"ఏ కులమూ నీదంటే..?" (ఒంగోలు కధలు - 7): పార్థూ Back   Home 
   ఈ పేజీ ని పంపండి

ఈ కధ రాద్దమా? వద్దా? అని ఓ నాలుగైదు వెండింగ్ మిషన్ కాఫీ కప్పులు నలిపేసి, ఆపై అలికేసిన కధ ఇది. అలాంటి సమస్య కలగడానికి ఒకే కారణం, "కధా వస్తువు" సున్నితమైనది కావడం చేత. ఇంతకు ముందు కధలకి మేము చేసిన అల్లరి, తిన్న మొట్టికాయలు backdrop అయితే, ఈ కధ కి "కులం" డ్రాబాక్ అవటం వల్ల. కానీ, ఈ కధ కట్టబడింది "కులం" అనే పాయింట్ మీదే. (కట్టాం అన్నా కదా అని కట్టు కధ అనుకోకండేం?)

ఈ సంఘటనని "కధ" రూపం లో తీసుకుని రావడం వెనుక మా మధ్య జరిగిన ఓ అవాంఛనీయ సంఘటన నెమరువేసుకోవాలనే తాపత్రయమే తప్ప ఏ కులాన్నీ కించపరచడం కోసమో, మరే కులాన్నీ నెత్తిన పెట్టుకోవడం కోసమో రాసినది కాదు. ఇదేదో నేను ముందస్తు జాగ్రర్తలు తీసుకోవడానికి "వర్మ హారర్ సినిమా లో వార్నింగ్ కార్డ్ లా" చెపుతున్నది అంత కన్నా కాదు.

ఇంతకు ముందు చెప్పినట్టు శివగాడు, శేఖర్, దివాకర్ "official" roommates. జనాభా లెక్కల్లో లేని వాళ్ళు, వోటర్స్ లిస్ట్ లో ప్రత్యక్షమైనట్టు, "unofficial" గా నేను, నా roommates ("దూద్ పేడా" శీనుగాడు, రవీంద్ర), అప్పుడప్పుడు కొంప లో బోర్ కొడితే బాబాయ్ గాడు, శ్రీరామ్ గాడు, శేఖర్ కి క్లోజ్ అయిన శశికాంత్ గాడు, సారధి ఉండేవాళ్ళం. ఇది ఆ రూమ్ actual capacity.

దివాకర్ వాళ్ళ అమ్మగారు, శివ వాళ్ళ అమ్మగారూ అక్కాచెల్లెళ్ళు. వీళ్ళ వంశ చరిత్ర గురించి కొంత చెప్పలి. వీళ్ళ తాతగారు వేద పండితులు. పూజలూ, జపాలూ, అభిషేకాలూ, హోమాలూ ఒకటేమిటి, ఎంతో గొప్ప దైవ భక్తులు. ప్రకాశం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అప్పట్లో MLAs/IAS/IPS కేడర్ లు మొదలుకొని ఎన్నో శాఖల వరకూ గొప్ప పలుకుబడి కలిగిన వారు. అయన చేసే అష్టావధానం, హోమలూ, పూజలూ ఆయనకి ఆ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా గురువు గారు అంటూ అయన్ని గౌరవించడం, వాళ్ళ ఇళ్ళల్లో సత్సంగాలు, భజనలు, జపాలు, తపాలు.. చేయించడం ఇలా ఎన్నో. వృత్తి రీత్యా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేసారు. బాగా నియమం, నిష్టలు కలవారు. కొద్దిగా పట్టింపులు ఎక్కువగా ఉండేవి. అయనకి 75 ఏళ్ళు ఉండేవి. యాత్రలు చేస్తూ వారి అబ్బాయి MRO గా "వినుకొండ" దగ్గర గా ఉన్న ఒక మండలం లో ఉండటం చేత ఒంగోలు లో దిగి, ఆ రాత్రి మనవళ్ళిద్దరినీ చూసి, తెల్లారి ఫస్ట్ బస్ కి వెళ్ళిపోయేవారు. వీళ్ళ రూమ్ లో అయిదారు చాపలుంటే, ఒక పరుపు, వైరు మంచం ఉండేవి తాత గారి కోసం. మడి ఆచారాలు, పూజలూ యధావిధి గా జరగాలి కాబట్టి వీళ్ళు వేరే రూమ్ మేట్స్ తో ఉండటం అయనకి సుతారామూ నచ్చేది కాదు. సంవత్సరానికి వచ్చే ఒకటి రెండు సార్లకి అదెలా కుదురుతుంది అని ఈ మనవలిద్దరూ. మా బావగాడికీ, దివాకర్ కీ ఉన్న రూమ్‌మేట్స్ అంతా వారి కులానికి చెందిన వారే అయి ఉంటారని ఆయన నమ్మకం. అవన్నీ పట్టే "మూక" కాదు మనవలిద్దరూ. ఇక మా అరుపులూ, గోలలూ, వాదనల్తో అ రూమ్ కోలాహలం గా ఉండేది "చిరంజీవి" సినిమా బెనెఫిట్ షో లా. మా రూమ్ కొద్దిగా ఇంటిరియర్ అవటం చేత, వీళ్ళది మెయిన్ రోడ్ మీద ఉండటం + మా దాని కన్నా పెద్ద గదులు అవటం వల్ల, మేము ఎక్కువగా ఇక్కడే తిష్ట వేసేవాళ్ళం. సినిమాలూ, తెలిసీ తెలియని రాజకీయలు (మా అప్పుడు హాట్ టాపిక్స్ "మండల్ కమీషన్", "రామ మందిర్" క్రికెట్..) ఇదే గోల.

ఒకసారి, రవీంద్ర ఒక్కడే రూమ్ లో ఉన్నాడు. మేమంతా ఫిజిక్స్ ట్యూషన్ కి వెళ్ళం. రవీంద్ర చాలా ఫాషన్ గా రఫ్ గా ఉంటాడు. పైగా నాగార్జున అభిమాని. ఫుంక్ తీసి, చెర్మాస్ బ్లాక్ జీన్స్ షర్ట్ వేసి, చేతులు పైకి మడిచి, పై రెండు గుండీలు గాలికొదిలి, బేగీ పాంటు తొడిగి, చేతికి కడియం తో .."శివ" లో శివ లా ఉంటాడు. అప్పుడే, అనుకోకుండా ఈయన ఊరి నుండి వచ్చారు. మా బావ గాడి టైము బాగోకపోవడం చే, రవీంద్ర "నెట్ బనియన్" ఒకటి వేసుకొని, గళ్ళ లుంగీ కట్టుకుని, గుమ్మనికి అడ్డం గా పడుకుని "జ్యోతి చిత్ర" చదువుతూ రూమ్ లోనే ఉండిపోయాడు. ట్యూషన్ కి రాకుండా. వాడు ఇచ్చిన గ్లాస్ మంచి నీరు తాగి, వాల్చిన మంచం మీద కూర్చుని "శివ ఏడీ?" అంటే, "ట్యూషన్ కి వెళ్ళాడు" అన్నాడు వీడు.

"మరి నువ్వేంటీ..?" అన్నారు అయన జ్యోతిచిత్ర వంక తీక్షణం గా చూస్తూ.

"నేను పనుండి వెళ్ళలా" అన్నాడు రవీంద్ర పుస్తకం మడుస్తూ.

ఇక ఆయన వీడి గురించి ఆరా తియ్యడం మొదలెట్టారు ఊసుపోక.

"ఏం నాయనా! మీరు వైదీకులా, నియోగులా?", తన peculiar మనవడి సెక్యులర్ భావలు తెలియక వేసిన మొదటి ప్రశ్న. (ఆయన మనవళ్ళ మీద ఉంచిన విపరీత విశ్వాసాలకి మేము తరువాత మూకుమ్మడి గా మా ప్రగాఢ సానుభూతి తెలియచేసాం లెండి అది వేరే విషయం).

"అమ్మాయిలూ, సినిమాలు" అనే రెండు కేటగరీ లే తప్ప ఇంకేమీ అంతగా తెలియని వాడి ఫాషన్ బుర్ర కి ఆ రెండూ హిరోషిమా, నాగాసాకి అన్నంత ఘాటు గా వినిపించాయి.

"అంటే?" అన్నాడు వాడు ఫంక్ ముందుకు లాక్కుంటూ.

"కీరవాణి రాగం తెలుసా?" అని కీరవాణి ని అడిగితే, MM Kreem కి ఎంత మండుతుందో, ఆయనకి రెట్టింపు కోపం వచ్చింది మనవళ్ళ కి లేని పట్టింపుల మీద.

"మీరు బ్రాహ్మలు కారా?" అన్నారాయన కూసింత ఖంగారుగా.

టీచర్ కి మస్కా కొట్టాం గదా అనుకుంటే, హెడ్ మాస్టర్ ఎదురైనట్టు అయింది వాడి పరిస్థితి.

మేము "ఫలానా.." అన్నాడు గొంతు పెగిలించి.

కట్ చేస్తే,

ఫిజిక్స్ ట్యూషన్ అయి బయటకి వచ్చిన మాకు వీధి మొదట్లో, "తలకి నూనె రాసుకుని, ఫుల్ హాండ్స్ చొక్కా ని చేతులపైకి పూర్తిగా వేసుకుని, బట్టలకి ఉన్న బొత్తాలు మొత్తం తగిలించుకుని" విషాదం గా నుంచుని కనిపించాడు రవీంద్ర.

వెళ్ళే ముందు "మన్మధుడు లో నాగార్జున లా ఉన్న వీడు, వచ్చేసరికి సూపర్ లో నాగార్జున లా తయారయ్యాడేమిటి చెప్మా అని మేము అనుకునేలోగా వాడే, "రేయ్ శివా! మీ తాతగారొచ్చారు. మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నారు" అని జరిగింది చెప్పడం తో, వెంటనే శివ గాడు దివాకర్ ని వెతుక్కునే పని లో పడ్డాడు డిఫెండింగ్ కోసం.

మరొక సారి చివరగా జరిగినది అది.

నిష్టాగరిష్టుడు, అష్టావధానీ ఆయన ఆ పెద్దాయన, తన 75 ఏళ్ళ జీవిత కాలం లో పూర్వీకులు, పద్ధతులు, మడి, ఆచారాలు, పూజలూ, పునస్కారాలూ, నమ్మకాలు నేర్చిన ఆలోచన విధానానికీ, "సింగిల్ టీ కొట్టిస్తే, డబుల్స్ తొక్కేవాడు", "డబ్బులొస్తే, అప్పులు ఇచ్చేవాడు", క్లాస్ లో లేకపోయినా మనకి attendance పలికేవాడు", "కాలేజ్ కి రాకపోయినా, మెస్ నుండి కారేజ్ తెచ్చేవాడు", "రికార్డ్ కి అట్టలేసి పెట్టేవాడు, చాకలి కి బట్టలేసి పెట్టేవాడు", ఇలా ఎన్నెన్నో మనతో పంచుకునేవాడు నిజమైన ఫ్రెండ్ / రూమ్‌మేట్ అంటే, "కులం" ఎలాంటిదైనా "కలుపుకోగలం" అని అనుకునే ఈ కాలం మనవడి కీ మధ్య "జనరేషన్ గాప్" చేసిన చిరు గందరగోళం అది.

"సారీ రా, మా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కొద్దిగా.. " అంటూ నసుగుతూ భుజం మీద చేయి వేసి బాధ తో నొక్కిన శివగాడి వెన్ను "నాకు తెలుసురా.." అంతూ నిమిరింది, అంతే, మృదువుగా రవీంద్ర చేయి.

ఆ తరువాత, రవీంద్ర - శివ మధ్య కానీ, మా అందరి మధ్య కానీ మాటల్ లేవ్!!

ఎందుకంటే, అప్పటికే, మేమంతా "తులసీరామ్" ధియేటర్ లో, "కెప్టెన్ ప్రభాకర్" సినిమాలో, రమ్యకృష్ణ పాట కి విజిల్స్ కొడుతూ చూస్తున్నాం. ఆవిడని చూసో, ఆవిడ డాన్స్ ని చూసో కాదండోయ్.. గురువుగారి (ఇళయరాజా) పాట కి గురుదక్షిణ గా.

పార్థూ

* * End * *

మీ సూచనలూ, సలహాలూ రచయిత పార్థూ కి తెలియచేయండి.
మీ అభిప్రాయాలు రచ్చబండ లో తెలియచేయండి.