|
ముప్పదియేడవ అధ్యాయము
చావడి యుత్సవము
హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవముగూర్చి
వర్ణించుచున్నారు.
తొలిపలుకు
శ్రీ సాయిజీవితము మిగుల పావనమయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు
వర్ణింపనలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు. మరికొన్ని
సమయములందాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్నిపనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము
లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని,
నిద్రితులుగా గాని, కనిపించెడువారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు
సముద్రమువలె శాంతముగా తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతుకనుగొనరానివి.
వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల
నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే.
వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకముగు
భక్తితో వారి పాదములకు సేవ చేసెదము గాక. వారిని సకల జీవకోటియందు జూచెదము గాక! వారి నామము
నెల్లప్పుడూ ప్రేమించెదము గాక.
వేదాంతసంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు
మొదలిడెను.
చావడి యుత్సవము
బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను
నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు
ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిశంబరు 10 వ తేదీనుండి చావడిలో
భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి. వారి కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో
నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజనబృందము
వెనుక రథము, కుడివైపు తులసీబృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి
గల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండెరి. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కజీరా,
మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు
ఈడ్చుకొనెడివారు. బయట బహిరమగస్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి
నలంకరించుచుండిరి. కొందరు బెత్తము లను చేత ధరించి "శ్రీ సాయినాధ మహారాజకీ జయ్" యని కేకలు
వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని
వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును. అప్పుడు తాత్యా పాటీలు
కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా
కూర్చొనెడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా
యని పిలచెడువారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమయినది. బాబా శరీరముపై మామూలు కఫనీ
వేసి కొని, చంకలో పటకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని,
బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట తాత్యా జలతారుశెల్లాను బాబా ఒడలిపై వేసెడివాడు. అటు పిమ్మట
బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న
దీపమునార్పి, చావడికి బయలుదేరెడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబా మందుసామాను
లనేకరంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగమువీణల సహాయముతో
భజన చేయుచు ఉత్సవములో నడచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను
చేతబట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు "శ్రీ సాయినాధ మహరాజ్ కీ జయ్" అని
కేకలు పెట్టుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు. వానిపై బాబా భక్తులకేలూతతో
నడచెడువారు. తాత్యా ఎడమచేతిని మహాళ్సాపతి కుడిచేతిని, బాపుసాహెబుజోగ్ శిరస్సుపై చత్రమును
పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన
ఎర్ర గుర్రము శ్యామకర్ణదారి తీయుచుండెను దాని వెనుక పాడెడు వారు, భజన చేయువారు, వాయిద్యముల
మ్రోగించువారు, భక్తుల సమూహముండెడిది. హరినామస్మరణతోను, బాబా నామస్మరణతోను ఆకాశము బద్దలగునటుల
మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరు
ఆనందించుచుండిరి.
ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖముపెట్టి నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశముతో
వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్యవలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా
ఉత్తరమువైపు ముఖముబెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల
గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు
ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి, యొక వెండిపళ్ళెములో పువ్వులు
గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు
వాని శక్తికొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృతప్రకాశముతోను,
సౌందర్యముతోడను, వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను
వర్ణించుటకు, మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడానందమును భరించలేక మహాళ్సాపతి దేవత ఆవేశించిన వానివలె
నృత్యము చేయువాడు. కాని, బాబా యొక్క ధ్యానమేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని
తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాళ్సాపతి కుడివయిపు నడచుచు బాబా
సెల్లాయంచును పట్టుకొనెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది.
ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా
నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు.
వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆదృశ్యము, ఆ కాలము గడచిపోయినవి.
ప్రస్తుతము గాని, యికముందు గాని యా దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని
భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును.
చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోను, నిలువుటద్దములతోను అనేకరంగుల
దీపములతోను వ్రేలాడగట్టిన గాజుబుడ్డీలతోను అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు
ప్రవేశించి యొక యాసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించినపిమ్మట
భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు
వేసి, మెడలో నగలు వేయుచుండిరి. ముఖము నకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా
బాబా వైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా
దానిని విసరివైచునని వారికి భయము. బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు
లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతరపెట్టువారు కాదు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి
సుందరముగా గనుపించుచుండిరి.
నానాసాహెబు నిమోంకర్ గిర్రున తిరుగుకుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాబా సాహెబు జోగ్ యొక
వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి, యర్ఘ్యపాద్యములనర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము
నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు
నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోను,
విసనకర్రలతోను విసరుచుండిరి. అపుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక
పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాళ్సాకు ఇచ్చెడువారు. తదుపరి
యితరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపః పరీక్షల
కాగవలసివచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి
తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు
పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు. బాబా
నిర్వ్యామోహము అభిమనరాహిత్యములకవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్కపెట్టువారు
కారు. భక్తులందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి యిష్టనుసారము చేయుటకు ఒప్పుకొనుచుండెను.
అఖరుకు బాపూ సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతిసమయమున బాజాభజంత్రీ మేళతాళములు
స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి
యొకరి తరువాత ఇంకరు తమతమ యిండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట
తాత్యా యింటికి పోవు టకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనును. "నన్ను కాపాడుము.
నీసిష్టమున్నచో వెళ్ళుము. గాని రాత్రి యొకసరి వచ్చినా గూర్చి కనుగొనుచుండుము." అట్లనే
చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు.
50, 60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.
మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి. ప్రతిరోజు రాత్రి
నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.
|