శంకర్ దాదా జిందాబాద్.. - ప్రభుదేవా Back   
విడుదల సంవత్సరం : 2007
భాష : తెలుగు
నటీనటులు : చిరంజీవి, కరిష్మా కోటక్, షియాజీ షిందే
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : ప్రభుదేవా
ఈ కబుర్లు చెపుతున్నది : పార్థు
అదనపు కబుర్లు కబుర్లు రచ్చబండ లో మీ కబుర్లు చెప్పండి

ఈ పేజీ ని పంపండి
భాష తో సంబంధం లేకుండా, హీరో ఇమేజ్ తో పని లేకుండా పట్టం కట్టిన ప్రేక్షకులు, మన సొంత మెగా స్టార్ చేస్తే పెదవి విరుస్తున్నారా? అని మొదటి రోజు వార్తలు చదివినప్పుడు కొంత ఆశ్చర్యం కలిగింది. అందుకే సినిమా ఎలా వుంది అని సగటు ప్రేక్షకుడి గా చూస్తూనే, తప్పు ఎక్కడ జరిగి వుంటుంది అని ఒక అభిమాని గా చూసా. ఆ అనాలిసిస్ సారాంశమే ఈ రివ్యూ.

నీ అనాలిసిస్ నాకేందుకు సినిమా గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నవో ఒక్క ముక్క లో చెప్పు, మాకు అవతల బోలెడు పనులున్నాయ్ అనుకునేవాళ్ళకైతే, "తప్పక చూడండి..మెగా స్టార్ మిమ్మల్ని డిజప్పాయింట్ చెయ్యడు".

లోతు గా విశ్లేషిస్తే..

నటులు లు రెండు రకాలు..

తమ నటనా కౌశల్యం తో ప్రేక్షకుల పై పన్నీరు జల్లే వాళ్ళు కొందరైతే, ప్రేక్షకుల పని పట్టే వాళ్ళు కొందరు. చిరంజీవి నిశ్సందేహం గా మొదటి రకం నటుడు. ప్రేక్షకులు, అభిమానులు అతని సినిమా నుండి ఏదో ఆశిస్తుంటారు.

ఇదంతా ఎందుకు చెపుతున్నానో మీకీపాటికి అర్ధమయ్యే వుండాలి.

ఈ మధ్య చిరంజీవి ప్రతి సినిమా రిలీజ్ ముందు ఆయా దర్శక, నిర్మాతల తో పాటు, చిరంజీవి కూడ "నా నుండి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో అవన్నీ ఇందులో వున్నాయ్ " అని చెప్పడం మాములైపొయింది తీరా అక్కడ చూసేసరికి పంక్తి లో ఏదో మిస్స్ అవుతోంది. అదేంటో కనిపెట్టే ప్రయత్నం ఎక్కడ చేస్తునట్టు కనపడదు వచ్చే ప్రతి కొత్త సినిమా చూస్తున్నప్పుడు.

ఈ సినిమా కూడా ఆ అపవాదు నుండి పూర్తి గా తప్పించుకోలేకపొయింది. అలా అని చాలా వరకు వెబ్ సైట్ లు రాసినంత అయోమయం గా మాత్రం లేదు, ఖచ్చితం గా పైసా వసూల్ చిత్రం, కాలక్షేపం చిత్రం. అది హింది చిత్రం ఏనాడో ప్రూవ్ చేసింది, మక్కీ కి మక్కీ గా తీసిన చిత్రం మరి ఎందుకు మింగుడుపడటం లేదు అంటే మన మెగాస్టార్ వల్ల.

ఆయనే వరం, ఆయన ఇమేజే శాపం సినిమా కి.

కథ/కథనం ఇవ్వ గలిగినంత మేర కమర్షియల్ తళుకులు అద్ది, దీని అన్ని హంగుల తో బానే ముస్తాబు చేసినప్పటికి, చిరంజీవి - ప్రభుదేవ క్యాటరింగ్ సర్వీస్ అనే సరికి ఫుల్ల్ ప్లేట్ అనుకున్న వాళ్ళకి సాంగ్స్ విషయం లో తీపి అంత గా తగల్లా. అలా అని పాటలు బాగ లేవు అనికావు. నిస్సందేహం గా దేవిశ్రీ ఇచ్చిన పాటలు ఈ సినిమా ని నిలబెట్టాయ్, ప్రభుదేవ కూడా తెర పై బానే ఆవిష్కరించాడు, ఎటొచ్చి హోం వర్క్ ఎక్కువ చేసినట్టులేదు మెగా పవర్ ని సరిగ్గా వుపయోగించుకొలేక పోయాడు. అప్పటికీ "జగదేక వీరుని " కి పాట లో అన్నయ్య తమ్ముళ్ళకి తన అలుపెరగని విజయ రహస్యాన్ని రుచి చూపించాడు.

పాపం చిరంజీవి ది నిజం గా చిత్రమైన పరిస్థితి...

వున్న పేరు ప్రతిష్టల కు, కొత్తగా వచ్చిన ఈ అవార్డ్ లతో, వచ్చి పడుతున్న ఏజ్ తో కొద్దో, గొప్పో సందేశాన్ని, సొషల్ రెస్పాన్సిబిలిటీస్ వున్న కారక్టర్ ని ఎంచుకుని చెయ్యాల్సిన పరిస్థితి, అభిమానుల అంచనాలేమో ఇవతల " ఈ కుర్ర హీరో లే నీ ముందు చెలరేగిపొతుంటే చూస్తావేంటి భయ్యా, " రఫ్ ఆడిస్తే బాక్సులు మరి బద్దలైపొవాలి" అన్నంత కోరికలు పెట్టుకు కూర్చున్నారు, ఈ రెండింటిని సమన్వయ పరిచే ప్రక్రియ లో ప్రతిసారి పల్టీ కొట్టడం అవుతోంది.

"జిందాబాద్" విషయం లోను కొంత కినుకు తప్పలేదు.

ఇప్పటికీ అనుకుంటా.."అన్న నడిచొస్తే మాస్, అన్న నిలుంచుంటే మాస్ " లాంటి పాట పడాల్సింది నాగ్ లాంటి హీరో కి కాదని, తెలుగు సినీ వినీలాకాశం లో ఆ అర్హత వున్న స్టార్ ఇప్పుడు ఒక్కడే అని, అది మెగా స్టారే అని. అలాంటి ప్రేక్షకుల్ని ఎక్కువ సంఖ్య లో సంచి లో వేసికున్న మెగా స్టార్ సాత్వికం గా నుంచుని, శాంతిబోధనలు చేస్తూ చివరి దాక చిరునవ్వుతో యుద్ధం చేస్తుంది నీ కారెక్టర్ అంటే వొప్పుకోవడం కొంత సాహసమనే చెప్పొచ్చు.

రాజలింగం ఇంటి ముందు గూర్ఖా చేత కొట్టించుకొన్నా, గూండా గిరి చెయ్యాల్సివచ్చినప్పుడు చేతులు ముడుచు కు కూర్చున్న సన్నివేశాలైన చిరంజీవి లోని రౌద్ర రసాన్ని, మాస్ మంత్రానై తొక్కి పెట్టేసి, మహాత్మా వారసుడి గా నిలబెట్టడం కొంచెం సగటు ప్రేక్షకుడిని ఇబ్బంది లోకి నెట్టేవే. క్లైమాక్స్ లో పవన్ చేత పవర్ చూపించినప్పటికినీ, మెగా స్టార్ బ్రాండ్ ఫైర్ వర్క్స్ మిస్స్ అవ్వటం తో సగటు ప్రేక్షకుడు సందేహం లో పడతాడు. "అరేయ్! మనం చూసిన ఒరిజినల్ అలానే వుందే?" అని సర్ధిచెప్పుకోలేకపొతాడు, మెగా పవర్ అలాంటిది మరి.

చిత్రం పరం గా చెప్పుకోవల్సి వస్తే, హింది వెర్షన్ చూడని వాళ్ళ కి చాలా వరకు నచ్చుతుంది (చిరంజీవి ని అన్ని రకాల పాత్రల లో చూడగలిగే వాళ్ళకి). చిరంజీవి అంటే "ఇదే" అని గిరి గీసుకు కూర్చుని వున్న వాళ్ళకి, అతను చేసిన గాంధి గిరీ, వాళ్ళు కోరుకునే దాదా గిరీ ముందు వెల వెల బోతుంది. ఇహ హింది సినిమా చూసిన తెలుగు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే , నా అంచనాలలో, రెండు రకాలు గా. మొదటిది "అరేయ్! ఇది మన ఒరిజినల్ సినిమా కాకుండా పోయిందే అని", రెండోది, "నయం! చిరంజీవి కాబట్టి బతికిపోయాం అని".

కామెడి టైమింగ్ లో తను మరో సారి సుప్రీం అని నిరూపించాడు సింగిల్ హ్యండ్ తో సినిమా ని నిలబెట్టి. జాను ని కలవడాని కి ఇంటి కి వెళ్ళేటప్పుడు వాకింగ్ స్టైల్ చెపుతుంది తను ఎందుకు మెగా స్టారో. ప్రెస్స్ మీట్ లో గాంధి బదులు పలకనప్పుడు, తను చిన్నప్పుడు నాన్న తో గొడవ పడ్ద వేదన వివరించేప్పుడు అన్ని వర్గాల హీరో ఎందుకయ్యాడో అర్ధమవుతుంది. ఎప్పటి లా తను చెయ్యగలిగింది చేసాడు.

చెయాల్సింది ఏమి టంటే, వళ్ళు తగ్గించడం, మొహం లో ముడతలు కనపడకుండా కేర్ తీసుకొవడం. ఏజ్ వచ్చేసింది అని సర్దిచెప్పుకునే తెర వెనుక పాత్ర కాదు తనది. అలానే ఇంకోటి డాన్స్ ల లో టేక్-ఇట్ ఈజీ కనిపిస్తోంది ఈ మధ్య, ఇది నిజం గా పెద్ద దెబ్బ.

అభినందించాల్సిన మరో వ్యక్తులు ఇద్దరు ఈ చిత్రాని కి. దేవిశ్రీ & శ్రీకాంత్.

దేవిశ్రీ తడబడినట్లైతే మెగా స్టార్ కి మరింత కష్టమయ్యుండేది, తనపై పెట్టిన బాధ్యత ఈ సారి బానే మోసాడు. అలానే శ్రీకాంత్, అన్న పక్కన చక్క గా అమరిపోయాడు. జైల్ లో, వాళ్ళిద్దరూ భవిష్యత్ ని ఊహించుకునే సీన్ లో, చెలరేగిపోయారు. అలానే గాంధి గార్ని పలకరించమన్న ప్రతిసారి తడబడే తన నటన, అన్న కోసం పడే తాపత్రయం అలరిస్తాయ్.

ప్రభుదేవా తన తంతు బానే నిర్వర్తించాడు దర్శకత్వ విభాగం లో, ముంచేశాడు సాంగ్స్ విషయం లో మెగా ఫీల్ తెప్పించడం లో. తన కి వచ్చిన సువర్ణ అవకాశం చేజార్చుకున్నాడు. ఇంకొక్క 2 పాటల్లో చమక్కులు చూపించినట్లైతే సినిమా సంచలానాలు సౄష్టించేది అనడం లో అతిశయోక్తి వుండేది కాదేమో. అలానే రెండో భాగం లో కొన్ని సన్ని వేశాలు, ముఖ్యం గా రోహిత్, తర్వాత వచ్చే సూక్తులు, సలహాల కార్యక్రమం కొంత చిరాకు పుట్టిస్తుంది, కాని గాంధి తత్వాన్ని పెంచే వి అవి, ఆయన ఆశయాలు గుండెల్లో నాటే ప్రక్రియ లో భాగం అని తీసుకోగలిగితేనే ఆ సీన్ లని తట్టుకోగలం.

పరుచూరి సోదరులు కొన్ని చోట్ల పర్లేదు అనిపించారు మొత్తం మీద. శ్రీకాంత్ ని నువ్వెవరు అన్నప్పుడు, నా పేరు పరుచూరి వెంకటేశ్వర రావ్ , ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్ ని అనిపించడం బావుంది. "అన్ని ఏరియా లు నావే, రాజకీయాల్లోకి వస్తాడు" అన్నవి ప్రొవోక్ చెయాడాని కి రాసినవే అని అర్ధమవుతుంది. "చిన్నప్పుడు ఒక్కటే అబద్దం చెప్పా ఆ అర్ధ రూపాయ్ నీదే" అన్న సన్ని వేశం లో వారి సంభాషణలు , మెగా స్టార్ హావభావాలు గిలిగింతలు పెట్టిస్తాయ్. కరిష్మా విషయం లో కూడా అంతే. మరీ చూడలేనంత చండాలం గా, రాసినంత అసహ్యం గా ఏమి లేదు.

మొత్తం మీద, ఇది "చూడవల్సిన చిత్రం.." ఏ రకం గా అయినా. ఒరిజినల్ చూసిన వాళ్ళు మరీ చూసి తీరాల్సిన చిత్రం. ఒకే చిత్రం ఒక స్టార్ చేస్తే ఎలా వుంటుందో, ఒక మెగా స్టార్ చేస్తే ఎలా వుంటుందో తేడా కనిపెట్టడానికైనా. హేట్స్ ఆఫ్, మెగా స్టార్.