రాసాను ప్రేమలేఖలెన్నో (ఒంగోలు కధలు-12): పార్థూ Back   Home 
మొదటి భాగం      ఈ పేజీ ని పంపండి

...రెండవ భాగం.

ఇంక "ఉత్తరకాండ" మొదలయ్యింది.

"ఏం రాయాలనుకుంటున్నావ్?" అడిగాడు సారధిగాడు.

"నువ్వు ఏం చెప్పాలనుకున్నావ్ అమ్మాయికి?" అడిగా నేను.

"ఇంతకీ రాసింది ఎవడన్నది అయినా అసలు తెలుస్తుందా ఆ పిల్లకి?" ఆరా తీసాడు సత్తిగాడు.

"వెధవ అనుమానాలు ఆపండి, ఉత్తరం నేరుగా మనమే ఇద్దాం ఏ గొడవలూ లేకుండా" చెప్పాడు హరికిషోర్ గాడు.

ఆ తరువాత, "ఏం రాయాలి, ఎక్కడ రాయాలి, ఎలా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి" లాంటి వాటి మీద చర్చ ఇంకొంత సేపు సాగింది.

"రేయ్! రాయటమంత వీజీ కాదు, దానికి బోలెడంత కసరత్తు చెయ్యాలి" అన్నా కాస్త ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుందని.

"నువ్వు కసరత్తే చేస్తావో, పెసరట్టే చేస్తావో నాకు తెలియదు, పని తొందర గా పూర్తి కావాలి" అన్నాడు సారధిగాడు.

"నీకు కుదరదంటే చెప్పు. మా ఇంటి పక్కన నాటకాలు రాసేవాడు ఒకడున్నాడు, వాడి చేత రాయించేస్తా" సలహా ఇచ్చాడు సత్తిగాడు.

తిక్క రేగిన నేను, "ఒకడు ఒకటి చెపుతాడు, ఇంకోడు ఇంకోటి చెపుతాడు, చివరకి రచయిత్రి కీ, కవయిత్రి కీ తేడా తెలియని సత్తి గాడు కూడా సలహా ఇస్తాడు, మీ లాంటి వాళ్ళ వల్లేరా కవులకి కార్పెట్ లు వేయడం మానేసారు" అన్నా.

"నీకెందుకురా ఆ బాధ నువ్వెలాగూ కవివి కాదుగా.." అన్నాడు ఆవులిస్తూ హరికిషోర్ గాడు.

"నేను కవిని కాదన్నవాడిని.." అనేలోగా, నోరు నొక్కేసాడు, "ఆపండ్రా మీ వెధవ గోల, ముందు పని చూడండి.." అన్నాడు విసుగ్గా సారధి గాడు.

"దేనికైనా టైమ్ అండ్ ప్లేస్ అన్నారు పెద్దలు, ముందు దాని సంగతి చూద్దాం" అన్నా మురుగుకాలువకి అటు పక్కన నుంచుంటూ.

"మా షాప్ పైన రూమ్ ఉందిగా, కొన్ని రోజులు ఫాన్స్ కార్యకలాపాలు పక్కన పెట్టి, దీని సంగతి తేలుద్దాం" అన్నాడు సారధి.

"ఆ రూమ్ లో కూర్చునా? అక్కడ రాస్తే వల్లి కాదు గదా, వాళ్ళింట్లో బల్లి కూడా పడదు బుట్ట లో. గోడల నిండా "సామర్లకోట వంట నూనే వంటి కీ, జుట్టు కీ పట్టించి, దిగులు గా దేభ్య మొహం వేసుకుని చూస్తున్న గీతాంజలి పోస్టర్స్, కత్తి కంట్లో గానీ దిగబడిందా? అనిపించే లెవెల్ లో అంతం పోస్టర్స్, విసిరి పారేసిన సితార స్టిల్స్, తాగి పారేసిన విల్స్ సిగరెట్ పీకలు, వీటి మధ్య కూర్చుని ఎవడైనా ప్రేమలేఖ రాస్తాడ్రా?" ఒక్కసారి ఆలోచించు అన్నా.

"అయితే మరి ఎక్కడకెళదాం అంటావ్.." అరిచాడు అసహనం గా హరికిషోర్ గాడు.

"శరత్ చంద్ర, చలం, ఆత్రేయ, దాసరథి, కృష్ణశాస్త్రి, వేటూరి, సిరివెన్నెల" లాంటి వాళ్ళు హృదయం పెట్టి రాసేటప్పుడు ఆహ్లాద వాతావరణం కోరుకుంటారు తెలుసా? చిన్నగా బయటకి తీసా మొదటి బాణం.

"జాలాది, గద్దర్, వవరరావు, కత్తి పద్మారావు.." వీళ్ళంతా ఎక్కడ రాస్తారో తెలుసుగా, ప్లేస్ కాదురా, మేటర్ ముఖ్యం" అన్నాడు సూటి గా సత్తిగాడు.

"మన పాల కేంద్రం దాటిన తరువాత పచ్చిక బయళ్ళు, పిల్ల కలువా ఉన్నాయికదా, వాటి తో సరిపెట్టుకుంటాలే ఈసారికి" అన్నా.

మొత్తానికి ఫోకస్ అక్కడికి షిఫ్ట్ అయింది. రెండు గంటలు కూర్చున్నా రెండు లైన్స్ కూడా రాలా. "పోనీ, ప్లేస్ మారిస్తేనో.. " అని అనకముందే, నువ్వే కదరా "పిల్ల కలువా, పిల్ల తెమ్మెరా, పంది పిల్లలూ.. అంటూ ఏవేవో అడిగావ్.. మరి కదలదేం కలం" అన్నాడు వెక్కిరింతగా సత్తిగాడు.

"చిటపట చినుకులు పడుతూ ఉంటే.." పాట రాసే మూడు రోజులు ముందు ఆత్రేయగారిది కూడ ఇదే పరిస్థితి తెలుసా" అన్నా.

"ఇలా కాదు కానీ, రేయ్ సారధీ, నీకు ఎలాంటి లెటర్ కావాలో చెప్పరా" అడిగా.

"అంటే Archiees వెళ్ళి కొనుక్కొస్తావా ఇప్పుడు?" మళ్ళీ అరిచాడు హరి గాడు అసహనంగా.

"నువ్వాగు, నేను కనుక్కుంటాను." అంటూ రంగం లో దూకారు బోసు గారు. "మీరు అలా చెపితే ఎలా? అర్థమయ్యేట్టు చెప్పండి" అన్నారు.

"సినిమాలో క్లాసు, మాసు, A సెంటర్, C సెంటర్ అని మనం ఎలా చెపుతామో, ప్రేమ లోనూ పది రకాలున్నాయి. ఏది కావాలో చెప్తే అది రాద్దాం" అన్నా.

"ఏదీ మచ్చుక్కి రెండొదులు.." అన్నాడు సారధి.

"వాడి సొమ్మేం పోయిందీ ఎన్నైనా వదుల్తాడు కవితలు, మనమే ఎలాగోలా వదిలించుకోవాలి" అన్నాడు సత్తి.

"వదుల్తా, పట్టుకోడానికి రెడీ గా ఉండు" అన్నా.

ఆకాశం, నీలి మబ్బులు, నల్ల కురులు, పిండివెన్నెలా, అలా రాసామనుకో అది "పొయెటిక్" ప్రేమ.
వేరు చెయ్యలేరు, అందర్నీ కలుపుకుపోతాం, ప్రేమిస్తే ఇది చేస్తా, పెళ్ళి చేసుకుంటే అది చేస్తా అంటూ ప్రమాణలు చేసే టైపు "పొలిటికల్" ప్రేమ.
రక్తం తో రాసా, అరుణం తో అద్దా, కుంకుమ తో దిద్దా, ఎరుపు లో మెరిసావ్, ఇలా రాస్తే, "విప్లవ" ప్రేమ.
గుండెల్లో పెట్టుకుచూసుకుంటా, కళ్ళలో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని చూస్తున్నా అని కరుణ కురిపిస్తే అది "నవలా" ప్రేమ.
మన ప్రేమే కనుక నిజమైతే, మీ దొడ్లో తలుపులు, పెరట్లో పనివాళ్ళు, నన్నేవీ చెయ్యలేవు, నీకు మొగుడ్ని అవుతా, మీ అమ్మకి అదవుతా, మీ నాన్నకి ఇది అవుతా.. అంటూ రాద్దాంతం చేసేది "సినిమా" ప్రేమ.

"ఇలా చెప్పుకుపోతే ఎన్నో.. నీకెలాంటిది కావాలో చెప్పు" అన్నా

"కవిత్వం రాద్దాం రా, మనం క్లాసు అనుకుంటుంది" ఆశ గా అడిగాడు సారధిగాడు.

"నీ మొఖం! ఆ పిల్ల చిన్నప్పటి నుండీ ఇంగ్లీష్ మీడియం, లెటర్ ఇచ్చి దానితో పాటే ట్రాన్స్ లేటర్ ని కూడా తెచ్చివ్వాలి"

"పోనీ ఇంగ్లీష్ లో రాద్దామా, అదిరిపోద్ది?" అన్నాడు సారధిగాడు.

"రాసేసరికి మనకి అదిరిపోతుంది ముందు" అన్నారు బోసుగారు బొండా నములుతూ.

"అదిరిపోవటం సంగతి అటుంచు, ముందు బెదిరిపోతుంది, గ్రామర్ మిస్టేక్ లకి, మనకి ఇప్పుడిప్పుడే కదరా has కీ, had కీ తేడా తెలుస్తోంది" అన్నాడు సత్తిగాడు.

"కవిత్వమంటే పిల్ల కంగారు పడుతుందేమో గానీ, కిచిడీ చెయ్యి" అన్నాడు హరి గాడు.

"అది బెస్ట్" అన్నారంతా..

* * *

లెటర్ పూర్తి అయింది. మొదటి కాపీ వచ్చింది.

"100 కి 63 వచ్చాయ్. ఇది నాకే అర్థం కావడం లేదు, తెలుగు సరిగ్గా చదవడమే రాదు దానికేం అర్థమవుతుందిరా" అని చర్రున లేచాడు సారధి.

"మరి 47 వచ్చాయి. నువ్వు లైబ్రరీ లో హిందూ పేపర్ చదవడం లా .. అలానే" చురకేసాడు సత్తిగాడు.

"ముందే, మూడో పేజీ చదివేస్తే అలాగే ఉంటుంది. ఇంద మిగతా రెండు పేజీలు" అంటూ మిగిలిన రెండు పేజీ లు ఇచ్చాను.

దాన్ని గడ్డి లో వెల్లకిలా పడుకుని రెండు సార్లూ, కాలువ లో కాళ్ళు పెట్టి ఊపుతూ రెండు సార్లూ చదువుకుని ఆనందపడ్డాడు. పోలిటెక్నిక్ ఎంట్రన్స్ లో సీట్ వచ్చినప్పుడు కూడా అంత ఆనందపడలేదుట.

"ఇదే ఖాయం చేద్దాం" అన్నాడు, అంతే కాదు "నీకు ఎన్నాళ్ళనుండో హీరో హోండా నేర్పిస్తా అని చెపుతున్నా కదా, ఈ సారి గేరంటీ రా" అన్నాడు అత్యుత్సాహం తో.

కమిటీ చేసిన కొద్దిపాటి మార్పులతో ఫైనల్ కాపీ రెడీ అయింది.

దాన్ని ఎలా అమ్మాయికి చేరెయ్యాలి అనే దాని మీద ఇంకో అంకం మొదలయ్యింది.

"బోసు గారు ముహూర్తం పెడతారు" అన్నాడు సత్తిగాడు.

"వద్దు, ఆయన పెట్టిన ముహూర్తానికి వెళ్తేనే సిద్ధార్థ, చైతన్య రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి" అన్నాడు సారధి గాడు.

దాంతో ఆయనకి తిక్కరేగింది, "సత్తా ఉంటే సినిమా ఆడుతుంది, నీ ఫేస్ నచ్చితే నీ ప్రేమ ఫలిస్తుంది, మధ్య లో నా ముహూర్తం ఏం చేస్తుంది"

పరిస్థితి చేయి దాటుతోందని హరి గాడు "సరే, ఎలాగూ జనవరి 1st వస్తోంది కదా ఆ రోజు ఇద్దాం" అన్నాడు.

"నీ బొంద, ఆ రోజు అరవై మంది ఇస్తారు గ్రీటింగ్ కార్డ్ లు ఆ పిల్ల కి. ఇది ఎటో కొట్టుకుపోతుంది" అరిచా నేను నా కంటెంట్ కి ఎక్కడ అవమానం జరుగుతుందో అని.

"సరే, ఆదివారం సాయిబాబా గుడికి ఒక్కతే వస్తుందిగా, అక్కడ ఇద్దాం, ఎలాగూ మొన్న పెళ్ళి లోనే సగం విషయం అర్థమయ్యింది కాబట్టి, తీసుకుంటుందా 90% అయినట్టే పని, మనం రాసినట్టు, చెప్పిన డేట్ కి నీ కబూతర్ డ్రెస్ వేసుకుని వచ్చి కనపడిందా, పని పూర్తి అయినట్టే" అన్నాడు హరి గాడు.

"ఆదివారం రాకపోతేనో.." సణిగాడు సత్తి గాడు.

"సోమవారం నీకు మూడుతుంది. ఎందుకురా ప్రతి పనికీ ముందు అపశకునం పలుకుతావ్" అన్నాడు హరిగాడు (అలాంటి డవుట్ వ్యక్తం చెయ్యడాన్నే ముద్దుగా IT వాళ్ళు "టెస్ట్ కేస్" అని పిలుచుకుంటారని తరువాత తెలిసింది)

"తను చెప్పింది నిజమే కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు" అన్నారు బోసు.

"కీడు ఎంచమన్నారు, ప్రతిదానికీ అడ్డం పడితే కీళ్ళు వంచమని కూడా చెప్పారు. సరే, అయితే ఒక పని చేద్దాం. కాలేజ్ లో ఇవ్వడం, కొరియర్ చెయ్యడం రెండూ రిస్కే కాబట్టి, మళ్ళీ వచ్చే ఆదివారం వరకూ వెయిట్ చేద్దాం" అన్నాడు సారధి గాడు.

"పోనీ సోమవారం ఏమన్నా శివాలయం ప్రోగ్రామ్ ఉందేమో కనుక్కుందామా?" అడిగాడు సత్తిగాడు హెల్ప్ చేద్దమని.

"ఎన్ని ఆదివారాలు వెయిట్ చేసైనా సరే, సాయిబాబా గుళ్ళోనే ఇస్తా" అన్నాడు ధీమా గా సారధి.

"ఇచ్చేటప్పుడు, నేనెందుకు తీసుకోవాలీ? అని ఆ పిల్ల అంటే?" అన్నాడు సత్తిగాడు మళ్ళీ ఇంకో టెస్ట్ కేస్ రాస్తూ.

"పక్క నుంచి గోనె సంచీ వేసుకుని పాత పేపర్లు కొంటాం, పనికి మాలిన ఉత్తరాలు కొంటాం అంటూ నువ్వొద్దువు లేరా" అన్నాడు కసి గా సారధి.

"మీరూ, మీరూ ఎన్నైనా తిట్టుకోండి, నన్నూ నా లెటర్ నీ ఏమైనా అంటే ఊరుకోను" లేచాను నేను.

"నీ బొంద. మధ్య లో నీ లెటర్ ఎందుకవుతుందీ.. లెటర్ నాదే, లవర్ నాదే" అంటూ సారధి.

"రేయ్! వాడన్నది కరెక్టే, తీసుకోను అంటే మాత్రం, సూటి గా అడిగేయ్, ఇంకెన్నాళ్ళు నానుస్తావ్ విషయం తేల్చేయ్" అన్నాడు హరి గాడు.

"ఎందుకైనా మంచిది భక్తుల బలం (సంఖ్య) చూసి చెయ్యండి పని, లేకపోతే మేము బలహీనులం నిన్ను మోసుకురాలేం బయటకి" అన్నారు బోసు.

"ఎంతమంది భయపెట్టినా ఈ యజ్ఞం ఆగదు, పోరు కి సిద్ధం కండి" అంటూ పిలుపునిచ్చారు హరిగాడు, సారధి.

* * *

ఆ రోజు రానే వచ్చింది...

మనోడు ఉదయాన్నే నిద్ర లేచేలేవగానే స్నానికి అని బాత్ రూమ్ కి వెళ్ళడం వాళ్ళింట్లో వాళ్లందర్నీ తీవ్రమైన దిగ్బ్రాంతి కి లోను చేసింది.

"నాకు పనుంది. నేను తెనాలి వెడుతున్నా ఉండటం లా ఆ రోజు" అని సత్తిగాడు ముందే తప్పించుకున్నాడు.

"మేము కామెడీ ఆర్టిస్ట్ లమే కానీ, కరాటే లో మాస్టర్స్ మి కాదు. ఇలాంటి సన్నివేశాలు మాకు సూట్ కావు" అని నేను, బోసు తప్పించుకున్నం.

"కజిన్ అయిన పాపానికి ఈ ఖర్మ నా కాలికి చుట్టుకుందా" అనుకుంటూ హరిగాడు జత కలిసాడు.

"ఆదివారం సుముహూర్తం శుభమే చేసింది. ఎటువంటి పోరాట దృశ్యాలూ, ఆడపడుచుల ఆర్థనాదాలూ లేకుండనే పని అయ్యింది.

ఆ అమ్మాయి ఉత్తరం తీసుకుంది, వీళ్ళు దక్షిణ ద్వారం తీసుకున్నారు.. గడువు ఏడు రోజులు...

* * *

ఏడవ రోజు.. కొండ మీద బండ రాయి దగ్గర వైట్ సళ్వార్ లో దర్శనమివ్వాలి, yes అనుకుంటే స్వీట్ తినిపించాలి, కాదు అనుకుంటే కారం తినిపించాలి, ఇదీ కండీషన్.

"అంటే ఏదో ఒకటి తింటే కానీ బయటపడనంటావ్" అన్నాడు సత్తి.

"దెబ్బలు తినకుండా పంపిస్తే, భోజనం పెట్టి, బట్టలు ఇచ్చినంత ఆనందం" అన్నారు బోసు.

"yes చెప్పిన ఆ సమయం లో, తన చేత్తో స్వీట్ తింటే, ఆ ఆనందం 100 శివ లకి సమానం రా, నీకేం తెలుసు" అన్నాడు సారధి.

"నాకు ఈ కొండ backdrop ఎందుకో నచ్చలా" అన్నాడు కుండ బద్దలు కొట్టినట్టు సత్తి.

"backdrop బానే ఉంది, సగం drawback నువ్వు మాకు" అన్నాడు సారధి, నెత్తి మీద ఒక్కటేసి.

"అయినా ఏడు రోజులు ఎందుకురా వీడి గురించి ఆలోచించుకోవడానికి, అరక్షణం చాలు" అన్నాడు సత్తి బొప్పి తడుముకుంటూ.

"నీకూ, నాకూ అంటే తెలుసోయ్ ఈయన సన్నాసి అని, ఆ పిల్ల కనిపెట్టొద్దూ అంత తొందరగా" అన్నారు బోసు.

"ఆలోచించుకోవడానికి అరక్షణం చాలురా, కానీ మళ్ళీ అదే సళ్వార్ కమీజు ఉతుక్కుని, వేసుకురావడానికి ఆ ఆరు రోజులు పడుతుంది, అందుకని" అన్నాడు హరిగాడు.

* * *

గడువు ముగిసింది...

అందరికీ టెన్షన్, వస్తుందా రాదా అని. అప్పుడెప్పుడో "అంతం" రిలీజ్ అప్పుడు పడ్డాను. మళ్ళీ ఇప్పుడే అన్నాడు వాడు.

చెప్పిన టైము కి ఓ పావుగంట గడిచింది.

"ప్రేమపావురాలు" ఎక్కువ సార్లు చూసినట్టు ఉంది.. తను వచ్చింది, మావాడికి నచ్చిన తెల్ల సళ్వార్ లో.

* * *

ఆ తరువాత...

మూడు ఏళ్ళు పట్టింది. ఆ ఆమ్మాయికి అర్థమవ్వడానికి, "నిన్ను ప్రేమిస్తాను" అనే వాక్యానికీ, "నిన్ను పోషిస్తాను" అనే వాక్యానికీ చాలా తేడా ఉందని! రెండో దాన్లోనే తన సుఖం వెతుక్కుంది. మొదటి రోజు స్వీట్ తిన్న వాడి ఆనందం, చివర రోజుల్లోని చేదుకి ఆవిరైపోయింది. వీడు ఇష్టపడి లెటర్ ఇస్తే, ఫైనల్ గా ఆ పిల్ల హాండ్ ఇచ్చి కష్టపెట్టింది.

ఆ షాక్ నుండి కోలుకోడానికి వాడికి పట్టింది మూడు అంటే ముచ్చటగా మూడే సినిమాలు నాగ్ భయ్యా వి.

"రక్షకుడు", "రాముడొచ్చాడు", "వజ్రం". ఈ షాక్ ముందు ఆ షాక్ ఎంత!

మళ్ళీ మనోళ్ళు కార్యాలయం తెరిచి ఎప్పటిలానే, "వల్లి కన్నా వర్మ సినిమాలే బెటర్" అని, "ఇది డెఫినెట్ గా మరో శివ అమ్మా" అంటూ రొటీన్ లో పడిపోయారు.

* * *

కొన్నాళ్ళ తరువాత...

వాడికి పెళ్ళి అయి ఎనిమిది ఏళ్ళు.

లక్ష్మి ఇప్పుడు రెండోసారి pregnant. పాప కి ఆరు ఏళ్ళు. కాపురం కుదురుకున్న కొత్తల్లో ఒక రోజు కిటికీ లోంచి నక్షత్రాలు చూస్తూ చేతులు వెనక్కి మడిచి, "నీ దగ్గరో విషయం దాచా" అన్నాడట.

"వల్లి గురించేనా?" అంది లక్ష్మి.

"నీకెలా తెలిసింది?" అన్నాడు వీడు question mark ఫేస్ వేసుకుని.

"రాసిన లవ్ లెటర్ లు ఎవడూ xerox copy లు తీయించుకుని, ఫ్రేమ్ కట్టించి, ఇంట్లో ఓపెన్ గా పెట్టుకోరు, మొన్న అ మధ్య బోసు వచ్చి మిమ్మల్ని అప్పుడు "ఆఖరి పోరాటం" మీద, "అల్లరి అల్లుడు" మీదా కొన్ని ఆర్టికల్స్ ఇచ్చాను ఏవీ అంటే, నన్ను సూట్ కేస్ తెమ్మన్నారు, అప్పుడు దొరికాయి".

"నిజమే, అప్పటి నుండీ ఆ ఆర్టికల్స్, ఈ ఉత్తరాలూ రెండూ కూడా కనపడటమే లేదు, ఏమయ్యాయి?" వీడు.

"మొన్న బాయిలర్ లో అంత పెద్ద మంట ఎందుకొచ్చింది అనుకున్నారు?" ఆవిడ.

"అదే నా మొదటి ప్రేమలేఖ.." నేను!

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.