|
|
| ఈ పేజీ ని పంపండి |
ఈ సంవత్సరం చెత్త చిత్రం "ఏకలవ్య", ఓ మాదిరి చిత్రం "ధర్మ్" రెండూ ఆస్కర్ కి భారతదేశం తరఫున పంపబడటానికి పోటీ పడ్డాయి. కానీ ఒక ఓటు తేడా తో ఏకలవ్య ఆ టికెట్టు దక్కించుకుంది. చిర్రెత్తిన భావనా తల్వార్ (ధర్మ్ చిత్రం దర్శకురాలు) కోర్డు తలుపు తట్టారు. రెండు చిత్రాల దర్శకులూ ఆ విధం గా ఒకరి జుట్టు ఒకళ్ళు పట్టుకు కొట్టుకుంటుంటే నాకు, మరికొంత మంది దర్శకులకీ వచ్చిన అనుమానం, భారతదేశం నుండి పోటికి వెళ్ళాలంటే కేవలం హిందీ చిత్రం అయి వుండాలా అని. కారణం, ప్రాంతీయ చిత్రాలలో వేటిని ఈ పోటీకోసం పరిశీలించారో బయటకి రాలేదు. నాకు మన తెలుగు చిత్రం "వనజ" గురించి అందరూ అన్ని విధాలుగా పొగుడుతున్నారు, ఆ చిత్రం విషయం ఆ కమిటీకి చెవిన పడలేదా అని అనుమానం వచ్చింది (సినిమా చూడక ముందు). ఆ అనుమానం "వనజ" చిత్రం దర్శకుడు మొన్న బోస్టన్ లో ఈ చిత్రం విడుదల అయినప్పుడు తీర్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, భారతదేశం లో ఈ చిత్రం ని విడుదల చేయటానికి మన సెన్సారు వారు ఒప్పుకోలేదుట. తొమ్మిది కట్ లు సూచించారుట. కానీ ఆ "వనజ" చిత్రానికి దక్కుతున్న అంతర్జాతీయ ఖ్యాతి చూసి, తొమ్మిది కట్ ల నుండి రెండు కట్ లు దశకి వచ్చారుట మన సెన్సారు వారు. ఆ అడ్డంకి తొలగి సెన్సారు సర్టిఫికెట్ వచ్చినా దానిని భారతదేశం లో విడుదల చేయటానికి తమ డబ్బులు పెట్టే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడా? వున్న హాల్ లు అన్నీ NTR నటించిన "యమ దొంగ" తో నిండిపోతే, హాలు వాళ్ళతో తన్నులాటకి దిగి, చచ్చీచెడీ దక్కించుకున్న మిగిలిన ధియేటర్లలో చిరంజీవి కొడుకు నటించిన "చిరుత" చొరబడింది. మిగిలిన చిత్రాల గురించి నా వ్యాఖ్యలు కాదు ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. నేను చూసిన "వనజ" చిత్రం గురించి.
తాగుబోతు తండ్రి, పేదరికం, వర్ణ వివక్ష, వేధించే అప్పుల వాళ్ళు వంటి సినిమా కష్టాలు అన్నీ వున్న పదిహేనేళ్ళ అమ్మాయి వనజ (మమతా భూక్యా). ఒక సోదెమ్మ వనజ కి ఆమె గొప్ప డాన్సర్ అవుతుందని చెపుతుంది. పూర్వ కాలం లో గొప్ప డాన్సర్ అయిన ఆ ఊరి జమిందారిణి రమాదేవి (ఊర్మిళ దమ్మనగరి) దగ్గర డాన్స్ నేర్చుకోవాలనే కోరిక తో ఆమె ఇంట్లో పనమ్మాయి గా చేరుతుంది వనజ. ఆ ప్రయత్నం లో సఫలం అవుతుండగా రమాదేవి కొడుకు శేఖర్ (కరణ్ సింగ్) అమెరికా నుండి దిగుతారు. ఆ శేఖర్ స్నానం చేస్తుండగా వనజ తొంగి చూడటం, దానిని శేఖర్ చూడటం జరుగుతుంది. పర్యవసానం గా వనజ కలలు అన్నీ చెల్లాచెదురు అయిపోతాయి. అయితే, ఒక ఫైటర్ అయిన వనజ అడుగడుగునా తగుల్కున్న అడ్డంకులని ఏ విధం గా ఎదుర్కొందో, ఆమె ధైర్యం, పట్టుదల కధే "వనజ".
ధియేటర్ లో జనం చిత్రం పూర్తి అవుతూనే చప్పట్లు కొట్టడం అరుదు. అదీ 90% శాతం భాష కానీ చిత్రం లో చూపిస్తున్న కూచిపూడి కానీ, కధానాయకి ఎదుర్కొనే కుల వివక్ష గురించి కానీ తెలియని వారు. కానీ, వనజ గా నటించిన మమతా భూక్యా నటన చూస్తే ఒక సినిమా ని అర్థం చేసుకోవటానికి కావలసింది, చక్కటి స్క్రిప్ట్, దానికి పరిపూర్ణ న్యాయం చేయగల నటీనటులు అనిపిస్తుంది. కూచిపూడి నృత్యం, నటన ఆమెకి నేర్పించే బాధ్యత కూడా దర్శకుడు తీసుకున్నారుట. ఎంతో సహజం గా అనిపిస్తుంది ఆమె నటన. ఆమె చేసిన కూచిపూడి నాట్యాలు ఎంతో అందం గా, ఒక గ్రేస్ తో నిండి వున్నాయి. రమాదేవి గా నటించిన ఊర్మిళ కి కూడా ఇది మొదటి చిత్రం. జమిందారిణి గా ఆమె నటన కూడా ఎంతో నేచురల్ గా వుంది. వనజ స్నేహితురాలు లచ్చి గా నటించిన అమ్మాయి చూడ చక్కగా వుంది. ఆమె కి నటించటానికి పెద్దగా లేదు. శేఖర్ గా నటించిన కరణ్ సింగ్ మాత్రం చెక్క మొఖం.
చిత్రం కధ నచ్చింది (కొన్ని అసంతృప్తులతో), నటీనటుల నటన నచ్చింది. ఇంక నచ్చనిదల్లా దర్శకుడు రజనీష్ దోమలపల్లి దర్శకత్వమే. పూర్తిగా కాదనుకోండి! ఈ చిత్రం లో చూపించిన explicit సన్నివేశాలు కధ కి ఎంతవరకూ అవసరమో నాకు అర్థం కాలేదు. బోల్డ్ కధ తో తీస్తున్నాం కదా అని బోలెడన్ని బోల్డ్ సన్నివేశాలు చొప్పించారు. అవి మరి నిజంగా జరుగుతాయేమో నాకు తెలియదు కానీ, వాటిని చిత్రం లో చొప్పించటం వలన ఈ చిత్రం కుటుంబ సమేతం గా చూడటానికి ఇబ్బంది అనిపిస్తుంది. పెద్దలకి మాత్రమే సన్నివేశాలు బోలెడు చిత్రాలలో చూసాం. కానీ ఇందులో అమ్మాయి పదిహేనేళ్ళ అమ్మాయి, అమె నోట పలికించిన కొన్ని డైలాగులూ, చేయించిన పనులూ, ముఖ్యం గా వనజ, పోస్ట్ మేన్ మధ్య సన్నివేశాలు జుగుప్స ని కలిగిస్తాయి. ఈ సన్నివేశాలు మాత్రమే కాదు, శేఖర్ నుంచి వనజ కోరుకునేది ఏమిటో అర్థం కాదు. పెళ్ళి గురించి అతన్ని ఒక వైపు కవ్విస్తూనే మరొక వైపు అతని ప్రత్యర్థుల సాయం కోసం వెళ్తుంది. అలాగే చిత్రం ముగింపు ఎంతో అసంతృప్తి ని కలిగిస్తుంది. మా ఫ్రెండ్ ఒకాయన సినిమా హల్ నుండి బయటకి వస్తూ చేసిన వ్యాఖ్య "What is the point?" అని. కొంతవరకూ నాకూ అదే సందేహం కలిగింది.
అంతర్జాతీయం గా ఎన్నో ప్రశంసలూ పురస్కారాలూ అందుకుంటున్న చిత్రం కేవలం మమతా భూక్యా నటన, నృత్యం వలన నాకు నచ్చింది. కధ కూడా కొంచెం వెరైటీ కధ. కొన్ని సన్నివేశాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లలతో చూసే చిత్రం ఎంతమాత్రమూ కాదు.
|
|