| ఈ పేజీ ని పంపండి |
29-Sept-07
నేను అప్పటికి ఇంకా చికాగో మారథాన్ కోసం ట్రైన్ అవుతున్నాను. నాలుగు నెలలు గా "చెయ్యగలనా? చెయ్యగలనా?" అని సందేహపడిన మీదట అదృష్టమో లేక అతని దురదృష్టమో ఆ రోజు నేను ఓడించాలని అనుకున్న వ్యక్తి ని మా వీకెండ్ లాంగ్ రన్ లో ఓడించాను. చాలా సంతోషపడ్డాను. తనకి మోకాళ్ళు నొప్పి వచ్చి పరుగు ఆపేసాను అని ఆ వ్యక్తి ఎవరితోనో చెప్తున్నప్పుడు "అది నా ప్రతిభ కాదన్నమాట!?" అని నిరుత్సాహం కలిగినా.
నేను ఇంకా ఆ సంతోష క్షణాల్లో జీవిస్తుండగా ఇంకొక రన్నర్ అరిందం మాలో ఎవరికైనా Grand Canyon hike చేసే ఉత్సాహం వుందా? అని అడిగారు. వాళ్ళు ఆరుగురు స్నేహితులు వెళ్దాం అనుకున్నారుట. ఆ రకం గా అన్ని రిజర్వేషన్లు కూడా చేసుకున్నారుట. కానీ ఎవరో మధ్యలో డ్రాప్ అవటం తో ఒక స్థానం ఖాళీ అని చెప్పారు. నేను ఏమీ ఆలోచించలేదు. అనుమానం అల్లా నాకు వర్క్ లో వారం రోజుల శలవు దొరుకుతుందా అని. (మా రిలీజ్ అప్పటికి అవలేదు) శలవు దొరికితే నేను తప్పకుండా వస్తాను అని చెప్పాను. నాకు అదివరకు కాంప్ చేసిన అనుభవం వుంది కానీ హైక్ చేసిన అనుభవమైతే అస్సలు లేదు.
* * *
మర్నాటికల్లా అన్నీ సెటిల్ అయిపోయాయి. శలవు దొరికింది. అరిందం ఉజ్జాయింపు గా ఎంత ఖర్చు అవుతుందో చెప్పారు. నన్ను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోమని చెప్పారు. మేము బయలుదేరుతున్నది అక్టోబర్ ఆఖరి వారం లో. అప్పటికి చలి పెద్దగా వుండదు. అయినా Grand Canyon లో చలి ఏమిటి లెండి! (అది అప్పుడు నేను ఆలోచించిన విధం). హైకింగ్ చెయ్యాలంటే అవసరమైన సామగ్రీ ఏదీ నా దగ్గర లేదు అని చెప్తే, అరిందం చాలా వరకు అద్దెకి దొరుకుతాయి. లేకపోతే తను ఎలాగూ REI కి వెళ్ళలి. వెళ్ళినప్పుడు నేను కూడా వస్తే కలిసి షాపింగ్ చేయవచ్చు అన్నారు.
* * *
అక్టోబర్ 27 న ఉదయం నా Phoenix Flight. ఆ తరువాతి వారాంతాలు మొత్తం షాపింగ్ తో గడిచిపోయింది. ఈ ట్రిప్ కోసం నేను కొన్నవి Diva 50 Backpack, Cat Meao Women's Sleeping Bag (20F), REI Hiking Shoes, మెటల్ మగ్, మెటల్ bowl (వంట దీనిలో చేయచ్చు అనుకున్నాను కానీ మరొక వ్యక్తి తెచ్చిన టీపాల్ గిన్నె అందరం ఉపయోగించాం), స్టీల్ స్పూన్ (పొడవు హేండిల్ వున్నది. అందరికీ చాలా ఉపయోగపడింది. మిగిలిన వారు ప్లాస్టిక్ స్పూన్ తెచ్చారు. కానీ వండేప్పుడు కలపటానికి మెటల్ ది అవసరం కదా), హెడ్ లైట్ (అత్యవసరం), బేటరీ లైట్ (హెడ్ లైట్ వుండటం వలన అసలు దీనిని ఉపయోగించలేదు), Canon PowerShot 10x కెమెరా (దీనికి LCD view ఒక్కటే వుంది. కనుక extra బేటరీ లు చాలా అవసరం.) రాత్రి పూట చలి ఎక్కువ వున్నప్పుడు వేసుకోవటానికి లైట్ థర్మల్స్ (అసలు ఉపయోగించలేదు). నేను తీసుకెళ్ళటం మరచినవి, మిస్ అయిన వాటిల్లో హైకింగ్ సాక్స్, బాండేజ్.
27-Oct-07 శనివారం
ప్రొద్దుట ఆరు గంటలకి ఫ్లైట్. Phoenix చేరేసరికి పదిన్నర అయింది. పదకొండున్నర కి తులిక ఫోన్ చేసారు "ఎక్కడ వున్నవ్?" అని. నాకు అరిందం తప్ప వేరే ఎవరూ తెలియరు. రాహుల్, తులిక లతో పరిచయాలు, ప్రయాణం బాగా జరిగిందా వగైరా కుశలప్రశ్నలు అయ్యాక అరిందం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. వాళ్ళు సియాటిల్ ASHA లో అరిందం ని కలిసారుట. అరిందం ఇప్పుడు మాతో ఇక్కడ బోస్టన్ AID-ASHA Team తో చికాగో మారథాన్ కోసం train అయ్యారు. మా ఉద్యోగాల గురించీ, ASHA గురించీ, చికాగో మారథాన్ డ్రామా గురించీ మాట్లాడుకుంటుండగానే అరిందం flight కూడా వచ్చింది. రెంటల్ కార్ తీసుకొని Flagstaff కి బయలుదేరాం.
దారిలో ఎక్కడ చూసినా ఎడారి లుక్! Flagstaff దరిదాపుల్లో కొద్దిగా చెట్లు కనపడ్డాయి. అక్కడకి చేరుకునేసరికి ఆరున్నర అయింది. Days Inn లో రాత్రి మజిలీ. అందరం ఏం తినాలీ అని చూస్తుంటే ప్రక్కనే IHOP, ఎదురుగా ఒక ఇండియన్ రెస్టారెంట్ (Delhi Palace) కనపడ్డాయి. ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేస్తూ బోస్టన్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న అశోక్, మిగిలిన గాంగ్ కి ఫోన్ చేసాము. ఇక్కడ మాతో హైకింగ్ కి వస్తున్న శ్రీజన్, శ్రీనివాస్ లు LA నుండి బయలుదేరాం దారిలో వున్నాం అని ఫోన్ చేసి చెప్పారు. ఎదురుగా ఎదో Sports Goods Store కనపడితే మళ్ళీ ఆఖరి నిమిషం షాపింగ్!
శ్రీజన్, శ్రీ లు వచ్చేసరికి దాదాపు పది అయింది. వాళ్ళు వచ్చే లోపు మేము Lowell Observatory కి వెళ్ళాం. ఇక్కడే 1930 లో Clyde Tombaugh ప్లూటో గ్రహం ని కనుగొన్నారు. దానికి ఆయన ఉపయోగించిన టెలిస్కోప్ ఇంకా ఇక్కడ వుంది. కానీ మేము వెళ్ళిన సమయం లోనే మబ్బులు ముంచుకుని రావటం తో మాకు ఆకాశం లో పెద్దగా ఏమీ కనిపించలేవు అని చెప్పారు అక్కడి సైంటిస్ట్ లు. Observatory నుండి హోటల్ కి వచ్చి మా backpack లు మరోసారి సర్దుకున్నాం. పొద్దుటే లేచి South Rim కి వెళ్ళాలి. అక్కడ నుండి మా Grand Canyon adventure మొదలు అవుతుంది.
28-Oct-07 ఆదివారం
ఉదయం తొమ్మిదిన్నర కి బయలుదేరి South Rim చేరుకునేసరికి దాదాపు పన్నెండు అయింది. పన్నెండున్నర కి అక్కడ నుండి షటిల్ తీసుకొని Grand Canyon National Park కి వెళ్ళాలి. South Rim లో మా కార్లు పార్క్ చేసి మేము అక్కడ నుండి మా ప్రయానం మొదలు పెడతాము. మేము hiking North Rim దగ్గర మొదలు పెట్టి South Rim దగ్గర ముగిస్తాం. తిరిగి వచ్చి ఇక్కడ పార్క్ చేసిన కారు తీసుకొని Flagstaff, అక్కడ నుండి Phoenix వచ్చి, తిరుగు flight పట్టుకోవాలి. అది వారం తరువాతి మాట!
తినటానికి బేగిల్ తప్ప South Rim లో ఏమీ దొరకలేదు. దొరికినవే పుచ్చుకొని మా వేన్ ఎక్కాము అందరమూ. మాతో పాటు ఆ వేన్ లో GC hiking ఒంటరిగా పూర్తి చేసిన ఒకవిడ వచ్చారు. ఆమె పేరు అడగటం మర్చిపోయాను! మా వేన్ driver పేరు Trisha. ఆమె అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి. ఆ ప్రదేశం అంటే చెప్పలేనంత అభిమానం కల వ్యక్తి. California Condor ల గురించీ, వాటి సమ్రక్షణ ప్రోజెక్ట్ గురించీ మాకు దారిలో వివరించారు. Forest Fires గురించి బాధ పడ్డారు. Hiking చేసేప్పుడు మేము తీసుకోవల్సిన జాగర్తలు మాకు గుర్తు చేసారు. మమ్మల్ని క్షేమం గా ఆ రాత్రి మజిలీ Jacob's Lake Inn దగ్గర దింపారు. ఇక్కడ elevation 7980 ft.
Jacob Lake Inn లో వుండటం ఇష్టం లేని వాళ్ళు దగ్గర్లో వున్న camp ground లో camp చెయ్యవచ్చు. కానీ మేము ఈ ఒక్క రోజూ మెత్తని పరుపుల మీద నిద్రోదాం రేపటి నుండీ ఎలాగూ రాళ్ళూ రప్పలూ, చలీ తప్పవు అని అనుకున్నాం. భోజనం అక్కడే వున్న రెస్టారెంట్ లో చేసి అందరూ ముక్కలాట మొదలు పెట్టారు. నాకు Solitair తప్ప వేరే ఏవీ card games రావు. నాకు Judgement నేర్పించారు కానీ నేను ఏ రకమైన card game కీ పనికిరాను అని త్వరలోనే గ్రహించేసారు. నేను కూడా రేపటి నుండీ నిద్ర వుంటుందో వుండదో అని వెళ్ళి నిద్రపోయాను. పొద్దుటే ఏడున్నర కి మమ్మల్ని North Rim దగ్గరకి తీసుకువెళ్ళే shuttle వస్తుంది.
29-Oct-07 సోమవారం
పొద్దుటే ఆరుగంటలకి రెస్టారెంట్ లో breakfast చేయటానికి రెస్టారెంట్ లో కలిసాము. నేను ముందు రోజు world series game లో Red Sox ఏ score తో గెలిచిందో match వివరాలు తెలుసుకోవటానికీ కొంచెం ముందే రెస్టారెంట్ కి వచ్చేసాను. Red Sox World Series Champions!
ఏదున్నర కి మా వేన్ బయలుదేరింది. ఈయన కూడా ఆ ప్రాంతం లో పుట్టి పెరిగిన వ్యక్తి. Forest Fires గురించి దిగులు పడే మనిషి. తన చిన్నప్పటి కాలం నుండీ ఇప్పటికి ఎన్ని చెట్లు ఈ మంటల వలన నాశనం అయిపోయాయో ఆ ప్రాంతం 300 సంవత్సరాల వరకూ ఏ విధం గా బీడు గా మిగిలిపోతుందో బాధపడుతూ వివరించారు. కొన్ని సార్లు forest fires ని అదుపు లో వుంచటం కోసం చిన్న చిన్న ఎండిపోయిన చెట్లూ, మొక్కలని controlled forest fires ద్వారా కాల్చేస్తారుట. ఈయనకి అది కూడా నచ్చదు! ఒకసారి హోరు గాలి లో ఈ controlled forest fire operation మొదలెట్టి అది కాస్తా అదుపు తప్పటం తో ఎన్నో ఎకరాల విస్తీర్ణం లోని చెట్లు నాశనం అయిపోయాయి అని చెప్పారు. ఆయనకి మండిన విషయం, హోరు గాలి లో మంతలని అదుపు చెయ్యటం కష్టం అని తెలిసినా తమ schedule లో ఆ plan వున్న కారణం చేత అధికారులు మంటలని మొదలు పెట్టి ఎన్నో జంతువుల మరణానికి కారణం అయ్యారు అని చెప్పారు. అలాగే, తన కుటుంబ పోషణ కి తనకి పని కావాలని ఒక fire fighter మొదలు పెట్టిన మరొక forest fire వలన నాశనం అయిన అటవీ ప్రాంతం ని కూడా చూపించారు.
పావుతక్కువ తొమ్మిది గంటలకి మమ్మల్ని North Rim లోని Trailhead దగ్గర విడిచారు. 9:02 గంటలకి అక్కడ నుండి hiking మొదలు పెట్టాము. వీపు మీద బరువు కొంచెం కొత్తగా వుంది. ఇంకా అలవాటు కాలేదు. కానీ ఉత్సాహం వలన ఇబ్బంది ని పెద్దగా గమనించలేదు. పైగా దారి చాలా steep గా వుంది. మోకాళ్ళకి శ్రమ ఇవ్వకూడదు అని జాగర్త గా నడవటం లో ఈ ఇబ్బంది ని పట్టించుకోలేదు కూడా. పైనుండి మాకు క్రింద లోయలలో అంతా పొగ కనపడింది. అది పొగ మంచు అని కొందరూ, కాదు పొగే అని కొందరూ అన్నారు. మొత్తానికి అది పొగే (దగ్గర్లో controlled forest fire ఒకటి నడుస్తోంది అని మా driver అంతకుముందు చెప్పారు) అని conclusion కి వచ్చాం. మొదటి రోజు మొత్తం elevation loss 5000ft. నడవాల్సిన దూరం 6.8 మైళ్ళు. రాత్రి మజిలీ Cottonwood camp ground లో.
దారిలో ఒక చోట Roaring Springs కి దారి అని ఒక బోర్డ్ కనపడింది. అప్పటికి సమయం రెండు అంతే. Cottonwood ఇంకొక గంటన్నర లో వెళ్ళిపోతాం. ఇంత తొందరగా వెళ్ళి ఏం చేస్తాం, ఈ Roaring Spring ఏమిటో చూద్దాం అన్నారు మిగిలిన వాళ్ళు. Backpacks అక్కడే trail మీద ఓ పక్కగా పెట్టి వెళ్ళలి అని ప్లాన్. నాకు పాస్ పోర్ట్ వగైరా ముఖ్యమైన పేపర్లు వున్న backpack అక్కడ అలా వదిలేయటం కొంచెం tension తెప్పించినా, గుంపుతో గోవిందా అని నా బేగ్ కూడా అక్కడ పెట్టేసి Roaring Springs చూడటానికి వెళ్ళను.
చూస్తే, అక్కడ ఏ రకమైన spring లేదు! వున్నదల్లా ఒక Paper Towel లేని rest room, ఒక మంచి నీళ్ళ కుళాయి. అక్కడే కాసేపు కూర్చుని, ఫొటోలు తీసుకొని Cottonwood దిశ గా మా ప్రయాణం కొనసాగించాము.
Camp ground దాదాపు వచ్చేసాం అనుకుంటుండగా నాకు భుజాలు విపరీతమైన నొప్పి పెట్టడం మొదలెట్టాయి. నాకు అర్థం కాలేదు ఎందుకు అంత నొప్పి హటార్తుగా మొదలు అయిందో. కొంచెం సేపు ఒక రాయి మీద కూర్చుని, కొంచెం నీళ్ళు తాగి వెళ్దాం అని చూస్తే అర్థం అయింది ఎందుకు భుజాలు నొప్పి చేస్తున్నాయో! Roaring Springs నుండి వచ్చేప్పుడు backpack ఎత్తుకున్నప్పుడు chest strap పెట్టుకోవటం మర్చిపోయాను. దానితో బరువు అంతా వెనక్కి వాలి భుజాలు నొప్పి చేశాయి. Well.. అదొక పాఠం!
Camp ground చేరుకునేసరికి నాలుగున్నర అయింది. ఇక్కడ త్రాగే నీరు లేదని ముందు రోజే తెల్సింది. దగ్గర్లో వున్న stream నుండి నీరు తెచ్చుకొని ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళ కోసం ఏటికి వెళ్తే అక్కడ సమయమే తెలియలేదు. అంత అద్భుతం గా వుంది అక్కడ. ఆ ఐస్ నీళ్ళలో పాదాలు పెట్టగానే రోజంతా పడిన నొప్పులు అన్నీ మాయం అయిపోయినట్టు అనిపించింది. మా వెనకాల వచ్చిన ఒక Texas గ్రూప్ తో మాట్లాడుతూ అక్కడ కొంత సేపు కాలక్షేపం చేసాక చీకటి పడుతుండగా మా camp site కి తిరిగి వచ్చాం. ముందు Tents వేసుకొని, తర్వాత వంట ప్రయత్నాలు మొదలు పెట్టాం.
వంట అంటే ఏమీ లేదు. నీళ్ళు వేడి చేసి backpacker's food పేకెట్ లో పోసి ఓ పది నిమిషాలు వుంచి దానిని తినటం. దానికే ఓ పెళ్ళి విందు భోజనం తయారు చేసేంత హడావిడి పడి మరొక గంట కాలక్షేపం చేసాం. తర్వాత ఆహార పదార్థాలూ, సెంట్ కల వస్తువులు అన్నీ అక్కడ ground లో వున్న బాక్స్ లో పెట్టి, మరొక దానిలో మా విడిచిన సాక్స్, garbage పెట్టి ఏ జంతువూ తీయకుండా జాగర్త చేసాం. బేగ్ లూ, షూ లూ camp site లో వున్న ఎత్తైన రాడ్ లకి వేలడగట్టాం. అలా చేస్తే deers వగైరా వాటి జోలికి రావుట. అంతకు పూర్వం ఎప్పుడో ఈ ప్రకారం చేయనప్పుడు అడవి deers జనాలు తిని వదిలి వెళ్ళిన junk తిని జబ్బు పడ్డాయిట. అవి ఏమీ తినలేక ఇబ్బంది పడుతుంటే దాదాపు 20 జింకలని shoot చేసి చంపేసారుట. తరువాత వాటిని తెరిచి చూస్తే లోపల ప్లాస్టిక్ సంచీలూ, మనుషులు వాడే రకరకాల వస్తువులు కనపడ్డాయిట. ఆ విషయం camp site లో వున్న storage box ల మీద రాసి వుంది.
ఆయ్యో అని వాటి గురించి బాధ పడి మర్నాడు ఎవరి garbage వాళ్ళు జాగర్త గా మొత్తం camp site చూసి ఏరి తీసుకెళ్ళాలి అని మరోసారి గుర్తు చేసుకున్నాం. రాత్రి అందరూ మళ్ళీ పేకాట మొదలెట్టారు. కానీ నేను నిద్రపోయాను. అయినా రాత్రి 8.00 గంటల తరువాత అక్కడ silent hours.
30-Oct-07 మంగళవారం
పొద్దుటే అందరి కన్నా ముందు రాహుల్ లేచి మిగిలిన వాళ్ళని లేపే పని మొదలెట్టారు. నేను మరోసారి stream దగ్గరకి వెళ్ళి కూర్చున్నాను. ఓ అరగంట తరువాత మా జనాలు నిద్రలు లేవటం చూసి వంట కోసం, ఇతర అవసరాల కోసం నీళ్ళు తీసుకుని వచ్చాను. దంతధావన కార్యక్రమం అయ్యాక కాఫీ ప్రయత్నాలు మొదలెట్టాం. నేను ముందు రోజు Flagstaff హోటల్ లో నుండి కాఫీ కోసం sugar, coffee, milk powder లు దొంగిలించాను. కానీ వాటి అవసరం లేకుండా శ్రీజన్ పూర్తి బందోబస్తు తో వచ్చారు. అందరం మా మేగీ నూడిల్స్ బయటకి తీసాం. అది వండుకొని తిని, తీసుకెళ్ళటానికి మంచి నీళ్ళు శుభ్రపర్చుకొని, అన్నీ సర్దుకొని మా garbage కలెక్ట్ చేసుకొని బయలుదేరేసరికి పదిన్నర!
అక్కడ Grand Canyon లో ప్రతీ చోట ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య ప్రయాణించద్దు అని వుంటుంది. కారణం ఇక్కడ 120 తాకే ఉష్ణోగ్రత. మేము వెళ్ళింది అక్టోబర్ నెలాఖరులో కనుక పెద్దగా ఎండ లేదు. నవంబర్ నెల మొదలే కనుక పెద్దగా చలీ లేదు. అక్కడ guidelines ని break చేసే వుద్దేశం ఏమాత్రం లేనప్పటికీ అదేమిటో మేము ఎప్పుడూ ఆ వద్దు అన్న టైము లోనే hike చేసాం. మా తదుపరి మజిలీ Bright Angel Camp Ground. ఈ రోజు నడవాల్సిన దూరం 6.75 మైళ్ళు, elevation loss 1500 ft. ముందు రోజు elevation తో పోలిస్తే తక్కువ కనుక very easy అనుకున్నాం.
కానీ ఆ రోజు అంతా పైకీ కిందకీ వెళ్ళటం. కానీ మా ప్రయాణం దాదాపు మొత్తం Bright Angel Stream వెంబడే. దాని వలన చల్లని గాలి. దారి లో కొంత దూరం వెళ్ళేసరికి ఒక చోట దారి రెండు గా చీలి కనిపించింది. మా ముందూ వెనుకా ఎవరూ లేరు దారి తెల్సిన వాళ్ళు. మేము map ఏదీ తీసుకురాలేదు. దారిలో రాళ్ళతో ఎవరో NO అని రాసారు. మాకు అదేమిటో అర్థం కాలేదు. సరే ఇది దారి కాదేమో అని అనుమానం వచ్చింది. రెండో దాని వైపు వెళ్తే అక్కడ కూడా దారిలో రాళ్ళతో ఏదో రాసి వుంది. కానీ ఎవరో దానిని చెరిపేసారు. కనుక అదేమిటో అర్థం కాలేదు. కొంచెం ముందు కి వెళ్తే మరొక దారి కనిపించింది. సరీ అని మూడో దారి పట్టుకొని కొంచెం ముందు కి వెళ్తే ఆ దారి అంతా ఆరు అడుగుల ఎత్తు పెరిగిన గడ్డి. క్రింద నీరు, బురద. ముందు దారి ఏమిటో కనిపించటం లేదు. బరువులతో వెళ్ళటానికి భయపడుతూ కొంచెం ముందు కి వెళ్తే trail కనపడింది. కానీ అక్కడ మళ్ళీ NO అని రాసి వుంది. ఎవరన్నా వేళాకోళం గా అది రాసారేమో అని అనుమానం వచ్చింది. చెట్లు వున్న మరొక వైపు చూపిస్తూ ఒక arrow వుంది. సరే ఇదేమిటో చూద్దాం అని ఆ arrow చూపిస్తున్న దిక్కు లో వెళ్ళాం. అంతా బురద! బురద లో చీదరించుకుంటూ, shoes పాడయిపోతాయి అని భయపడుతూ (అందరివీ water proof shoes అయినా) కొంత దూరం వెళ్తే మళ్ళి trail కనపడింది. కానీ trail కీ మాకు మధ్య లో పెద్ద పెద్ద బండ రాయిలు వున్నాయి. కొంచెం slip అయినా పక్కన వున్న stream లో పడతాం. బరువులతో అబ్బాయిలు బాగానే వెళ్ళిపోయారు కనీ నాకు కొంచెం కష్టమే అయింది.
ఎలాగో ఆ రాళ్ళెక్కి trail మీదకి వచ్చాం. కానీ అంతలోనే పక్కనే అత్యద్భుతమైన scene. మేమందరమూ అలసిపోయి వున్నాం. ఆకలి వేస్తోంది. పక్కనే నీడ తో చల్లటి నీరు తో పారుతున్న stream. అక్కడే బరువులు దించుకొని కొంత సేపు shoes కూడా విడిచి నీళ్ళలో గడిపాము. ఆ ప్రశాంతత ని వర్ణించలేను! ఓ అరగంట తరువాత కదిలి మళ్ళీ నడక మొదలెట్టాం. Ribbon Falls detour తీసుకోవాలని ప్లాన్.
ముందు రోజు ధైర్యం తో ఈ రోజు నా బేగ్ trail మీద వదిలి వెళ్ళటానికి ఏమీ భయం వేయలేదు. రిబ్బన్ ఫాల్స్ అంటే ముందు రోజు roaring spring లాగ తుస్సు మంటుందేమో అని అనుమానం తోనే వెళ్ళాను. కానీ నా అంచనాలకి పూర్తిగా వ్యతిరేకమైన అనుభవం అక్కడ. మరొక సుందర దృశ్యం! ఫాల్ పై వరకు వెళ్ళిన వాళ్ళం మేము ఒక్కళ్ళమే. అక్కడ చాలా మంది వున్నప్పటికీ అంతా క్రింద ఫాల్స్ చివరే వున్నారు. మేము కొండ ఎక్కి పైదాకా వెళ్ళాం. దాని వలన అద్భుతమైన photos తీసుకోగలిగాం.
ఒక గంట Falls దగ్గర గడిపి తిరిగి వచ్చేప్పుడు దారి తప్పాం. మేము నడుస్తున్న Kaibab Trail కి దారి కనపడలేదు. దారి అంతా Amazon అడవి మాదిరి ఎత్తైన గడ్డి, చెట్లు, పారే నేరు తో నిండి వుంది. నీళ్ళలో నడవలేము. చెట్ల మధ్య దారి కనపడటం లేదు. ఇంక దారి పక్కన వున్న బండలు ఎక్కుతూ వెళ్ళాలి. రాహుల్ చకచకా వెళ్ళిపోయారు. అందరూ తలో దారి పట్టాం trail వెతుకుతూ. కానీ అందరం ఒకే దగ్గర, అదే బండల మీద తేలాం. భయపడుతూనే బండలు మీద డేకుతూ ఎలాగో మా బేగ్ లు వదిలివెళ్ళిన చోటికి వచ్చాం. అక్కడే నాకు కొంచెం భయం వేసింది.
ఎదురుగా వస్తున్న hikers ని bright angel camp ground ఎంత దూరం అని అడిగితే తాము Phantom Ranch నుండి వస్తున్నామనీ, అక్కడ నుండి bright angel camp ground ఒక మైలు దూరం వుంటుందని చెప్పారు. మేము వెళ్ళే camp ground దగ్గర mules rest stop కూడా. దారి మొత్తం వాటి విసర్జితాలతో కొంచెం చీదర గా వుంది. వాసన కూడా! చీకటి పడుతుండగా అలసి పోయి bright angel camp ground చేరుకున్నాం. ఇక్కడ త్రాగే నీరు వుంది కనుక ఆ బెంగ లేదు.
ముందు tent లు వేసుకొని వంట ప్రయత్నాలు మొదలు పెట్టాం. మేము మా తినటాలు పూర్తి చేసేసరికి చుట్టుప్రక్కల అన్ని camp sites లో జనాలు పూర్తిగా నిద్రపోయారు. మేము తప్ప ఎవ్వరూ మెళకువ లేరు. దానితో మేము కూడా గుసగుసల స్థాయి లో మాట్లాడుకుంటూ పడకలు వేసాము. నేను అరిందం తో tent share చేసుకున్నాను. రాత్రి మా camping permit చూడటానికి వచ్చిన ranger ని colorado river అక్కడకి ఎంత దూరం అని అడిగారు శ్రీజన్. ఒక అరమైలు వుంటుందనీ, ఇంత దూరం వచ్చి, నది లో మునక వెయ్యకుండ వెళ్ళద్దని చెప్పారు ఆయన. మునక సంగతి ఏమో కాని నది ని కనీసం ముట్టుకునే ఉద్దేశం అయితే వుంది అందరికీ. పొద్దుటే లేచి ముందు కొలరాడో రివర్ దగ్గరకి వెళ్ళి వచ్చి అప్పుడూ మా ప్రయాణం మొదలెట్టాలి అని ప్లాన్.
31-Oct-07 బుధవారం
పొద్దుటే త్వరగా లేచి తిని వెళ్ళటానికి ఒక ఇబ్బంది. ఆ రోజు అందరూ ఎవరి నూడిల్స్ వాళ్ళు వేరు వేరు చేసుకోవాలి. కారణం, అందరివీ తలొక బ్రాండు, రకం! ముందు రోజు అందరం Maggie masala తిన్నాం కనుక ఒకేసారి వండుకోవటం వలన చాలా సమయం, fuel ఆదా చేసాము. ఇవాళ అది జరిగే పని కాదు. తినటం పూర్తయేసరికి ఎనిమిది. బట్టలు ఉతుక్కొనే ప్లాన్ ఒకటి తయారయింది. ఉతుక్కోవల్సిన వాళ్ళు బట్టలు జాడించి అరేసాక Colorado River దగ్గరకి బయలుదేరాం.
నీరు అమోఘమైన వేగం తో పారుతోంది అక్కడ. అ నీళ్ళలో వుంటే అసలు సమయం తెలియలేదు. అక్కడ బీచ్ లో 21 రోజులు గా Colarado River మీద బోట్ ల మీద పయనిస్తున్న ఒక బృందం కనపడ్డారు. అది వారి 15వ రోజట! దూరం గా కనిపిస్తున్న Black bridge మీదకి వెళ్ళి photos తీసుకొని మా camp site కి తిరిగి వచ్చాం. అన్నీ సర్దుకుని బయలుదేరేసరికి పన్నెండు అయింది. ఎలాగూ భోజనం టైము అయింది అని మళ్ళీ కొంత సేపు ఆగి ప్రొటీన్ బార్ లేక తినేదేదో తిని బయలుదేరాం.
తరువాతి మజిలీ Indian Gardens ఇవాళ, రేపూ నడక అంతా up-hill. ఇవాళ్టి దూరం 5 మైళ్ళు. elevation gain 1500 ft. నాకు కొంచెం భయం గానే వుంది. రెండు రోజుల్లో backpack బరువు పెద్దగా ఏమీ తగ్గలేదు. దాదాపు మొదలెట్టినంత బరువూ వుంది ఇప్పటికీ. ఎండ లేకుండా వుంటే చాలు అనుకున్నాను. తధాస్తు దేవతలు విన్నారేమో అసలు ఎక్కడా ఎండ లేదు. ఆ మాటకొస్తే ఇంతవరకూ రాత్రి ఎప్పుడూ చలి వేయలేదు. నేను తెచ్చుకున్న ధర్మల్స్ శుద్ధ వేస్ట్!
దారి నేను భయపడినంత కష్టం గా ఏమీ లేదు. నెమ్మదిగా నడిచాము. పైగా ఇవాళ ఎక్కడా detours ఇంక లేవు. అయినప్పటికీ Indian Garden camp ground చేరుకునేసరికి చాలా చీకటి పడిపోయింది. అక్కడ అన్ని sites నిండిపోయి వున్నాయి. దొరికిన దానిలో tent లు వేసుకుని వంట కి నీళ్ళు తేవటానికి వెళ్ళాం. చుట్టూ నల్లని చీకటి, ఆకాశం నిండా నక్షత్రాలతో ఎంతో అందం గా కనిపించింది. దూరం గా చీకటి లో మర్నాడు మేము వెళ్ళబోయే South Rim కనపడింది. చీకట్లో hike చేస్తున్న జనాలు వారి లైట్ల ద్వారా కనిపించారు కూడా. Flagstaff చుట్టు ప్రక్కల కరెంట్ బిల్ తగ్గించటానికీ, ఆకాశం లో నక్షత్రాలని జనాలు చూసేలా చేయటానికి Lowell Observatory లోని కొంత మంది సైంటిస్ట్ లూ, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలూ కలిసి ఒక ఉద్యమం మొదలు పెట్టాయి. దాని ప్రకారం Flagstaff లో ఎక్కడా నియాన్ లైట్లూ, పెద్ద పెద్ద హోర్డింగ్ లూ, street lights కనిపించవు.
camp ground entrance దగ్గర అక్కడకి 1.5 మైలు దూరం లో వున్న Plateau Point నుండి Grand Canyon view చాలా బాగుంటుంది అని నోటీస్ కనపడింది. అక్కడ సూర్యోదయం చూడాలని ప్లాన్. దాని కోసం ఆ రోజు రాత్రి భోజనం త్వరగా ముగించి తొరగా నిద్రోయాం.
01-Nov-07 గురువారం
అయిదున్నర కే లేచి, దంతధావనం కానిచ్చి సూర్యోదయం చూడటానికి Plateau Point కి బయలుదేరాం. దారిలో జింకలు కనిపించాయి. మరొక సుందర దృశ్యం. అక్కడ బోర్డ్ లో చెప్పినట్టు చుట్టు కొండలు, క్రింద జలజలా పారుతున్న Colorado River, పైన ఒక్కర్తీ సంచరిస్తున్న ఒక Raven, నెమ్మదిగా ప్రసరిస్తున్న సూర్య కిరణాలూ ఎంతో అందం గా వుంది. ఎనిమిదిన్నర దాకా అక్కడ వుండి ఆకలి వేస్తుంటే camp site కి తిరిగి వచ్చాం. ఆ రోజు ఆఖరి రోజు. కనుక సాధ్యమైనంత తినేసి బేగ్ బరువు తగ్గించాలి. పైగా ఆ రోజు చాలా కష్టమైన ప్రయాణం. మొత్తం దూరం 4.5 మైళ్ళు, elevation gain 3000ft. Egg, Noodles, బోలెడన్ని nuts తిని, కడుపు పట్టినంత మంచినీరు త్రాగి, ఖాళీ గా వున్న ప్రతీ బాటిల్ నింపుకొని దాదాపు ఒంటిగంట కి బయలుదేరాం.
ఎండ మొఖం మీద కొడుతోంది. ఒక అరమైలు నడిచేప్పటికే చాలా అలసిపోయాం. ఎదురుగా వస్తున్న ఒకతన్ని తరువాత rest area ఎంత దూరం అని అడిగాం (ప్రతి 1.5 మైలు కీ ఒక rest area వుందనీ, అక్కడ త్రాగే నీరు లేదనీ ముందే తెలిసినా) అతను you have loooooooong way to go అని సాగదీస్తూ చెప్పారు. నాకైతే తిక్క రేగింది. అసలే అలుపు తో వున్నాం.. "ఎంతో దూరం లేదు" అని అబద్ధమైనా మమ్మల్ని ప్రోత్సహించటానికి చెప్పే బదులు మరికాస్త భయపెట్టారు!
మరి కొంత దూరం నడిచాక ఎదురుగా వస్తున్న మరొక జంట ని ఈ ఎండ ఎంత దూరం వుంటుంది అని అడిగాం. అదే, నీడ గా వుంటుందా ముందు ముందు అని. దానికి ఆమె ఒక 200 మీటర్లు వెళ్తే మిగిలిన దారి అంతా నీడే అని అన్నారు. కానీ అ 200 మీటర్లూ ఎంతకీ తరగదే!? మామూలు కన్నా ఎక్కువ సార్లు break లు తీసుకుంటూ, nIru త్రాగుతూ నడిచాం. మొదటి rest area దగ్గరకి వళ్తే అక్కడ ఒక shed కనపడింది. నీడ లోకి వెళ్ళి బరువులు దించుకున్నప్పటి రిలీఫ్ అసలు వర్ణించలేను. అక్కడ ఒక ఉడుత మేము తింటున్న nuts కోసం మా దగ్గరకి వచ్చింది. కానీ ఆ ఉడుతలు కరిస్తే రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే ప్రమాదం వుందని అక్కద బోర్డ్ వుంది. కనుక దానిని సాధ్యమైనంత అదిలిస్తూ మేము క్రింద ఏమైనా చిన్న చిన్న బిట్స్ పడేశామేమో అని garbage వెతుక్కుంటూ ఓ పదినిమిషాలు అక్కడ గడిపాం. మళ్ళీ ప్రయాణం మొదలు. దారి నీడగానే వుంది. నెమ్మదిగా మరొక మైలున్నర నడిచాం. రెండో rest area దగ్గరకి వచ్చేసరికి బెంగ, దిగులు మొదలయ్యాయి. Grand Canyon వదిలి వెళ్ళిపోతున్నందుకు. ఆఖరి మైలు అనుకుంటూ దిగులు గా ఆఖరి మైలు నడక మొదలెట్టాం. కానీ, ఆ మైలు ఎంతకీ తరగదే!? దూరం గా దారి చాలా steep గా కనిపించింది. almost నిలువుగా వున్న ఆ దారి వెంట వెళ్ళాలంటే భయం వేసింది. ఇంత నీరసం తో అలా నడవగలమా అని. కానీ ఇంక వచ్చేసాం అని ఒకరికొకరం చెప్పుకుంటూ నడక సాగించాం. ఆ ఆఖరి మైలూ చాలా కష్టం అయింది నడవటానికి. బహుశా అలుపు అయి వుండదు.. ఇంక వచ్చేసాం అనే ఫీలింగ్ అయి వుంటుంది!
అంతవరకూ మా అందరికన్నా ఆఖరున నడుస్తున్న శ్రీ అందరినీ దాటుకుని ముందుకి వెళ్ళిపోయారు. అతని వెనుకే శ్రీజన్. తరువాత నేను, నా వెనుక అరిందం, రాహుల్, తులిక మొత్తానికి అందరం South Rim చేరుకున్నాం. విజయగర్వం తో అందరం ఫొటోలు తీసుకొని మా కారు వున్న చోటుకి నడిచాం. బరువులు దించుకొని అందరూ కారు లో వున్న clean బట్టల్లోకి మారిపోయారు. కానీ నేను Flagstaff వెళ్ళి, స్నానం చెయ్యాలి ముందు అని ఆగిపోయాను.
అక్కడి గిఫ్ట్ షాప్ లో సావనీర్లూ, టీ షర్ట్ లూ కొనుక్కుని, దారిలో మెక్సికన్ వేషధారణ లో వున్న సర్వర్లు వున్న ఒక ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళి కడుపారా భోజనం, ice cream తిని Flagstaff కి బయలుదేరాం. హోటల్ కి చేరేసరికి రాత్రి తొమ్మిది అయింది. స్నానాలు చేసి నిద్ర పోయేసరికి పది.
02-Nov-07 శుక్రవారం
పొద్దుటే లేచి breakfast చేసి Meteor Crator సైట్ కి వెళ్ళాలని ప్లాన్. నా sun glasses ఆ రోజు విరిగిపోయాయి. cap తెచ్చుకోవటం మర్చిపోయాను. ఎండ తీవ్రం గా వుంది. Meteor site కి అరమైలు నడక. మాతో ఒక పెద్ద వయసు జంట వచ్చారు. ఆయన సగం దూరం వచ్చాక నేను ఇక్కడ వుండిపోతాను మీరు వెళ్ళండి అన్నారు కానీ మా guide మిమ్మల్ని ఒక్కరినీ ఇలా వదిలి నేను వెళ్ళను అని మమ్మల్ని కూడా వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంతకీ ఇక్కడ 50 వేల సంవత్సరాల క్రితం భూమి ని తాకిన meteor వలన ఇక్కడ 2.5 మైళ్ళ వైశాల్యం తో gaint hole ఏర్పడింది. దానిని ఏ విధం గా ఒక construction company develop చేసింది guide వివరించారు.
ఆ సాయంత్రం Phoenix బయలుదేరి వెళ్ళిపోయం. శ్రీజన్, శ్రీ LA వెళ్ళిపోయరు. మర్చిపోలేని అనుభవాలు మూటకట్టుకొని బోస్టన్ flight కోసం airport కి వెళ్తే బోస్టన్ లో హరికేన్ అని news లో చూసాను. Atlanta వచ్చాక బోస్టన్ flight కాన్సిల్ అయింది అని తెలిసింది. Atlanta లో ఒక రోజు గడిపి మర్నాడు బోస్టన్ వచ్చాను.
మధ్య లో చాలా వివరాలు చెప్పకుండా వదిలేసాను. ఇప్పటికే చాలా పెద్దది రాసాను అని అనుమానం తో. మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్రశ్నలు వుంటే రచ్చబండ లో అడిగితే సాధ్యమైనంత వరకూ సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. లేకపోతే నాకు surya at suryakumari dot com కి మైల్ చేయండి.
http://www.nps.gov/grca/
http://www.lowell.edu/
http://www.meteorcrater.com
Some Pictures
|
|
* * End * *
|
|
|
మీ సూచనలూ, సలహాలూ రచయిత్రి SKU కి తెలియచేయండి.
|
|