శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

మొదటి అధ్యాయము

నమస్కారములు --- గోధుమలు విసిరిన కధ దాని వేదాంతప్రాముఖ్యము

పూర్వ సంప్రదాయప్రకారము హేమాడ్ పంతు శ్రీ సాయిసచ్చరిత్రను నమస్కారములతో ప్రారంభించుచున్నారు.

1. ప్రప్రధమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములు తొలగించి యీ గ్రంధము జయప్రదముగ సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాధుడే శ్రీ గణేశుడని చెప్పుచున్నారు.

2. పిమ్మట శ్రీ సరస్వతీ దేవిని స్మరించి యామె తననీ గ్రంధ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయికూడ నామెలో నొకరనియు తానే తనయొక్క కధను పాడుచున్నారనియు చెప్పుచున్నారు.

3. తదుపరి సృష్టి, స్థితి, లయకారకులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయికూడ వీరిలో నొకరనియు, వారు గొప్ప గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.

4. తరువాత తమ గృహదేవతయగు నారాయణ అధినాధునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆ భూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు వారి కుటుంబము మూలపురుషుని స్తోత్రము చేసిరి.

5. అటుపిమ్మట వారి సగోత్రుడగు భరద్వాజమునిని స్మరించెను. అదియుగాక పలువురు మునులను, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనద్కుమారుడు, జైమిని వైశంపాయనుడు, నవయోగీందులను, ప్రస్తుతయోగీశ్వరులగు నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధను, ఏకనాధు, నామదేవు, తుకారాం, కాన్హ, నరహరులను కూడ ప్రార్ధించెను.

6. తరువాత తన పితామహుడు సదాశివునకు, తండ్రి రఘునాధునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.

7. అటుపైన చదువరులకు నంస్కరించి తన గ్రంధమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుమని ప్రార్థించెను.

8. తుదకు తన గురువును, దత్తావతారమును అగు శ్రీ సాయి బాబాకు నమస్కరించి, వారిపై పూర్తిగా నాధారపడి యున్నాడనని చెప్పుచూ, ఈ ప్రపంచము మిధ్య అయనియు, బ్రహ్మమే సత్యమనియు, తనకు అనుభవము కలిగించు శక్తి వారికే కలదనియు, చెప్పుచు నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికినీ నమస్కరించెను.

పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి, వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కధను చెప్పుటకు ప్రారంభించెను.

1910 తదుపరి యొకనాటి ఉదయమున నేను శిరిడీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనముకొరకు వెళ్ళితిని. ఈ క్రింది విషయము గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. ముఖప్రక్షాళనము చేసి కొనినవెంటనే బాబా గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకెత్తి పిడికెడు బొప్పున గోధుమలు వేయుచు విసురుచుండెను. అది చూసి నాలో నేను "ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును? అతడెందులకు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే! వారికి విసరుటతో నేమి నిమిత్తము? వారికి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!" యని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నెట్లే యాశ్చర్యమగ్నులయిరి. కానీ మాలో నెవరికి గూడ బాబాను ప్రశ్నిచుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింతచర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. ఏలాగుననో నలుగురు స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుటకు ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యను చూచి బాబాకు కోపము వచ్చెను కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వెను. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. "బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడినవారు లేరు, పోషించవలసిన వారెవరునూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని? బాబా మిగుల దయార్దృహౄదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు." ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి, పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క బాగమును తీసికొనుచిండిరి. ఇంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.

"ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్దనుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, యిట్లు చేయుడు, పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు." ఈ సంగతి విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దులవద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము పిండిని చల్లిరి.

నేనిదంతయు జూచి శిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు, దానిని శాంతింప చేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటినుండి కలరా తగ్గెను. గ్రామము లోని ప్రజలందరు సంతోషముతో నుండిరి. ఇందంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. గోధుమపిండికి కలరాజాడ్యమునకూ సంబంధమేమి? ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుటకు నిశ్చయించుకొంటిని. ఈ లీలను జూచి యిట్లు భావించుకొని హృదయానంద పూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకాటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంధము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.

విసురుట - దాని వేదాంతభావము

విసరుటనుగూర్చి శిరిడీప్రజ లనుకొనురీతియేకాక దానిలో వేదాంతభావము కూడ కలదు. సాయిబాబా శిరిడీయందు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు విసరుచునే యిండిరి. వారు నిత్యము విసరునది గోధుమలు కావుగాని, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొకలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.

ఇది వినగనే కబీరుకధ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను. వారి గురువగు నిపతిరంజనుడు కారణ మడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. "నేను కూడ ఆ ధాన్యమువలే ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా" యనెను. నిపతిరంజనుడిట్లు బదులు చెప్పెను.

"భయపడవద్దు. తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని లోనికి పోనిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

మొదటి అధ్యాయము సంపూర్ణము