శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువది ఐదవ అధ్యాయము

దాము అన్నా కాసార్ (అహమదునగరు)
1.పట్టా వ్యాపారము 2.మామిడిపండ్ల కధ.

ప్రస్తావన

భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాధునకు సాష్టాంగనమస్కారము లొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగి చూడామణియగు శ్రీ సాయినాధమహారాజుకు జయమగు గాక! సమస్త శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తులపాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా ఎల్లప్పుడు కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃఅపూర్వకమైన భక్తి. భక్తునను స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి యున్నప్పుడు వాని కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణకలిగి గ్రంధరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము, కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతమణి వంటిది. దానినుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.

భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖములనుండి, యపాయములనుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్ నగర నివాసియగు (ప్రస్తుతము పూనా వాసి) దామోదర్ సావల్ రాం రాసనె కాసార్ వురఫ్ దాము అన్నా కధ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా (దామోదర్ సావల్ రాం రాసనె)

6వ అధ్యాయములో శ్రీ రామనవమి యుత్సవసందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1895 వ సంవత్సరమున శ్రీ రామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు శిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టి వ్యాపారములు 1.ప్రత్తి

బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు రెండులక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంతమాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యా బేరమును చేయుటయా? మానుటయా? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగ ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామా కొక ఉత్తరము వ్రాసి బాబా నడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము అ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసుకొని మసీదుకు బోయెను. బాబా ముందరబెట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను.. "ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతు డిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము." బాబా చెప్పినదే ఆ యుత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడనే ప్రశాంతముగ కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరము లోని సంగతులు తెలిసియునన్నేల చదువుమని బలవంత పెట్టునున్నావు?" అనెను. బాబా యిట్లనియె: "ఓ శ్యామా! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు?"

అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. "సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు అయాసపడవద్దని చెప్పుము." శ్యామా జవాబును పంపెను. దానికొరకాతురతో దాము అన్నా కని పెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైనదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా శిరిడీ వెళ్ళీ బాబా తో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే శిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తనమనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు. బిడ్దకు తీపి వస్తువులు కావలను. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపివస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్రలారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనెను. "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు." బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము

పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయతలపెట్టెను. ఈ యాలోచనకూడ బాబా గ్రహించి యిట్లనెను. "నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను" మనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువచేసిన వారెల్లనష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టీ వ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను రెండు సారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు.

ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవానుంచి శ్యామ పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో (కుండలో) పెట్టెను. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె" ననెను.

దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వాని కిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడ జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహప్రభావ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండు గంటలకు అతడు శిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లవైపు చూచుచున్నారు. కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను." దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాళ్సాపతి (బాబా ముఖ్యభక్తుడు) దానిని నిట్లు సమర్థించెను. "చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబా ముందు చంపుట యొక యాశీర్వాదము." బాబా యతని కిట్లనియె: "నీవు తినవద్దు. నీ చిన్న భార్యకిమ్ము. ఈయామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును." దాము ఆప్రకారమే చేసెను, కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను.

బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు గూడ వారి మహత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా యిట్లనెను. "సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనే గాక నా సమాధికూడ మాట్లాడును; కదలును. మనస్పూర్తిగ శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు."

ప్రార్థన

హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు.

"ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపునంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకుగాని, బార్యగాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు అనందమును, మోక్షమును కలుగ జేయువాడను. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగ నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక. మా యాలోచనలను అవి మంచివే యగుగాక చెడ్డవే యగుగాక తరిమి వేయుము. మా గృహములను శరీరములను మరచునట్లు జేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనఃశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగ నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."

నోటు: దాము అన్నా యిచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింప దగినది.

ఒకనాడనేకమందితో నేను గూడ బాబా పాదములవద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా యిట్లు జవాబిచ్చెను.

1.సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడు చున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా?

దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాల మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.

2.ఇది నా గురించి యడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి?

దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. "ఎక్కడైననూ నెప్పుడయిననూ నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను." 1918 కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి.

నా సోదరి చనిపోగా, నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా, వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పా కులకర్ని యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంవత్సరములనుండి యొక స్నేహితుడుండెను. అతడు నా భార్యయొక్క నగలపెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫొటో ముందేడ్చితిని. ఆ మరుసటి దినమే యా మనిషి నగల పెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపణ కోరెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువది ఐదవ అధ్యాయము సంపూర్ణము