|
నాకు తెలిసిన ఒకాయన నాకు కొన్నాళ్ళ క్రితం ఒక మైల్ పంపించారు. అది ఆయనకి జరిగిన ఒక
చేదు అనుభవం గురించి. అది చదివి, నేను చేసిన కామెంట్ల వలన ఆయన మనసు కష్టపెట్టుకొని
తన స్నేహితురాలిని అయి వుండీ నేను తనని అర్థం చేసుకోలేదని అన్నారు. ఆయనకి నేను
చెప్పేది అర్థం కాలేదు అని నేను ఆ జరిగిన విషయాన్ని నాకు తెలిసిన ఒక యాహూ గ్రూప్ లో
పోస్ట్ చేసాను. అక్కడ కూడా ఎంతో మంది ఆయన సున్నితమైన మనస్థత్వం ఈ రోజులకి తగదు అని
అన్నారు. ఈ చెప్పటానికి కొంతమంది harsh పదాలు వాడితే, కొంతమంది సున్నితంగా
చెప్పారు. మళ్ళీ నా friend కి ఆవేశం వచ్చింది. నన్ను అన్నట్టే అక్కడా తనని ఎవరూ
అర్థం చేసుకోలేదని "పేద్ధ" ఉత్తరం రాసారు. ఆయన బాధని అర్థం చేసుకోలేని కొందరు ఆ
పెద్ద వుత్తరం చదివే బాధకి ఎక్కువ బాధ పడ్డారు.
ఏంటీ ఈ సోది అని ఇప్పుడు మీరు నన్ను తిడతారెమో! ఇంక నాన్చకుండా అసలు విషయానికి
వస్తా..
మంచి ఎండాకాలం, వైజాగ్ నగరం. కరెంటు బిల్లు కట్టడానికి ఆఖరు రోజు. నా friend ఈశ్వర్
బిల్లు కట్టడానికి కరెంటు ఆఫీసుకి వెళ్ళారు. అక్కడ ఎప్పటిలాగే చాంతాడంత లైను వుంది.
ఆఖరి రోజు కావడం తో మరింత ఎక్కువ మంది జనాలు వున్నారుట. సూర్యుడు గారు
మండిపడుతున్నారుట. జనాలు మండుటెండలో చెమటలు కారుతూ, నెమ్మదిగా పని చేస్తున్న
క్లర్క్ గారిని తిట్టుకుంటూ, గాలి విసురుకుంటూ, ఎండ నుంచి తలకాయలని కాపాడుకోవటానికి
కష్టపడుతూ నుంచున్నారట. ఈశ్వర్ కి దాహం వేసి మంచినీళ్ళ కోసం ఆఫీసు లోకి వెళ్ళి
చూసారుట. అక్కడ మంచినీళ్ళు లేవు!
ప్రక్కనే తను పని చేసే ఆఫీసు కనుక, తన బిల్లు, డబ్బులూ అక్కడే వున్న తెలిసున్న
వ్యక్తి కి ఇచ్చి, మంచి నీరు తాగటానికి తన ఆఫీసుకి వెళ్ళారుట. తన దాహం తీర్చుకొని,
తిరిగి వచ్చేస్తుండగా, తన లాగే మంచినీళ్ళు లేక, దాహం తో ఇబ్బంది పడుతున్న ఇతర
వ్యక్తులని తలచుకొని, వారికి కాసిని మంచి నీళ్ళు తీసుకువెళ్ళితే తన సొమ్ము ఏమీ
అరిగిపోదని తలచి, రెండు సీసాల నిండా చల్లటి మంచి నీరు పట్టుకొని, సైకిలు
తొక్కుకుంటూ తిరిగి కరెంటు ఆఫీసు కి వచ్చారుట.
ఈయన మంచి నీరు ఇవ్వగానే అందరికీ ప్రాణాలు లేచి వచ్చినట్టు అయి వాటి కోసం
ఎగబడ్డారుట. నీళ్ళు అయిపోయాయి కానీ, దాహం తో వున్న ఇంకా కొంతమంది ని చూసి, ఈశ్వర్
మరి కాసిని నీరు తేవటానికి మళ్ళీ వెనక్కి వెళ్ళారుట. ఆ వెళ్తుండగా, సైకిల్ ని ఎవరో
గుద్దేయటం తో పాపం దెబ్బ కూడా తగిలిందట!
మళ్ళీ మంచినీరు పుచ్చుకొని కరెంటు ఆఫీసుకి వచ్చి, అక్కడ నీళ్ళ కోసం చూస్తున్న
కొంతమందికి ఇచ్చారుట. ఈయన ఈ విధంగా మంచి నీరు ఇవ్వటం చూస్తున్న ఒకాయనని "మీకూ
కావాలా సార్?" అని అడిగారుట.
దానికి ఆ వ్యక్తి, "ఏం బాబూ.. అవి మంచి నీరేనా.. లేక ఏమైనా కలిపి తెచ్చావా?" అని
అడిగారుట.
ఆయన అంటున్నది ఒక్క క్షణం అర్థం చేసుకోలేదు కానీ అర్థం అయ్యేసరికి ఈశ్వర్ కి కోపం
తో నోట మాట రాలేదుట. తను మానవతా దృక్పధం తో సాయం చేయబోతే ఆయన దానికి తీసిన
పెడర్థాలు అతను జీర్ణించుకోలేక పోయారు.
అవి మంచి నీరే అని అతనికి నిరూపించటానికి తనే ఆ నీళ్ళన్నీ గడగడా తాగేసి, "అనుమానం
తీరిందా సార్?" అని అడిగి, ఇంక అక్కడ నిలవలేక, తన స్నేహితుడికి చెప్పి, అక్కడనుంచి
వచ్చేసారుట.
* * *
ఈ విషయం నాకు ఈశ్వర్ చెప్పినప్పుడు ఎంతో బాధ పడ్డాను.
"ఆయన అలా అనటం తప్పే, కానీ, నేనే కనుక ఆయన పరిస్థితిలో వుంటే, మీరిచ్చిన మంచి నీరు
తీసుకొనే దాన్ని కాదు" అని చెప్పాను.
దీనికి ఈశ్వర్ కి కోపం వచ్చి, "అతనికీ, నీకూ అసలు తేడా లేదు. మీరు చెయ్యరు, చేసే
వాళ్ళని చెయ్యనియ్యరు" అని అన్నారు.
కానీ, నేను అంతే. నాకు తెలీని వ్యక్తులు ఇచ్చిన తినుబండరం అవనీయండి, సాయం అవనీయండి
నాకు తీసుకోబుద్ధి కాదు. నేను చేయగలిగితే, చేస్తాను. లేకపోతే, మూసుకొని
కూర్చుంటాను. అంతగా ఎండలో నెలబడలేను అనిపిస్తే, ఇంటికి వెళ్ళిపోయి, మర్నాడు ఫైన్ తో
వచ్చి కడతాను. నన్ను పారనాయిడ్ అనండి లేక మరొకటి అనండి. ఇంక సాయం చెయ్యటం అంటారా..
చేసేటప్పుడు నా ఇంగిత జ్ఞానం ని ఉపయోగిస్తాను. అది ఈ పరిస్థితిలో ఇలా వుంటాను అని
చెప్పేది కాదు.
ఇలా మా ఇద్దరి మధ్యా వాదోపవాదాలు అయ్యాయి. తరువాత ఆ గ్రూప్ లో కూడా అతన్ని
సమర్థించిన వారు కొంతమంది, కాదు, ఈశ్వర్ ది మూర్ఖత్వం అని కొంతమంది అన్నారు.
కొన్నాళ్ళకి ఆ విషయం అందరం మర్చిపోయాము.
* * *
ఇవాళ నాకు జరిగిన ఒక అనుభవం నాకు ఆ సంగతిని మళ్ళీ జ్ఞప్తి కి తెచ్చింది. అదేమిటి
అంటే...
మామూలుగా ప్రతీ శుక్రవారం మా friends అంతా సినిమా ప్రోగ్రాం' వేసుకుంటాం. ఆఫీస్
నుండి బయలుదేరుతుండగా నాకు సన్నగా తలనొప్పి మొదలు అయింది. నాకు మెగ్రైన్ వుంది.
కనుక, తలనొప్పి తగ్గకపోతే, సినిమా ఎంజాయ్ చేయలేనని వెంటనే తలనెప్పి మాత్ర
వేసుకున్నాను. బయలు దేరే హడావిడి లో మాత్ర వేసుకోవడం తో, అది సరిగ్గా గొంతు దిగిందో
లేదో చూసుకోలేదు. అప్పుడు ఏమీ అనిపించలేదు మరి!
గంట ట్రైన్ ప్రయాణం చేసి, బస్ ఎక్కాను. ఎక్కుతూనే, గొంతులో ఎదో అడ్డం పడినట్టు
అనిపించింది. ఇందాకా వేసుకున్న మాత్ర అయివుంటుందని నిశ్చయించుకొని, దానిని లోపలికి
తోయటానికి ప్రయత్నించాను. కానీ నేను చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి, అది ఇంకా
ఇంకా పైకి వస్తున్నట్టు అనిపించింది. అది కానీ నోట్లోకి వచ్చిందంటే, నోరంతా బీభత్సం
అయిపోతుంది. నేను పెద్ద సీన్ చేసేస్తానెమో అని భయం వేసింది కూడా.
బస్ లో నేను కాక ఇంకో ఇద్దరు వున్నారంతే. ఇద్దరూ నిద్రోతున్నారు. సరే అని వెళ్ళి
డ్రైవర్ అమ్మాయిని అడిగాను "మీ దగ్గర మంచినీళ్ళు వున్నాయా? నా గొంతులో ఇందాకా
ఎప్పుడో వేసుకున్న మాత్ర అడ్డం పడింది" అని.
ఆవిడ మెక్ డోనాల్డ్ బర్గర్ తింటూ, దాన్ని లోపలికి నెట్టడానికి ఒక కోక్ కేన్ తెరచి
పెట్టుకొని, దానిని మధ్య మధ్య లో తాగుతూ, ఒంటి చేత్తో వీరనారి లా ఎదో కూని రాగం
తీస్తూ బండి తోలుతున్నారు. నన్నూ, నా రంగులు మారుతున్న మొఖాన్నీ చూసి ఎక్కడ
భళ్ళుమంటానో అని భయపడ్డారు.
"నా దగ్గర ఈ కోక్ ఒక్కటే వుంది" అని అపాలిజిటిక్ గా అన్నారు.
నాకు అర్థం కాలేదు. ఆవిడకి నేను తన కేన్ లో తాగటం ఇష్టం లేదా లేక నాకు ఏమన్నా
అభ్యంతరమా అని అడుగుతున్నారా అని సందేహం వచ్చిది. "ఈవిడని ఎందుకులే ఇబ్బంది
పెట్టడం.. " అని "ఫర్లేదు లెండి.. ఇంటికి వెళ్ళిపోతాను" అని వెళ్ళి నా సీట్ లో
కూర్చున్నాను.
కానీ గొంతు మీద చేత్తో రాసుకుంటున్న నన్ను అద్దం లో చూసి, బస్ ప్రక్కకి ఆపి, ఆ కేన్
తెచ్చి ఇచ్చారు.. "తాగు" అని.
ప్రాణం లేచొచ్చినట్టు అయి, రెండు గుక్కల్లో కేన్ ఖాళీ చేసి, నా గొంతులో అడ్డంపడి,
లోపలికి వెళ్ళనని మారాం చేస్తోన్న మాత్రని తరిమి కొట్టాను. ఈవిడ నాకు చేస్తోన్న
సపర్యలు చూసి మెళకువ వచ్చిన మిగిలిన ప్రయాణీకులు తమకి తోచిన సలహా ఇచ్చారు దాన్ని
లోపలికి పంపేందుకు. గొంతులోంచి బయటకి వస్తానని భయపెడుతూ మాత్ర లేదు కనుక, నేను
కూడా, అంతవరకూ నేను అనుభవించిన నరకం గురించి చెప్పాను. అలా అనుభవాలు చెప్పుకుంటూ,
నా గమ్యం చేరగానే, బస్సు డ్రైవర్ అమ్మాయికి శతవిధాల నా కృతజ్ఞతలు తెలియచేసుకొని,
"మళ్ళీ కలుద్దాం" అని మాటపుచ్చుకొని, బస్ దిగాను.
* * *
ఈ సంఘటనకీ పైన ఈశ్వర్ సంఘటనకీ ఏ విధమైన పోలికా లేదు. కానీ అప్పుడు నేను ఎంత
ఖచ్చితంగా నాకు ఎవరి సాయం అక్కర్లేదు, నా బాగు నేను చూసుకోగలను అని చెప్పానో
ఇప్పుడు తలచుకొని, ఆశ్చర్యపడ్డాను.. నా మీద నాకున్న అతి నమ్మకానికీ, నాకు ఎటువంటి
క్లిష్టమైన పరిస్థితులూ రావన్న భ్రమ కీ నవ్వుకున్నాను!
మన పెద్దాళ్ళు ఊరికే అన్నారా.. "తనదాకా వస్తే" అని!
|