శ్రీ రామరాజ్యం - బాపు - రమణ   Home   
విడుదల సంవత్సరం : 2011
భాష : తెలుగు
నటీనటులు : బాలకృష్ణ, నయన తార, అక్కినేని నాగేశ్వరరావు
సంగీతం : ఇళయరాజా
దర్శకత్వం : బాపు - రమణ
ఈ కబుర్లు చెపుతున్నది : పార్థు

ఈ పేజీ ని పంపండి

ఆడియో విడుదలైనప్పటి నుండి ఎదురుచూసిన చిత్రం. సగం ఉత్సాహానికి కారణం, చాల రోజుల తర్వాత రాజా నుండి రాలిపడ్డ రమణీయ బాణీలు, మిగిలిన సగం బాపు-రమణీయాలు.

పైకి చెప్పుకోలేకపోయినా, ఈ రోజుల్లో చాలా సినిమాలకు హీరో లే నిర్మాతలు. ఇక్కడ, చెప్పుకోగలిగినది, ఒప్పుకోదగినది, "ఈ సినిమా కి నిర్మాతే, హీరో". కాసులుంటే ఏ కాంప్లెక్సో, మల్టీప్లెక్సో కట్టుకునే కమర్షియల్ ఎరా లో, మరో వూసే లేకుండా, దోసిలి కొద్దీ డబ్బులు కుమ్మరించి, ఓ చిత్రాకారుని కుంచె కి తలవంచి, అందమైన బాపు బొమ్మ ని గీసిపెట్టమని అడిగిన ఆ మనిషి నిష్కల్మషమైన ఆశ కి కళాభివందనాలు. పక్కవాడి కి అన్నం పెట్టాలంటేనే ప్రాఫిట్ ఏంటా అని పదిసార్లు కాలిక్యులేట్ చేసుకునే ఈ రోజుల్లో, బాక్సాఫీసు ఈక్వేషన్ లని పక్కన బెట్టి, కేవలం వారి క్వాలిఫికేషన్ లకే ఖుదాఫీస్ అంటూ, బాపు, రమణ, రాజా త్రయాని కి రాజ్యం కట్టబెట్టిన ధీరుడు, వీరుడు అయిన ఈ చిత్ర నిర్మాతే ఈ సినిమా కి నిజమైన హీరో. ఏం చెప్పుకోవాలన్నా ఈ సినిమా గురించి ముందు గా దక్కవలసిన గౌరవం ఆయనకే. సాయి గారు, మిమ్మల్ని బాబా గారే ప్రేరేపించారో, రాముల వారే ఆదేశించారో కాని, ఒక సముచితమైన సినిమా తీశారు, "ఇతిహాసాలు అంటే హాస్యానికే అనుకునే ఇంటర్నెట్ యుగం లో", "రామాయణం అంటే వాల్మీకి 50 వేల వాక్యాల కి పైగా రాసిన మహాగ్రంధం కాదు, 140 కారెక్టర్ లలో కుదించేసుకో గలిగే ట్విట్టర్ మెసేజ్ అనుకునే ఖర్మకారులున్న కలియుగం లో", పేరుతో బాటు మీకు నాలుగు డబ్బులు వస్తాయని, రావాలని, అలా జరగాలని చిన్న ఆశ.

రామాయణ, మహాభారతాల మీద వచ్చిన తెలుగు సినిమాలన్నీ చిన్నప్పటి నుండి గీచి గీచి చూచి ఉన్న నాకు, అద్భుతం అనిపించలేదు ఈ సినిమా. తెలుసున్న కథనే ని తిరిగి చెప్పటం అంటే తమాషా కాదు కదా! (కథా) వస్తూ దెబ్బతినకుండా పైన కవరు మార్చాలి, పైపెచ్చు, పైన డిజైన్ డిజిటల్ జెనరేషన్ కి నచ్చాలి, వస్తూ ఒకసారి చూసేసిన ఓల్డ్ జనరేషన్ మెచ్చాలి. రంపం మీద కోతే మరి. రమణ, బాపు గార్ల శ్రమ కనపడుతుంది. మొదటి సగభాగం, సెట్టింగుల పరం గా కట్టిన బెట్టింగుల స్థాయిలోనే ఉన్నా, కొంచెం కట్టింగ్ ఎక్కువై కంటెంట్ తక్కువ అనిపించింది అడపా దడపా మినహాయిస్తే. బహుశా, దశరధ పుత్రులు, అతిరధ నటులు అవకపోవటం చేత అనుకుంటా. 'లవకుశా లోని వ్యర్ధాన్ని అంతా చాల అర్ధవంతం గా కోసి, తీసారు మిత్రద్వయం. మెచ్చుకోక తప్పదు. రమణ గారి రైఫిల్ కి రీఫిల్ అవసరమే లేదు, అలవోకగా మాటల తూటాలు వస్తూనే ఉంటాయి అక్కడక్కడ. కొన్ని గుండెల్లో కి గుచ్చుకుపోతాయి. రామరాజ్యం అంటే వివరణ బావుంది. జనకుడి ముందు రాముడు నుంచోవడం, ఆయన కూర్చోమని చెప్పడం లో మామా-అల్లుళ్ళ చమత్కారం బావుంది. కిరీటం శిరోభారమైంది అని చూపించే సన్నివేశం లవకుశ లోని సింహాసనాన్ని పక్కకి నెట్టింది. బోయింగ్ వాడి డ్రీం లైనర్ ఏమో కాని, బాపు వారి పుష్పక విమానం శోభాయమానం గా ఉండి, తెర పై నిండు గా ఉంది. కాకపోతే రమణ గారి మీదే కించిత్ కోపం వచ్చేసింది పసి వాళ్ళకి తన పద వరసలు అర్ధమయ్యేంత సరళం గా రాసి పరవసింపజేయనందుకు. అవి అమ్మల కి, నాన్న లకే. పిల్లల కి బాపు బొమ్మలే. అడవి కి వచ్చేంత వరకు అయోధ్య రాజప్రసాదాల రోదనల తో బరువెక్కిన పసి వాళ్ళకి, లవకుశల రాక తో రసకందాయం లో పడ్డట్టయింది. చిత్రం సరిగ్గా వూపందుకుంది ఇక్కడే, కుర్చీల లో కిరుకిరు శబ్దాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్న కిడ్స్ ని కిక్కురుమనకుండా చివరకంటూ కూర్చుండబెట్టింది ఈ ద్వితీయ భాగమే. బాపు, రమణ ల ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే తో, ఆసక్తి కరం గా మలచబడింది చివరికంటా. హనుమంతుల వారిని పిల్లవాడ్ని చేసిన ప్రయోగం ఫలించింది. అశ్వమేధ యాగపు ఘట్టాలు చాలా స్పీడ్ గా పరిగెత్తించి కనువిందు చేసారు. యుద్దవాతావరణం కి ముందు, వెనుక కూడా పోయిన ప్రశాంత పోకడలు ప్రేక్షకుల కి కావల్సినంత శాంతి నిచ్చాయి. "లవకుశ" క్లైమాక్స్ దృశ్యాలు నీరశం తెప్పించాయి పద్యాలతో అని చెప్పేంత సాహసం చెయ్య లేనేమో కాని, ఇక్కడ క్లుప్తం గా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. మొత్తం మీద, అమోఘం అనిపించేంత కాకపొయిన, "బాపు-రమణ" అన్న ఆశల మీద నీళ్ళు జల్లే ప్రయత్నం చెయ్యలా ముందు రెండు-మూడు సినిమాల మాదిరిగా. చూడాలి, బాపు గారు మిత్రుడు లేకుండా మునుముందు ఎలా తీస్తారో? ఎలాంటివి తీస్తారో?

ఇహ, సంగీతం. చిత్రం గా, సినిమా నాకు అంత మధురమైన అనుభూతి ని ఇవ్వకపోవడం కి కారణం రీ-రికార్డింగ్. ఆడియో విన్నప్పుడు, అన్ని పాటలు కాకపోయినా, చాల వరకు బాగా వచ్చాయి చాలు అనుకున్నా, సినిమా లో ఇంకా బావుంటాయి అనుకున్నా. పాటల పరం గా అది నిజమైంది (కనీసం నా వరకు), డల్ అవుతున్న టైం లో పాటలు ప్రాణం పోసాయ్. అది చక్క గా కుదిరింది. నేపధ్య సంగీతం కొచ్చేసరి కి, భూదేవి రాక ముందే నాకు పాతాళం కనిపించసాగింది. రాముడి మనో వేదన కన్నా, సీత ప్రసవ వేదన కన్నా, అన్న నేపధ్య సంగీతం నొప్పి ఎక్కువై పోయింది. పాటల్లో సాహిత్యాని కి వన్నెలు దిద్దుతూ రాగం కట్టిన రాజే, మాటల వెనుక లాలిత్యానికి చిరుగులు పెడుతూ చేసిన "రాక్"షసం నా వూహలకే అందనిది. 1,2 చోట్ల మాత్రం రారాజు మీసం దువ్వాడు, సభ దద్దరిల్లింది. మొత్తం మీద, నేను బాగా డీలా పడ్డాను ఈ విభాగం లో.

మిగిలినది చెప్పుకోవాలి అంటే, పిల్లలు బాగా నటించారు. మంచి ఎంపిక. సీత గా నయనతార ని ఆహా, ఓహో అన్నరు కాని, పర్లేదు. ఒకటి, రెండు ఎక్స్ ప్రెషన్స్ తోనే నెట్టుకొచ్చింది. కాని అతికినట్టే అనిపించి పాత్ర కి ఈ రోజుల్లో ఉన్న టాలెంట్ బురద ని చూస్తే. నాగేశ్వరావ్ గారు చక్కగా ఇమిడిపోయారు వాల్మీకి పాత్ర లో (రామదాసు లో లా భయపెడతారేమో అనుకున్న, బాపు గారు కదా, తేడా చూపించారు). బాలకృష్ణ, మేకప్ బాగా ఎక్కువైపోవటం తో, దశరధుడు లాగా అనిపించారు. కాని రాముడి గా, తండ్రి అంత కాకపోయిన, వొప్పించగలిగారు. సహజం గా చూపించే కళ్ళెర్ర జేసే సన్నివేశాలు, దవడలు కదిలించే సన్నివేశాలు లాంటివి లేకపవడం చేత అనుకుంటా, కుదురు గా చేసికెళ్ళి పోయారు. అభినందించాల్సిన అంశం ఏమిటంటే, సీతకే (నయన తార కే) ఎక్కువ నిడివి వచ్చినా, ఎటువంటి భేషిజం లేకుండా వొప్పుకోవడం, స్క్రిప్ట్ పరం గానే సినిమా ని తీయనివ్వడం. అభినందనీయుడు బాలయ్య. మిగిలిన అందరూ కనిపించేది కాసేపే కాబట్టి, వాళ్ళు కష్టపడ్దా, మన పని సుళువైంది. సాంకేతిక వర్గానికే ప్రశంశలు అన్నీ. అద్భుతం అని అనుకోకుండా ఉండలేం కొన్ని దృశ్యాల చిత్రీకరణ, సెట్ వర్క్ విషయం లో. (సీత ని లక్ష్మణుడు అడవి కి తీసుకువెడుతుంటే రాముడు కోట పై నుండి చూసే సన్నివేశం, చివర లో ఏడు ద్వారాలు దాటుకుని విష్ణువు లో ఐక్యం అయ్యే సన్నివేశం, ఓహో!)

ప్రొత్సాహం, ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహం, ఉత్తేజం నింపుతుంది. ఉత్తేజం, తేజోమయం చేస్తుంది. ఈ సినిమా కి, నిర్మాత కి అవన్నీ కలిసొస్తాయని ఆశిస్తున్నాను. చివరగా, అంకిత భావం తో, తనకి ఎంతో ఇష్టమైన రామాయణాన్నే తన చివరి రచన గా రచించి, రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం అని ప్రవచించి, ఆ రాముడు లో ఐక్యమైన రమణ గారి కి అంకితమైన ఈ చిత్రం, ప్రేక్షకుల మది లో ఖర్సు అయిపోకుండా, ఆయన గుర్తు గా, అంధ్రజాతి కి కలకాలం నిలిచిపోతుందని విశ్వశిస్తూ

పార్ధూ