శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

ఇరువది యారవ అధ్యాయము

1.భక్తపంతు 2.హరిశ్చంద్రపితళే 3.గోపాల అంబాడేకర్ కధలు.

ప్రస్తావన

ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగ నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదే భగవంతుడు. చీకటిలో తాడును గాని, దండమునుకాని చూచి పామనుకొనునట్లు, అట్లనే ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించును కాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను దెరపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మన కగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతముగాక. అదే సత్యదృష్టి.

ఆంతరిక పూజ

హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందబాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక, దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక, అష్టసాద్వికభావము లనెడు ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక, ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించెదముగాక, భావమను బుక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక, మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక, సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక, వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక, అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.

ఇకనీ అధ్యాయములోని కధల వైపు మరలుదము.

భక్త పంతు

ఒకనాడు పంతు అను భక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున శిరిడికి వచ్చెను. అతనికి సిరిడీ పోవు ఇచ్ఛలేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. బి.బి.సి.ఇ రైల్వే లో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరు శిరిడీకి పోవుచుండిరి. వారందరు తమ వెంట రమ్మని కోరగా వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్ లో దిగెను. అచట తన గురువును దర్శించి, శిరిడీ పోవుటకు అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందరితో కలసి శిరిడీ కి వచ్చెను. ఉదయమే శిరిడీ చేరిరి. 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచి యందరు సంతసించిరి. కాని పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతనికి ముఖముపై నీళ్ళు చల్లగా తెలివి వచ్చెను. నిద్రనుండి లేచిన వానివలే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా, యింకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగ బలికెను. "ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము, ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితళే

బొంబాయిలో హరిశ్చంద్రపితళే యనువారుండిరి. అతనికి మూర్చ రోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడ వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపయి బడుట యనే సాధన మొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసెనని వింటిమి. 1910 లో పితళే అట్టి కధలు కొన్నిటిని వినెను. వాని నుండి, యితరులు చెప్పినదానినుండి, బాబా తన దృష్టిచేతను, తాకుటచేతను, బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబా ను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట పెట్టుకొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో శిరిడీ కి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యమును దప్పి నేలపై బడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చినవానివలే పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని యీ మూర్ఛ చాలసేపటివరకుండెను. తల్లి కంటినీరు వరదలుగ కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి పరుగెత్తగా అది తన నెత్తి పయి బడినటులు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావువలే, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారి పయిబడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినటుండెను. ఆమె యిటులేడ్చుచుండగా బాబా యామెనిటుల యోదార్చెను. "ఇటు లేడ్వవలదు. కొంతసేపాగుము. ఓపిక తో నుండుము. కుర్రవానిని బసకు దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును." బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యధార్థములయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే, కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. "నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్లబడినవా? ఎవరికయితే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును." పితళే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితళే భార్య సాత్వికురాలు, నిరాడంబరము, ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్థంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్లనుండి యానందబాష్పములు రాల్చుచుండెను. అమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలే యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగ నున్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి, బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితళేను దగ్గరకు బిలచి యిట్లనెను. "బాపూ, అంతకుముందు 2 రూపాయలిచ్చి యుంటిని. ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజించుము. నీవు మేలు పొందెదవు." పితళే వీనిని ప్రసాదముగ నంగీకరించెను బాబాకు సాష్టంగనమస్కారము చేసి యాశీర్వచనములకయి ప్రార్థించెను. ఇదే తనకు శిరిడీ పోవుటకు మొదటిసారి కనుక, అంతకుముందు 2 రూపాయలిచ్చెనను బాబా మాటల యర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసికొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను. స్వగృహము నకు పోయి తన ముదుసలితల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా యంతకు ముందు రెండురూపాయలిచ్చెననెను; అదేమియని యడిగెను. అమె తన పుత్రున కిట్లనెను. నీ కోడుకుతో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు; దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ వదృష్టవంతుడవగుటచే, అక్కల్ కోట్ కర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పింప జూచుచున్నారు. కాబట్టి యికమీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము నవలింబిముపు. కుటుంబదైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని , యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పి నారు. నీ మేలుకొరకు దాని నభివృద్ధి చేసికొనుము." తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయియొక్క సర్వాంతర్యామి త్వమునందు, వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను.

అంబాడేకర్ గారు

పూనానివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఆబ్ కారి డిపార్టుమెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా జిల్లాలో, జౌహర్ స్టేట్ లోను వారుద్యోగములను జేసి, విరమించుకొనిరి. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి, కాని ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తి కరముగా నుండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు. 1916 లో అతని స్థితి చాల హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండిమీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే, బాబా మరియొకటి చేయ నిశ్చయిచెను. కొన్ని అడుగుల దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను బిలచి అక్కల్ కోట్ కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా? యని యడుగుచు పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కధ వచ్చెను. "అక్కల్ కోట్ కర్ మహారాజుగారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను. బాధను సహించలేక నిరాశచెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుండి బయటకు దీసి యిట్లనెను. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ యనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మ నెత్తి, బాధ యనుభవింపవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించ రాదు? గత జన్మముల పాపముల నేల తుడిచివేయరాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."

సమయోచితమైన ఈ కధను చదివి, అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా యీ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతనికి గల భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రి వలే భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధిపొంగెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దానిద్వారా తన పరిస్థితి బాగుచేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగత జీవితమంతయు సుఖముగా గడపెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము