శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఉపోద్ఘాతము

ప్రస్తుత గురుచరిత్ర

మహారాష్ట్ర దేశములోని వారందరికీ ప్రసిద్ధి కెక్కిన గురుచరిత్ర తెలిసియే యున్నది. దేశమంతటను దత్తాత్రేయ భక్తులు, దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణ చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతిస్వామి యొక్కయూ లీలలును, విచిత్ర చర్యలును వర్ణింపబడి యున్నవి. వీరిద్దరు దత్తాత్రేయదేవుని ముఖ్యావతారములు. మరాఠి గ్రంధములు వ్రాయుటలో నేర్పరియగు పాంగారకర్ అభిప్రాయము ప్రకారమీ రెండవతారములు 14, 15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరియవతారములు కూడ గలవు. అందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో మాణిక్యప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్ కోటకర్ మహారాజుగారును, తుట్టతుదకు అహమదునగరు జిల్లాలోని శిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918 వ సంవత్సరములో సమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోటకర్ మహారాజు అవతారముయొక్క పరంపరయే శ్రీ సాయి బాబాయని కొందరు భక్తుల నమ్మకము. అయిదవ యధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించిన కధయు, నిరువదియారవ యధ్యాయములో హరిశ్చంద్రపితళే కధయి, ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి.

పైన వివరించిన రెండు అవతారముల విచిత్రలీలలను గురుచరిత్రమను గ్రంధమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరు డెట్లు వర్ణించెనో, యట్లనే శ్రీ సాయిలీలలను శ్రీ గోవిందరరఘునాఢ్ ఉరఫ్ అన్నాసాహెబు దాభోళ్కరు (హేమాడ్ పంతు) అనువారు శ్రీ సాయిసచ్చరిత్రమను గ్రంధమును 53 అధ్యాయములలో వ్రాసియున్నారు. కనుక నీ సాయి సచ్చరితము ప్రస్తుత గురుచరిత్రయని చెప్పవచ్చును.

ఈ దిగువ వివరించిన వానిని, పై చరిత్రల గూర్చి జ్ఞప్తియందుంచు కొనవలెను.

1. గురుచరిత్రను వ్రాసినవారు కన్నడమువారు. కాబట్టి వారికి మరాఠి భాష తెలియకుండెను. అయినప్పటికి వారి ఇష్టదైవము ఆశీర్వాదమువల్ల మరాఠీభాషలో ప్రసిద్ధి కెక్కిన గొప్ప గ్రంధమును వ్రాయగలిగిరి. శ్రీసాయి సచ్చరిత్రము గ్రంధకర్త సుప్రసిద్ద మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశములోని యనేకయోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాధ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంధము. జాగ్రర్తగా చదవునట్టివారా గ్రంధములోని విషయములు శ్రీ సాయిసచ్చరిత్రములో చూడగలరు.

2. గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై నాధారపడి యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము. దాని నాచరణలో బెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు గూడ దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయిసచ్చరిత్ర విషయ మట్టిది కాదు. యిందులోని విషయములు తేటతెల్లములు. మిక్కిలి సామాన్య మైనవి. యిందులో చెప్పినవానిని అందరు సులభముగా గహించి యాచరణలో పెట్టగలరు.

3. గురుచరిత్రలో వర్ణించిన విషయములు జరిగిపోయిన నూరేండ్లకు అది వ్రాయబడెను. కానీ శ్రీ సాయిసచ్చరిత్రలోని కొన్ని లీలలు రచయిత స్వయముగా చూచెను. రచయిత బాబా లీలలను టూకీగా వ్రాసికొని శ్రీ సాయిబాబా యొక్క యనుమతి పొంది, వారి యాశీర్వాదముతో ఈ గ్రంధము ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు టుకీగా వ్రాసి యంచుకొనెను. 1918వ సవత్సరములో సాయిబాబా సమాధి చెందిన వెంటనే, శ్రీ సాయిలీల మాసపత్రికలో వారి చరిత్ర కొంచెము కొంచెముగా ప్రకటించెను. దీనిని 1923 వ సంవత్సరములో ప్రారంభించి 1930లో పూర్తి చేసెను. కనుక శ్రీ సాయిసచ్చరిత్రమను ప్రస్తుత గ్రంధము నమ్మదగినది. శిరిడీలో సాయిబాబాను చూడని వారీగ్రంధమును చదివినచో వారు శ్రీసాయిని చూచినట్లు భావించుకొని, దీనిని వరప్రసాదముగా భావించెదరు.

రచయిత, హేమాడ్ పంతు

శ్రీ సాయిసచ్చరిత్రము అన్నాసాహెబు దాభోళ్కరు కూర్చెను. కాని, ప్రతి అధ్యాయము చివరను శ్రీసాయి ప్రేరేపణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది. దావున ఈ హేమాడ్ పంతు ఎవరని చదువరులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోళ్కరు మొట్టమొదటి సారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు, వారీ బిరుదును దాభోళ్కరుకు కరుణించిరి. ఎప్పుడు, ఏ సందర్భములో నీ బిరుదును అతనికి కరుణించిరో యనువిషయము రెండవ అధ్యాయములో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవితచరిత్ర యీ దిగువ క్లుప్తముగా చెప్పబడినది.

గ్రంధరచయితయగు దాభోళ్కరు 1859వ సంవత్సరములో బీద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబములో ఠాణాజిల్లాలోని కేళ్వేమాహిము నందు జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. కుటుంబము బీదది యగుటచే ప్రాధమిక విద్య స్వగ్రామమునందు అభ్యసించి పూనాలో ఇంగ్లీషు 5 వ తరగతి వరకు చదివిరి. వారి ఆర్థికపరిస్థితు లంత బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొని అప్పట్లో నున్న సర్కారునవుకరి పరీక్షలో నుత్తీర్ణులై తన ఊరిలో బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలత్ దారుగా నున్న సాబాజీ చింతామణి చిటినీస్ అనువారు వీరి మంచి నైజమును తెలివిని సేవను చూచి మెచ్చుకొని తలాఠీ యను గామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమాస్తాగా వేసిరి. పిమ్మట మామలత్ దారు కచేరిలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అడవి ఉద్యోగిగా బ్రోచిలో నియమించిరి. ఆ ఉద్యోగములో చేయవలసిన పనులు చక్కగా నెరవేర్చుట వలన 1901 వ సం|| లో ఠాణా జిల్లాలో శాహాపూరులో మామలత్ దారుగా వేసిరి. 1903 వ సం||లో ఫస్టుక్లాసు రెసిడెంటు మెజస్ట్రేటుగా బాంద్రాలో నియమించిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. అప్పుడు వారిని ముర్బాడు, ఆనంద్, బోర్సదులకు బదిలీ చేసిరి. తిరిగి 1910 వ సం|| లో బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి శిరిడీకి పోయి బాబా దర్శనము చేయు భాగ్యము కలిగెను.

1916 వ సం|| లో వారు ఉద్యోగమునుండి విరమించుకొనిన పిమ్మట కొన్ని నెలలవరకు మాత్రమే తాత్కాలిక ఉద్యోగిగా నియమింపబడిరి. అది విరమించిన తత్ క్షణమే సాయిబాబాకు హృదయపూర్వకముగా మహా సమాధి చెందువరకు సేవచేసిరి. బాబా సమాధి పిమ్మట మిక్కిలి చతురతతోను, నేర్పుతోను శిరిడీ శ్రీ సాయిసంస్థానమును, తాను 1929 వ సం|| లో మరణించువరకును నడిపిరి. వారికి భార్య, ఒక కొడుకు, అయిదుగురు కొమార్తెలు గలరు. బిడ్డలకు తగిన సంభంధములు దొరికినవి. అందరు క్షేమముగా నున్నారు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సాయిబాబా యెవరు?

సాయిబాబా యెవరు? అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును.

1. దీర్ఘాలోచన చేయకయే, విషయములగూర్చి గాని, మనుష్యులను గూర్చి గాని యభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబానొక పిచ్చిఫకీరు అనియు వారు శ్రిడీలో శిధిలమై పాడు పడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు, తమను చూచుటకై వచ్చినవారి నుండి ధనము దక్షిణరూపముగా వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు.

ఈ యభిప్రాయము తప్పు. R.A..తరఖడ్ కర్ గారి స్నేహితుడు బొంబాయి తిరిగి పోవునపుడు, బాబా సెలవు పుచ్చుకొను సమయమందు, కంట తడిపెట్టుకొనెను. అతనితో బాబా యిట్లనెను. "పిచ్చివానివలే ప్రవర్తించుచున్నావేమి? నేను నీతో బొంబాయిలో లేనా?" ఆ స్నేహితుడిట్లు జవాబిచ్చెను. "నాకా విషయము తెలియదుగాని, మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నాకనుభవము కలుగునట్లు చేయలేదు." అందులకు బాబా యిట్లనియెను. "ఎవరయితే బాబా శిరిడిలోనే ఉన్నాడని యనుకొనెదరో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని భావింపుము".

2. కొందరు సాయిబాబాను యోగియనిరి. మహమ్మదీయులు బాబాను పీరులలో నొకనిగా భావించిరి. హిందువులు బాబాను యోగులలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము శిరిడీలో జరుగు ఉత్సవములు నడుపువారు బాబాను యోగి చూడామణిగా భావించెదరు.

ఈ యభిప్రాయము కూడ సరియైనది కాదు.

3. ఎవరయితే సాయిబాబాను నిజముగాను, ప్రేమతోను గ్రహించగలిగిరో వారు బాబాను భగవంతుని యవతారముగా చూచుకొనుటయే గాక యిప్పటికి వారట్లే భావించుచున్నారు. దీనికీ దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము.

1. బి.వి.నరసింహస్వామి గారు రచించిన "బాబా సూత్రములు పలుకులు" అను గ్రంధమునకు పీఠికలో ఇందూరు హైకోర్టు జడ్జిగారగు M.B.రేగేగారు ఇట్లు వ్రాసియున్నారు.

"బాబా సమాధి చెందకముందు తమ వాక్కుల అనంతశక్తి వలనను, పనుల వలనను, మాటలవలనను సాధకుని మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశించు శరీరము మాయమైపోయినది గాని, దానిలో నుండు "బాబా" మాత్రము ఇప్పటికిని అనంతశక్తివలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ నిశ్శబ్దముగా వారినే యాశ్రయించు యసంఖ్యాకులగు భక్తులకు సహాయపడుచున్నారు."

"నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారకుడుగా భావించెదను 1918వ సం||లో వారు మహాసమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకుమాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. ఇప్పటికినీ వారున్నారని చెప్పగలను.

నా యభిప్రాయమేమన, వారిని వారించున దేదియులేదు. వారు మాతో కలిసియున్నప్పుడు వారికి మానవశరీర ముండెను. ఒక్కొక్కప్పుడా విషయమును మాజ్ఞప్తికి దెచ్చుచుండెడివారు. వారిలో నున్న యనంతశక్తి మాత్రము మా ముందర నిలిచిపోయినది. వారిని మానసిక ప్రతిబింబమువలే భావించితిమి. తమ్ము శాశ్వతమయిన దాని యొక్క, యశాశ్వతమయిన దానియొక్క సరియైన సమ్మేళనముగా భావించి యశాశ్వతమైన మానవదేహము నొక్కొక్కప్పుడు మాముందర నగుపడునట్లు చేయుచుండిరని భావించెదను. ఇప్పుడు శరీర మును విడుచుటచే శాశ్వతమయిన శక్తియే సాయిబాబావలే నిలిచియున్నది."

3. B.V. నరసింహస్వామిగారిచే రచింపబడిన "భక్తుల యనుభవములు" అను గ్రంధములో 19-20 పుటలలో ఆచార్య G.G.నార్కే (M.A.;M.Sc.; పూనా ఇంజనీరింగు కాలేజీ) యిట్లు చెప్పుయున్నారు.

"ఇంటివద్ద నిత్యము నేను పూచించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరుగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు, అతడు సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు బుట్టీ, నా భార్య, నా తల్లి సాయిబాబా యొక్క గొప్ప భక్తులై వారిని భగవంతునివలే పూచించువారు.

నేను క్రొత్తగా శిరిడికి పోయినప్పుడొక హారతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను. అకారణముగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండిరి. అతడు పిచ్చివాడా యేమని నేను సంశయించితిని. అట్టి యాలోచన నా మనస్సునకు తట్టెను. మామూలుగనే హారతి పూర్తియాయెను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను, కాళ్ళను ఒత్తుచుంటిని. వెంటనే బాబా నా తలను దువ్వుచు నిట్లనెను. "నేను పిచ్చివాడను కాను" ఎంత యాశ్చర్యము!! నా హృదయములో నున్నదానిని గ్రహించుచున్నారు. వారికి తెలియకుండ మనము ఏ రహస్యములను ఉంచజాలము. వారు నా యంతర్యామి - నా యాత్మయొక్క యంతరాత్మయని యనుకొంటిని. అటుపిమ్మట వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువానివలే మాట్లాడిరి. నా హృదయములోగల యాలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వీరు నాలోనున్న భగవంతుడు, వీరే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతీ పరీక్షలో వారు సర్వజ్ఞులనియు, వారి యిచ్చానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను.

4. R.B.M.W..ప్రధాన్ వ్రాసిన "శిరిడీ సాయిబాబా" యను గ్రంధమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును, అమరావతిలో ప్రసిద్ధి కెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే యిట్లు చెప్పియున్నారు.

ప్రతివారి యంతరంగమందుగల యాలోచనలన్నియు తెలిసిన వానివలె గాన్పించెను. వారి కోరికలు తీర్చుచు సుఖము కలుగజేయు చుండెను. భూలోకమందు గల భగవంతుడను భావమును కలిగించుచుండెను.

5. దాసగణు మహారాజు తమ "స్తపన మంజరి" యను స్తోత్రమునందు సాయిబాబాను ప్రపంచసృష్టికర్తగాను, నిర్మలమయిన యంతరాత్మగాను, నిత్యశాంతమూర్తిగను వర్ణించి యిన్నారు.

6. హేమాడ్ పంతు తన సాయి సచ్చరిత్ర మొదటి అధ్యాయములో సాయిబాబాను వింతయోగిగాను, గోధుమలు విసురువానివలెను వ్రాసెను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన పిమ్మట బాబాను భగవంతుడనియు, పరబ్రహ్మస్వరూపుడనియూ చెప్పియున్నారు.

7. శిరిడీ భక్తులందరు, ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్ శ్యామా యనువారు బాబాకు మిక్కిలి భక్తులు; వచ్చిన భక్తులందరితో కలిసిమెలసి తిరుగువాడు. ఆయనెల్లప్పుడు బాబాను దేవా యని సంభోధించువాడు.

ఈ భక్తులందరి యభిప్రాయములను ఆమోదించి వారందరు చెప్పినది యధార్థమని శ్రీ సాయి యవతారపురుషు డనియు నమ్మెదము.

భగవంతుడు సర్వాంతర్యామి యను సిద్దాంతము

మన పూర్వ ౠషులు, ఉపనిషత్ ద్రష్టలు, భవంతుడు సర్వాంతర్యామియను సిద్ధాంతమును గనిపెట్టిరి. బృహదారణ్యక, చాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులలో ప్రకృతి యంతయు, సర్వవస్తు సముదాయమును జీవకోటితో సహా భగవంతుని రచనయనియు, అదియంతయు నంతర్యామిచే అనగా సర్వమును పరిపాలించువానిచే వ్యాపించబడి యిన్నదనియు వక్కాణించును. ఈ సిద్దాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీ సాయియే. శ్రీ సాయిసచ్చరిత్రను, సాయికి సంబంధించిన ఇతర గ్రంధములను ఏమనుజుండైన చదివినచో నతడు తప్పక ఈ సిద్దాంతమును నమ్మి యధార్థమయిన శ్రీ సాయిని గ్రహింపగలడు.

ఓం శాంతిః శాంతిః శాంతిః