శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

పదునాలుగవ అధ్యాయము

నాందేడ్ నివాసియగు రతన్ జీ వాడియా, మౌలాసాహెబు అను యోగి; దక్షిణ మీమాంస.

గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యెనో వర్ణించితిము. ఈ అధ్యాయములో రతన్ జీవాడియా యనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగజేసెనో వర్ణించెదము.

ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడ మధురముగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు, అన్నియు మధురముగా నుండును. వారి జీవితము ఆనందమున కవతారము. శ్రీసాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనుల ననేకకధల రూపముగా భోధించిరి. క్రమముగా నవి యసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరు హాయిగా నుండవలెనని బాబా యుద్దేశ్యము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి యుద్దేశము. గతజన్మల పుణ్యముకొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తి నవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక, మన మెప్పుడును బద్దకించరాదు; ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమునునైన మోక్షమును సంపాదించవలెను.

ప్రతినిత్యము సాయిలీలలు వినినచో, నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగినయెడల తుదకు శుద్ద చైతన్యమునందు కలిసిపోదువు.

నాందేడు పట్టణ నివాసియగు రతన్ జీ

ఇక ఈ అధ్యాయపు ముఖ్యకధను ప్రారంభించెదము. నైజాము ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్ జీ షాపుర్జీ వాడియా. అతడు చాల ధనము ప్రోగుచేసెను. పొలములు, తోటలు, సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాల సంతుష్టిగా సంతోషముగా గాన్పించెడివాడు. కాని లోపల వాస్తవముగా నట్లుండెడివాడు గాడు. ఈ లోకమునందు పూర్తిసుఖముగా నున్న వారొక్కరు లేరు. ధనికుడగు రతన్ జీ గూడ ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు. ధానధర్మములు చేయువాడు; బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు. అందరి కన్ని విధముల సహయమును చేయుచుండువాడు. చూచినవారందరును "అతడు మంచివాడు; సంతోషముగ నున్నా"డని యనుకొనసాగిరి. కాని రతన్ జీ చాల కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియై యుండెను. భక్తిలేని హరికధవలే వరుసలేని సంగీతమువలే, జందెములేని బ్రాహ్మణునివలే ప్రపంచజ్ఞానములేని శాస్త్రవేత్తవలే, పశ్చాత్తపములేని యాత్రవలే, కంఠాభరణములేని యలంకారమువలే రతన్ జీ జీవితము పుత్రసంతానము లేక నిష్పృయోజనముగాను, అందవికారముగాను నుండెను. రతన్ జీ యెల్లప్పుడు ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను.

రతన్ జీ తనలో తానిట్లనుకొనెను. "భగవంతు డెన్నడయిన సంతుష్టి చెంది పుత్రసంతానము కలుగజేయడా? మనస్సునందలి చింతతో ఆహారమునందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానము కలుగునా? లేదా? అను నాతురతతో నుండువాడు. దాసుగణు మహారాజు నందు గొప్ప గౌరవము కలిగియుండెడివాడు. ఒకనాడు వారిని గాంచి, తన మనస్సులోని కోరికను జెప్పెను. శిరిడీ వెళ్ళుమని వానికి దాసుగణు సలహా నిచ్చెను; బాబా ను దర్శించుమనెను; బాబా ఆశీర్వాదము పొందుమనెను; సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్ జీ దీనికి సమ్మతించెను. శిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట శిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదములమీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను దీసి బాబా మెడలో వేసి, యొక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను; మిక్కిలి వినయవిధేయతలతో బాబా దగ్గర కూర్చొనెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను.

"కష్టదశలో నున్న వార నేకమంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదముల నాశ్రయించితిని, కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము." బాబా రతన్ జీ ఇవ్వదలచిన 5 రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను. అందులో రూ. 3-14-0 ఇంతకు పూర్వమే ముట్టియుండెను. గాన మిగిలిన రూ.1-2-0 మాత్రమే యిమ్మనెను. ఇది విని రతజ్ జీ ముగుల నాశ్చర్యపడెను. బాబా యాడిన మాటలను రతజ్ జీ గ్రహించుకొనలేక పోయెను. కాని బాబా పాదములవద్ద కూర్చుండి మిగత దక్షిణ యిచ్చెను. తాను వచ్చిన పని యంతయు బాబాకు బోధపరచి తనకు పుత్రసంతానముకలుగజేయుమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. "చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చు" నని చెప్పెను.

బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్ జీ నాందేడు వచ్చెను. దాసుగణుకు శిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు దెలిపెను. అంతయు సవ్యముగా జరిగెననియు , బాబా దర్శనము, వారి యాశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి యనెను. బాబా యాడిన మాటలకర్థమేమని దాసుగణు నడిగెను. నేనెప్పుడు శిరిడీకి వెళ్ళియుండలేదే! నావల్ల బాబాకు రూ.3-14-0 ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడ సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు అలోచించెను. కొంతకాల మయిన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబువారికి రూ.3-14-0 తో సత్కరించినట్లు జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ శిరిడికి పోవ నిశ్చయించగనే యీ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ 3-14-0 యగుట జూచి అందరు ఆశ్చర్యపడిరి. అందరికి బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు శిరిడీలో నున్నప్పటికి దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. లేనిచో మౌలాసాహెబు కిచ్చిన రూ.3-14-0 సంగతి బాబా కెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే యని గ్రహించిరి.

రతన్ జీ యా సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొద్దికాలము పిమ్మట అతనికి పుత్రసంతానము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితిలేకుండెను. కొన్నాళ్ళకు వారికి 12గురు సంతానము కల్గిరి. కాని నలుగురు మాత్రము బ్రతికిరి.

ఈ యధ్యాయము చివరన హరివినాయక సాఠే యను వాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసికొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా యాశీర్వదించిన కధ గలదు. అట్లే రెండవ భార్య వచ్చినపిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు గలిగిరి. కావున నిరుత్సాహము చెందెనుగాని బాబా మాటలెన్నటికి అసత్యములు గానేరవు. మూడవసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను.

దక్షిణ మీమాంస

దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్ళినవారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట యందరికి తెలిసిన సంగతే. బాబా ఫకీరయినచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని ఎవరైన యడుగవచ్చు. దీనికి పూర్తి సమాధానమిది.

మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గిపుల్లలను జాగ్రర్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియు నడిగెడివారు కారు. ఎవరైనా నొక కానిగాని రెండు కానులు గాని యిచ్చినచో దానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడీగాని చిలుముగాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాని యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు. అర్థణా అయినచో తిరిగి యిచ్చేవారు. బాబా గారి కీర్తి అన్నిదిశలకు వ్యాపించినతరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను.

"దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు" అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగులపూజలో మాత్రమేల యిండరాదు? శాస్త్రము లలో గూడ నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు "ద" యను నక్షరమును బోధించెను. ఈ అక్షరమువల్ల దేవతలు "దమము" నవలంబించవలెనని గ్రహించిరి. (అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట) మానవులు ఈ యక్షరమును "దానము" గా గ్రహించెను. రాక్షసులు దీనిని "దయ" యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమమేర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానముమొదలగు సుగుణముల నభ్యసించ వలయునని చెప్పును. దానము గట్టి విశ్వాసంతోను, ధారాళముగను, అణకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానముగూర్చి బోధించుటకు, ధనమందు వారికిగల అభిమానమును పోగొట్టుటకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా పుచ్చుకొన్నదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేకమందికి జరిగెను. దీంకొక యుదాహరణము. గణపతిరావు బోడస్ యను గొప్ప నటుడు, తన మరాఠీ జీవితచరిత్రతో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడస్ కు దొరకుచుండెను.

దక్షిణ యడుగగా ధనమీయ నక్కరలేదను నర్థము గూడ పెక్కుసంఘటనలవలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండు యుదాహరణములు.

(1) బాబా 15 రూ||లు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి.నార్కే నడుగగా నతడు తనవద్ద దమ్మిడీయయిన లేదనెను. బాబా యుట్లనెను. "నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు. దానినుంచి నాకు దక్షిణ యిమ్ము." దక్షిణ యనగా నిచ్చట గ్రంధమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రర్తగా హృదయములో దాచుకొనుమనియే యర్థము. (2) ఇంకొకసారి బాబా, తరఖడ్ భార్యను 6 రూ||లు దక్షిణ యిమ్మని యడిగెను. అమెవద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. వెంటనే నామె భర్త యక్కడనే యుండుటచే బాబా వాక్కుల కు అర్థము చెప్పెను. ఆమె యొక్క యారుగురు శత్రువులను (కామ క్రోధ లోభాదులు) బాబాకు పూర్తిగా సమర్పించవలెనని యర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను.

బాబా దక్షిణరూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి యుదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణరూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందు నప్పటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు కానమును, త్యాగమును నేర్పుటకొరకే.

దక్షిణ గూర్చి యింకొకరి వర్ణన

బి.వి.దేవ్ ఠాణా నివాసి; ఉద్యోగము విరమించుకొనిన మామలతదారు. బాబా భక్తుడు, దక్షిణ గూర్చి శ్రీ సాయిలీల వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు.

బాబా యందరిని దక్షిణ నడుగువారు కారు. అడుగకుండ ఇచ్చినచో నొక్కక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంక్కొక్కప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తులవద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో యిచ్చెదమనుకొను వారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైన తమ ముందుంచినచో దానిని తీసికొని పొమ్మనుచుండిరి. బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చెన్న మొత్తములుగాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టి యుండును. స్త్రీలు, పిల్లలల వద్ద కూడ బాబా దక్షిణ యడుగుచుండెను. వారు అందరు ధనికులను కాని అందరు బీదలను గాని దక్షిణ యడుగలేదు.

అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించియుండలేదు. ఎవరిద్వారనైన భక్తులు దక్షిణ పంపించినచో, వారు దానిని మరచునప్పుడు, వారిని దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి, దక్షిణ పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి, పూజలో పెట్టుకొని పూజించుమనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్న దానికంటే నెక్కువ యిచ్చినచో, కావలసినదానినే యుంచుకొనె మిగతా దానిని తిరిగి యిచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులనుకొనిన దానికంటే నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని అడిగిగాని యివ్వుమనుచుండెను. కొందరివద్దనుంచి ఒకేరోజు మూడు నాలుగుసారులు దక్షిణ కోరుచుండెను.

దక్షిణ రూపముగా వసూలయిన పైకమునుంచి కొంచెముమాత్రమే చిలుమునకు, ధునికొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. శిరిడి సంస్థానములో నున్న విలువైన వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి యిచ్చిరి. ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చి నచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబు చాందోర్కరుతో తన యాస్తి యంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలుగ్లాసు మాత్రమే ననియు అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను

మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది స్త్రీ; రెండవది ధనము. శిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి యున్నారు. అందొకటి దక్షిణ; రెండవది రాధాకృష్ణామాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ యడిగి పుచ్చుకొని "బడికి" (రాధాకృష్ణమాయి గృహము) పంపుచుండెను. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినపుడే బాబా దయవలన ఆశీర్వాదమువలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను.

భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము, ఆదాతయొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని యున్నది. శిరిడీ కన్న పవిత్రస్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు?

ఓం నమో శ్రీ సాయి నాధాయ

శాంతిః శాంతిః శాంతిః

పదునాలుగవ అధ్యాయము సంపూర్ణము