శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము - పి.నారాయణరావు Back   Home 

నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము - శిరిడీ పుణ్యక్షేత్రము - సాయిబాబా యొక్క రూపురేఖలు - గౌలిబువా గారి వాక్కు - విఠల్ దర్శనము - క్షీరసాగరుని కధ - దాసగణు ప్రయాగస్నానము - సాయిబాబా అయోనిసంభవము - శిరిడీ కి వారి మొదటి రాక - మూడు బసలు.

యోగీశ్వరుల కర్తవ్యము

భవవద్గీత చతుర్థధ్యాయమున 7, 8 శ్లోకములందు శ్రీ కృష్ణపరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునపుడు అథర్మము వృద్ధిపొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను." ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతులవారి హక్కులను, అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునపుడు, ఎవరును మత బోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునపుడు, జనులు నిషిద్ధాహారములు త్రాగుడులకలవాటుపడినపుడు, మతము పేరుతో కానిపనులు చేయునపుడు, వేర్వేరు మతములవారు తమలో తాము కలహించునపుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునపుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనపుడు, ప్రజలు ధనదారాసంతానములే జీవితపరమార్థముగా భావించి మోక్షమార్గమును మరచునపుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్థంభములవలే సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గములను సత్ర్పవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయీ, ఏకనాధుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు, మొదలుగాగల యోగులును, తదితరులును వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జీపిరి. అట్లే సాయిబాబాగూడ సకాలమందు శిరిడీ చేరిరి.

శిరిడీ పుణ్యక్షేత్రము

అహమదునగరు జిల్లాలోని గోదావరినది ప్రాంతములు చాల పుణ్యతమములు. ఏలయన నచ్చట ననేకులు యోగులుద్భవించిరి, నివాసము చేసిరి. అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు. శిరిడీ అహమదునగరు జిల్లాలోని కోపర్ గాం తాలూకా కు చెందినది. కోపర్ గాం వద్ద గోదావరి దాటి శిరిడీకి పోవలెను. నదిదాటి 3 కోసులు పోయినచో నీమగాం వచ్చును. అచ్చటికి శిరిడీ కనిపించును. కృష్ణా తీరమముగల గాఘగాపురం, నరిసింహవాడి, జౌదుంబర్ మొదలుగాగల పుణ్యక్షేత్రముల వలే శిరిడీ కూడ గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున నున్న మంగళమేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడ మందు సమర్థ రామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీ నరసింహ సరస్వతీస్వామి వర్థిల్లినట్లే శ్రీ సాయినాధుడు శిరిడీలో వర్థిల్లి దానిని పవిత్రమొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు

సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; నశించు వస్తువులందభిమానము లేవివారు. ఎల్లప్పుడు ఆత్మసాక్షాత్కారమందే మునిగిముండెడివారు; భూలోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలే స్వచ్చమైనది. వారి వాక్కులనుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. మానావమానములను లెక్కించినవారుకారు; అందరికీ వారు ప్రభువు. అందరితో కలసిమెలసి యిండెడివారు. ఆటలు గాంచెడివారు. పాటలను వినుచుండెడివారు. కాని సమాధిస్థితినుండి మరలువారు కారు. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగనిద్రయందుండెడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలే ప్రశాంతము, వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండునప్పటికినీ ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి యిండెడివారు. సిద్ధపురుషుడినప్పటికినీ సాధకునివలే నటించువారు. అణకువ, నమ్రత కలిగి, యహంకారము లేక యందరినీ సంతసింపజేయుచారు. అట్టివారు సాయిబాబా. శిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. అళందిని జ్ఞానేశ్వరమహారాజు వృద్ధి చేసినట్లు, ఏకనాథు పైఠనును వృద్ధి చేసినట్లు సాయిబాబా శిరిడీని వృద్ధిచేసెను. శిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవిత్రపాదములను ముద్దుపెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. మావంటి భక్తులకు శిరిడీ, పండరీపురము, జగన్నాధము, ద్వారక, కాశి, రామేశ్వరము, బదరి కేదార్, నాసిక, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మాహబలేశ్వరము, గోకర్ణముల వంటిదయినది. శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణము తంత్రమును. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యాత్మసాక్షాత్కారమును సులభసాథ్యము చేసెను. శ్రీసాయి దర్శనమే మాకు యోగసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీప్రయాగల స్నానఫలము వారి పాదసేవవలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిటి శ్రీకృష్ణుడుగ, శ్రీ రాముడుగ నుండి ఉపశమనము కలుగజేచుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిత్సాహముగాని ఉల్లాసముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడు సచ్చిదానందస్వరూపులుగా నుండెడివారు. శిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశములనుండి శిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఘుమాయిని దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము శిరిడీలో దొరకుచుండెడిది. ఇది యతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరములు వయస్సుగల గౌలిబువాయను వృద్ధభక్తుడొకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందును, మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలుకార్తీకమువరకు గంగానది యొడ్డునను ఉండెడివారు. సామాను యోయుటకొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని శిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచి యిట్లనెను. "వీరు పండరీనాధుని యవతారమే! అనాధలకొరకు, బీదలలొరకు, వెలసిన కారుణ్యమూర్తి." గౌలిబువా విఠొబాదేవుని ముసలి భస్తుడు. పండరియాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పండరీనాధుని యవతారమని నిర్థారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లామాలిక్ అని యనెడివారు. అనగా అల్లాయే యజమాని. ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించు చుండెడివారు. దీనినే నామసప్తాహ మందురు. ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్థానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి "తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాధ్ యొక్క డాకూరు పట్టనము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీ కృష్ణుని ద్వారకాపట్టణము, ఇక్కడనే యనగా శిరిడీలోనే యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునపుడు విఠలు డిక్కడనే యవతరించును." అనెను.

సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడీ క్రిందివిధముగా దర్శనమిచ్చెను. స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగి నప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతికొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా యిట్లడిగెను. "విఠలు పాటీలు వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25, 30 విఠోబా ఫోటో లను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరాసాగరుని కధ.

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియో, భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబాభక్తుడు. పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడ విఠోబాప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు శిరిడి వచ్చినపుడు, బాబా వాని తండ్రి ని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీని తండ్రి నా స్నేహితుడు గాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కుడ ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను" అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము

గంగానది, యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగణు అచ్చటికిపోయి స్నానముచేయవలెనని మనస్సున దలచెను. బాబావద్ద కేగి యనుమతించు మనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. "అంతదూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటనవేళ్ళనుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును దాసగణు చూచి ఆశ్చర్యనిమగ్నుడై, భక్తి ప్రేమలతో మైమరచి కంట తడి పెట్టుకొనెను. అంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పొగడెను.

బాబా అయోనిసంభవుడు; శిరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లితండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని ఎవరికి ఏమియు తెలియదు. పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కు సారులీ విషయము బాబాను ప్రశ్చించిరి గాని యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొంద కుండిరి. నామదేవు, కబీరు, సామాన్యమానవులవలె జన్మించియిండలేదు. ముత్యపు చిప్పలలో చిన్నపాపలవలె చిక్కిరి. నామదేవు భీమరథి నదిలో గోణాయికి కనిపించెను. కబీరు భాగీరధీనదిలో తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తులకొరకు 16 ఏండ్ల బాలుడుగా శిరిడీ లోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. స్వప్నావస్థనందయినను ప్రపంచవస్తువులను కాంక్షించెడి వారుకాదు. మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచోప్ దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. "ఈ చక్కని చురుకైన, అందమైన కుర్రవాడు వేపచెట్టు క్రింద ఆసనములోనుండెను. వేడిని, చలిని లెక్కింపక యంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాథిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాడు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారాశ్చర్యనిమగ్నులై యీ చిన్న కుర్రవాడెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగ నుండెను. ఒక్కసారి చూచినవారెల్లరు ముగ్థులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలునివలే గాన్పించినప్పటికిని చేతలనుబట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖంగోబా దేవుడొకని నావేశించగా నీబాలుడెవడయి యిండునని ప్రశ్చించిరి. వాని తల్లి దండ్రులెవరని యడిగిరి. ఎచ్చటి నుండి వచ్చినాడని యడిగిరి. ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా నిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా క్రింద నొక సందు గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పినపిమ్మట కుర్రవాని నీ విషయము ప్రశ్చించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాథి యచ్చట గలదు గావున దానిని గాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఉదుంబర, వృక్షములవలె నీ వేపచెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. శిరిడీలోని భక్తులు, మహళ్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.

మూడు బసలు

వేపచెట్టు ను, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాఠే అనువాడు కొని సాఠెవాడ యను పెద్ద వసతిని గట్టించెను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్తమండలికిది యొక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి. మెట్లు కట్టిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్చట గురువారము, శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాల పురాతనమైనది. కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మ్రమత్తులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి. న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కరు శిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909 వ సంవత్సరమున కాకా బాబా వద్దకు బోయి కాలు కుంటితనము కన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై శిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడను నిర్మించెను. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను. (1) దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911వ సంవత్సరములో శ్రీ రామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియునగు బుట్టీ మరియొక పెద్ద రాతి మేడను నిర్మించెను. చాల ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వెనియోగపడెను. ఏలయన బాబా గారి భౌతికశరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధిమందిరమందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకుముందిచ్చట నొక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను.

ఓం నమో శ్రీ సాయినాధాయ

శాంతిః శాంతిః శాంతిః

నాలుగవ అధ్యాయము సంపూర్ణము.