వినాయకచవితి పూజ - SKU
ఈ పేజీ ని పంపండి

ఇవాళ ఇంట్లో వినాయకచవితి పూజ చేసుకొని తృప్తి గా లేచి భోజనం చెయ్యటం మొదలెట్టాను. కానీ నాకు ఇండియాలో మా ఇంట్లో అందరితో కలిసి చేసుకున్న వినాయకచవితి పండుగ రోజుల స్మృతులు మదిలో మెదలుతూనే వున్నాయి.

మాది మధ్యతరగతి కుటుంబం, పైగా నాన్నగారికి బట్టల మీద బోలెడంత ఖర్చు పెట్టడం, బీరువాల నిండా బట్టలు కొనటం ఇష్టం లేదు, సాధ్యం అయినా కాకపోయినా, మాతో మాత్రం తన స్థోమత కి ప్రతీ పండగ కీ బట్టలు తియ్యటం సాధ్యం కాదు అని చెప్పేవారు. ముగ్గురు ఆడపిల్లలం మరి! ఏ పండగ కి కొన్నా కొనకపోయినా, వినాయకచవితి కి మాత్రం బట్టలు కొనేవారు.

చిన్నప్పుడు అమ్మ డ్రెస్ మెటీరియల్ కొని, తనే ఇంట్లో మాకు దానితో డ్రెస్ లు కుట్టేది. మేం పెద్దవాళ్ళం అయి, మా స్వంత styles వచ్చాక, అమ్మ కుట్టే పాత styles మాకు నప్పక, బయట కొనుక్కోవటం మొదలెట్టాం. మా చిన్నదీ, అక్కా అయితే బట్టల సెలెక్షన్ కూడా తామే చేసుకునేవారు. నాకు షాపింగ్ అంటే చిరాకు. అమ్మ పోరు పడలేక షాపింగ్ కి వెళ్ళినా, అక్క కూడా వస్తోంది అంటే, సాధ్యమైనంత వరకూ వెళ్ళేదాన్ని కాదు. మా అక్క కి మరి ఓ పట్టాన ఏమీ నచ్చేవి కావు. ఓకోసారి మైన్ రోడ్ లో షాపులు అన్నీ చుట్టేసి, మాకు విసుగు వచ్చేసినా తనకి ఏమీ నచ్చినవి దొరికేవి కావు. కానీ ఏ మాట కి ఆ మాటే చెప్పుకోవాలి.. అక్క సెలెక్షన్ బాగుంటుంది.

నేను షాప్ కి వెళ్ళాను అంటే, ఏమీ కొనకుండా బయటకి వచ్చేస్తే షాపు లో మాకు బట్టలు చూపించిన అమ్మాయి/అబ్బాయి మమ్మల్ని తిట్టుకుంటారెమో అన్న భయం! కొంచెం ఇంచుమించు మా అమ్మగారు కూడా అలాగే ఫీల్ అయేవారు. అందుకే, పైన డబ్బాల్లోంచి మడతలు గమ్ముని తీయించరు. పైనుండే చూసి, మరీ నచ్చితేనే మడతలు విప్పి చూపమంటారు. మా సుజి అక్క కీ, మాకు మధ్యరకం. ఎక్కువ సుజీ, అమ్మ వెళ్ళి బట్టలు తెచ్చేవారు. మా సుజి తనకి నచ్చినవి రెండు సెలెక్ట్ చేసి తెచ్చేది. వాటిలో నాకు నచ్చినది నేను తీసుకోగా రెండోది తను తీసుకునేది. నేను ఉద్యోగం చెయ్యటం మొదలెట్టాక కూడా ఇదే తంతు!

ఇంక వాటిని కుట్టించుకొని, అన్నీ చేసి, పండగ కి తయారయ్యేవాళ్ళం కొత్త బట్టలతో. నాకు వున్న మరొక దురలవాటు.. కొత్త బట్ట ఇంట్లో వుంది అంటే, ఇంక వున్న పాత బట్టలన్నీ రోత పుడతాయి. అది వేసుకునే దాకా ప్రాణం వూరుకోదు! చాలా సార్లు అసలు పండగ రోజుకి అంతా కొత్త బట్టలు వేసుకుంటే, నా కొత్త బట్టలు అప్పటికే తగిలించేయటం, అది వాషింగ్ మిషన్ కి వెళ్ళిపోవటం కూడా జరిగేది! అందుకే సాధ్యమైనంత వరకూ నాకు కుట్టిన బట్టలు ఆ రోజువరకూ నా చేతికి దక్కకుండా అమ్మ కాపలా కాసేది.

చవితి ముందు రోజు నాన్నగారు వెళ్ళి పూజ సామగ్రీ అంతా తెచ్చేవారు. అంటే, వినాయకుడి విగ్రహం, పత్రి, పాలవెల్లి కి కట్టడానికి పిందెలూ పట్టుకొచ్చేవారు. అమ్మ వంటింట్లో గోడ మీద చాట కింద వున్న పాలవెల్లి తీసి, తోమి, దానికి కొత్త పురికోసలు కట్టి, పసుపు రాసి పెరట్లో రోలుకి అనించి ఎండ తగిలేలా ఎండబెట్టేది. ఆ పని చేసినప్పుడు అక్కడ దగ్గర్లో "బట్టలు ఆరెయ్యద్దు, పసుపు అంటుకుంటుంది" అని అందరికీ చిలక్కి చెప్పినట్టు చెప్పేది.

* * *

పొద్దుటే లేవగానే, అమ్మ మడి బట్ట ఆరేయటానికి అందరినీ బట్టలు తీసి ఇవ్వమని అడిగేది. మేం ఇచ్చిన బట్టలని తడిపి, మా పూజ టైము కి ఆరటానికి అని, పై మేడ మీద నేల మీద పరచి ఆరేసేది. తను మాత్రం తడి బట్ట తో (తడి బట్ట అయితే, ఏమన్నా ముట్టుకున్నా దోషం వుండదు అని!) తిరిగేసేది.

మా అందరి స్నానాలూ అయ్యేసరికి అమ్మ, అమ్మమ్మ ఉండ్రాళ్ళు, వంట సగం పూర్తి చేసేసి వుండేవారు. కుడుముల కోసం చేసిన కొబ్బరి లస్కోరా కమ్మటి వాసన తో ఇల్లంతా నిండిపోయేది. ఆ వేడి మీద లస్కోరా అంటే నాకు చాలా ఇష్టం. అది చల్లారిపోతే బాగోదు అనిపిస్తుంది. అందుకే అమ్మా దగ్గరలో లేకపోతే, ఒకటో రెండో లస్కోరా వుండలు నొక్కేసేదాన్ని. అమ్మ చూస్తే, దేవుడికి నైవేద్యం పెట్టకుండా వాటిని తిననివ్వదు మరి!

ప్రతీ పండగ కీ విధిగా జరిగే వాదన, మీమాంశ.. కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోవాలి అని! అమ్మ అయితే, పొద్దుతే పనులూ అవీ వుంటాయి, బట్టలు పాడయిపోతాయి కనుక భోజనాలు అయ్యాక మధ్యాహ్నం వేసుకోమని చెప్పేది. కానీ మాకు ఆ మాటలు తలకి ఎక్కుతాయా? వాదన వేసుకొనేవాళ్ళం. సాధారణం గా అమ్మే నెగ్గేది. లేకపోతే, ఒకోసారి మేము కొత్త బట్టలు వేసుకోవటానికి "నాకు బయట పని వుంది.. పాత బట్టలు వేసుకొని ఎలా వెళ్ళను?" అని దబాయించి కొత్త బట్టలు వేసుకొని, అది ప్రదర్శించటానికి నాలుగు రోడ్లూ, వీలయితే ఫ్రెండ్ ఇల్లూ చుట్టి వచ్చేవాళ్ళం.

నాన్నగారు స్నానం కి వెళ్ళేముందు పెరట్లో మామిడి చెట్టు ఎక్కి మామిడాకులు, మేడ మీద బాల్కనీ లోంచి జామచెట్టు ఆకులూ, మేడ మీద డాబా మీదనుంచి మునగ చెట్టు ఆకులూ, ఉసిరి చెట్టు ఆకులూ, సీతాఫలం చెట్టు ఆకులూ తెంపి ముందు గదిలో తెచ్చి పడేసేవారు. తను స్నానం చేసి వచ్చేలోగా, గుమ్మానికి తోరణం కట్టి రెడీ చెయ్యమని మాలో ఎవరో ఒకరికి పురమాయించేవారు. ఒకళ్ళకి దొడ్లో వున్న పువ్వుల మొక్కల పువ్వులని కొయ్యమని ఆర్డర్ వేసేవారు. నేను పని దొంగ ని.. సాధారణం గా పని టైము కి మనం గాయబ్. అది జరగనప్పుడు నాకు ఇష్టమైన పని నాన్నగారితో కలిసి పాలవెల్లి అలంకరించటం.

"అందులో ఎముందీ?" అని తేలిగ్గా తీసిపారేయకండి. దానికి బరువు అన్ని వైపులా సమానంగా వుండేటట్టు కట్టడం, పైన వేలాడటానికి కట్టిన పురికోసలు కూడా అందంగా కనపడేలా అలంకరించటం ఒక సరదా. TV లో వచ్చే వినాయకచవితి ప్రత్యేక కార్యక్రమాలు చూస్తూ, ముందు గదికీ మధ్య గదికీ మధ్య లో వున్న గడపకి వున్న కొక్కెం కి పాలవెల్లి ని వేలాడదీసి నాన్నగారు అడిగినవి అందిస్తూ, పత్రి లో వున్న కన్నాలు పడ్డ ఆకులని తీసేయటం, మధ్యలో మడి కట్టుకొని వంట చేస్తున్న అమ్మ ఏదైనా కావలసి వచ్చి పిలిస్తే, TV హోరు లో వినిపించుకోకపోతే, పిలిచి పిలిచి అమ్మ గొంతు నొప్పి పెట్టి, ముందు గది దగ్గరకి వచ్చి మా అందరికీ అక్షింతలు వేసి, చరచరా వెళ్ళిపోవటం, అమ్మ కి కోపం వచ్చింది అని గ్రహించి వెళ్ళి బతిమాలటం.. ఎలా మర్చిపోగలను?

వంట పూర్తి అవగానే, అమ్మ వచ్చి చెప్పేది.. వంట అయింది. పూజకి అన్నీ సిద్ధం చెయ్యండి అని. పైకి వెళ్ళి, మా అందరి మడి బట్టలనీ తెచ్చి, మా మిషను గది (అంటే, నా చిన్నప్పుడు ఆ గదిలో అమ్మ కుట్టు మిషను వుండేది. మెట్ల కింద గది. ప్రస్తుతం దానిలో మా టూల్స్, సైకిళ్ళు వుంటాయి. ఇవి కాక, మనిషి నడవటానికి సందు వుంటుంది. ఒక రకంగా స్టోర్ రుం) లో వేసేది. అందరమూ మడి కట్టేసుకునేవాళ్ళం కాదు. ఎవరో ఒకళ్ళు ముందు మడి బట్ట కట్టుకొని, పూజ కి మడిగా వుండి చేయాల్సిన ఏర్పాట్లు చేసేవాళ్ళం. అంటే, అందరికీ పూజ కి చెంబు లతో మంచి నీళ్ళు పెట్టడం, పీటలు వెయ్యటం, వత్తులూ, వాటిలోకి నూనె వెయ్యటం, పత్తి నుండి వచ్చిన దూది తో పసుపు, కుంకుమ కలిపి పూజ లో వుపయోగించే వస్త్రం ని పోలిన బిళ్ళలు, యజ్ఞ్యోపవీతం తయారు చేయ్యటం లాంటివి. అమ్మ ఘుమఘుమలాడుతున్న, ఆవిరి కక్కే ఉండ్రాళ్ళూ, కుడుములూ తెచ్చి ఒక పక్క గా మూత పెట్టి పెట్టేది నైవేద్యానికి.

అన్నీ సిద్ధం అయ్యాక, ఇంట్లో అందరం పూజకి కూర్చునేవాళ్ళం. ముందు శ్లోకాలతో క్లిష్టంగా వుండే మంత్రాలు అన్నీ అమ్మ చదివేది. తను మాత్రం పూజ మాతో కలిసి చేసేది కాదు. చివరన దీపం వెలిగించుకునేది. పూజ అయ్యాక కధ మాత్రం మాలో ఎవరో ఒకరు చదివేవాళ్ళం. మాకు క్లిష్టమైన తెలుగు చదవటం వస్తుందని ఒకోసారి స్తోత్రం కూడా మాచేత చెప్పించేవారు. అది చదవటం అంటే ముగ్గురికీ మహా సరదా! ఎవరు అస్సలు తప్పులు లేకుండా చదువుతామో అని ఉత్సాహంగా వుండేది.

పూజ అయ్యాక, "శ్రద్ధగా చదువు రావాలని దేవుడిని కోరుకోండి" అని ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా చెప్పేవారు. మేము మాత్రం మా మనసులో కోరికలు కోరుకొని, అప్పటికి ఇంక ఆకలి మీద మహా జోరుగా వుండి ఎప్పుడెప్పుడు అమ్మ దీపం పెట్టుకుంటుందా.. ఎప్పుడెప్పుడు తిండి మీద ఎగబడదామా అన్నట్టు ముళ్ళ మీద గడిపేవాళ్ళం.

భోజనానికి కూర్చునే ముందు నాన్నగారు "ఉండ్రాళ్ళలోకి మాగాయ పచ్చడి చేసావా?" "నెయ్యి ఇవాళ కాచినదేనా?" ఇలాంటి ప్రతీ వినాయకచవితీకీ వేసే రొటీన్ ప్రశ్నలు అమ్మని వేసి, భోజనానికి కూర్చునేవారు. నాకు కుడుముల కన్నా కమ్మగా వుండే ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. 4,5 తిన్నాక ఇంకా తినబోతూ వుంటే చూస్తే అమ్మ "చాలు.. మళ్ళీ కడుపునొప్పి వస్తుంది.. ఇంక అన్నం తిను" అని హెచ్చరించేది. కానీ మనం ఆగుతామా? అన్నం తో తిన్నవి కాక తరువాత కూడా అటొచ్చి ఒకటీ, ఇటొచ్చి ఒకటి అలా తినకా మానను.. కడుపు నొప్పి రాకా మానదు!

మధ్యాహ్నానికి పక్కింటివాళ్ళూ, ఎదురింటి వాళ్ళూ వాళ్ళింట్లో చేసిన ఉండ్రాళ్ళూ, ప్రసాదం పంపేవారు. వాటిని మధ్యాహ్నం కాఫీతో తింటూ.. ఎవరివి బాగున్నాయో బేరీజు వేసి వాటికి ర్యాంకులు ఇచ్చేవాళ్ళం. ఏది ఏమైనా, అమ్మ చేసే ఉండ్రాళ్ళకి మాత్రం ఏవీ సరి వచ్చేవి కావు.

అదంటి మా ఇంట్లో ప్రతీ ఏడాదీ జరిగే టిపికల్ వినాయకచవితి పండగ!

* * End * *

మీ సూచనలూ సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.