు గుర్తుపెట్టుకునే గిఫ్ట్ తనకిచ్చాడు త్రివిక్రం. ప్రతి సీన్ లోను పంచ్ మార్క్ తో పడగొట్టేసారు ఇద్దరు. బరిస్తా లో బాత్రూం సీన్ అయినా, రాజస్తాన్ లో రఫ్ ఆడించే సీన్ అయినా చెలరేగిపోయాడు , ఆలీ తో కామెడీ అయినా, పాలి లో ట్రాజెడి అయినా పిసికేసాడు. ఒక్కమాట లో చెప్పాలంటే ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో లక్ష్మణుడి లా విలక్షణ పాత్రలో విజౄభించేసాడు పండుగాడు.

ఇహ త్రివిక్రం, "3 ఏళ్ళు తీసికున్నాడు, నిండా ముంచేసాడు", "దేవదాసు అయ్యాడు దొబ్బేట్టాడు" అని ఏవేవో రాశారు కాని, తలబొప్పి కట్టిన ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు తలచుకుంటే, వళ్ళు దగ్గర పెట్టుకునే తీశాడు అనిపించింది నాకయితే. స్ట్రైట్ నెరేషను వీడి, అటు-ఇటు తిరిగిరావడం తో కొంత గందరగోళం కనిపిస్తుంది కాని, లాజిక్ ని కంప్లీట్ గా కిక్ చేసేసి మాజిక్ తో మోసం చేసే ప్రయత్నం మాత్రం చేసినట్టు కనపడ్లా 'జల్సా ' లో లా. ప్రేక్షకుడి వచ్చే ప్రతి అనుమానాన్ని ముందే పసిగట్టి పక్క సీన్ లో నివౄత్తి చేసి, తన దర్శక ధర్మాన్ని బానే నెరపాడు. సినిమా లో ఇంకేదో ప్రేక్షకులకి పట్టలేదు కాబట్టి, "బూతు జోడించాడు, పిల్లల్ని పక్కవాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళండి" అని సలహాలు ఇచ్చారు కాని, ఇంతకన్నా ఘోరమైన బూతు పురాణాల్లాంటి సినిమాలనే పిల్లల చేత పదిశార్లు చూపెట్టి సూపర్ హిట్ లు చేసిన సంస్కృతి ప్రేక్షకులది. ఎటొచ్చీ, మణిశర్మ దగ్గర కొంచెం మొహమాట పడ్డాడు. 'అతడు ' మాజిక్ రిపీట్ చెయ్యలేకపొయాడు ఒకటి, రెండు పాటల్లో తప్ప. బ్రహ్మానందం ని అంత గా వాడుకోలేదు, వున్న 4 సీన్ లు పర్వాలేదు అనేట్టు వున్నాయ్ జోకులు. అలి, సునీల్ ల కాంబినేషన్ లో మహేష్ కి కావల్సినంత కోర్ట్ దొరికింది కామెడీకి, కబడ్డీ ఆడేసారు. షఫీ కి, రావు రమేష్ లు సరిగ్గా ఇమిడిపోయరు.( మగధీర పోలిక లు ఎక్కువ కనిపిస్తాయ్ ఇక్కడ).

పిట్టంత కథ లోకి కూసంత తొంగి చూస్తే, అనుకున్న స్టొరీ/లైను ఎంత చిన్నదో, త్రివిక్రం అలోచన అంత పెద్దదిలా అనిపించింది. "ఒక వ్యక్తి దేవుడిలా వస్తాడు" అని చెప్పడానికి వాడే విశ్లేషణా వాక్యాన్ని పట్టుకుని 3 గంటలు పాటు కూర్చోపెట్టడం అంటే కూసంత కష్టమే. "ఒక వ్యక్తి ఎలా దేవుడు అవగలడు?" అన్న కంఫ్యూషన్ లోకి హీరో ని, మనల్ని నెట్టి, కామెడీ తో కథ నడుపుకురావడం లో చాల వరకు విజయం సాధించాడనే చెప్పవచ్చు. సహజం గా, తెలుగు సినిమాలలో హీరోని ప్రత్యేకించి దేముడు అని పరిచయం చేయరు. ఆ గుణగణాలను వివరించే ప్రయత్నం చేసి విసిగించరు. ఆడపడుచు ఆపద లో వున్నప్పుడు కేవలం కాలి బూట్లు చూపిస్తే చాలు తమ దేముడు వచ్చాడని అర్ధమయిపొయినట్టు అరుస్తారు ఆంధ్రా ప్రేక్షకులు, పేద పిల్లాడు భోరున వర్షం లో బూట్లు తుడిచి, బీదగా "అయ్యా పైశా ఇప్పించడయ్యా అంటే", నయా పైశా కూడా ఇవ్వను అని కేర్ లెస్ గా వెళ్ళిపోతున్న కోటు తొడుక్కున్న కోటీశ్వరావ్ కాలర్ బోన్ పై కేమేరా వెనుకనుండి చేయి వేయిస్తే చాలు, కోటి విజిల్స్ వినిపిస్తాయ్. ఇంత ఫ్లెక్సిబుల్ గా వున్న ప్రేక్షకులని పట్టించుకోకుండా , "దొర అడుగు వేసినప్పుడు బర్రెలు పరిగెడతాయ్, జెర్రులు పాకుతాయ్, వురిమి చూస్తే వూళ్ళు కదులుతాయ్, రోళ్ళు పగులుతాయ్, తేళ్ళు కుడతాయ్" లాంటి బరువైన సంభాషణ లతో హీరోని దేముడు లా చూపిస్తున్నడేంటి అని అనుకుంటాం, "రోడ్ పక్క పిల్లాడి కి పాలు కొనిస్తా పది ఇస్తే" అని అనుకున్నప్పుడు కదిలించే మానవత్వం లో కనిపిస్తుంది ఆ దైవత్వం అంటే ఏమిటో, ఎవరు దేముడో. మంచినీళ్ళ కోసమే రాక్షసుడిగా మారిన వ్యక్తి, బిడ్డని పోగొట్టుకున్న తండ్రి కోసం అక్షరాల లక్ష రూపాయలని వదులుకుని, "తినడానికే లేదంటుంటే, డబ్బులెలా అడుగుతాం భయ్యా" అంటూ వెళ్ళిపోయే హౄదయానికి హత్తుకునే సన్నివేశాలు బలంగా తియ్యడం లోనూ త్రివిక్రం మార్క్ కనిపిస్తుంది.

అంచనాలే అందుకోలేకపొయిందో, అభిమానులనే ఆకట్టుకోలేకపోయిందో యేమో కాని, కాకినాడ కాజా అంత తియ్యగా లేకపొయినా, గుంటూరు గోంగూర అంత ఘాటుగా మాత్రం లేదు ఈ చిత్రం. త్రివిక్రం, అతడు చేసిన ఓ మోస్తరు ప్రయోగాన్ని, సిన్సియర్ ప్రయత్నాన్ని జల్సా చెయ్యొచ్చు ఖలేజా వుంటే.

పార్ధూ